కరోనా మిస్టరీలు

Coronavirus: Mysteries Of Coronavirus Special Story - Sakshi

జ్వరం... దగ్గు... జలుబు ఉంటే కరోనా కావచ్చు.. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లారా... మీకు వైరస్‌ సోకి ఉండవచ్చు.. మీ పరిసరాల్లో ఎవరైనా కరోనా రోగి ఉన్నారా? అయితే మీరూ ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ! ఇటీవలి కాలంలో తరచూ వింటున్న మాటల్లో ఇవి కొన్ని. వాస్తవాలు కూడా.. అయితే... దాదాపు వంద రోజుల కరోనా ప్రస్థానంలో అన్నీ మనకు తెలిసినవే లేవు. తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయి... శాస్త్రవేత్తల మెదళ్లను వేడెక్కిస్తున్నవి కూడా బోలెడున్నాయి!

మైసూరు రహస్యం?

మైసూరు జిల్లా నంజనగూడులో ఓ 35 ఏళ్ల కరోనా బాధితుడున్నాడు. పేషెంట్‌ 52.. అని పిలుద్దాం ఇతడిని. ఫార్మా కంపెనీలో ఉద్యోగం. మార్చి 26న వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విదేశాలకు పోయింది లేదు... కరోనా రోగులతో కాంటాక్ట్‌ అయ్యిందీ లేదు. పది రోజులు తిరక్కుండానే పేషెంట్‌ 52 పనిచేసే ఫార్మా కంపెనీలో మరో 24 మంది కూడా వైరస్‌ బారిన పడ్డారు. ఎలా...? మైసూరు జిల్లా యంత్రాంగం ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునే పనిలోనే ఉంది. ఇప్పటికైతే మార్చి నెలలో చైనా నుంచి వచ్చిన ఓ ప్యాకేజీపై అనుమానం వ్యక్తమవుతోంది. మందుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి చెన్నైకి.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నంజనగూడుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 

ప్యాకేజీ నమూనాలను సేకరించి పుణే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరలాజీకి పంపామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారు అధికారులు. చైనాలో వైరస్‌ ఉధృతి బాగా ఉందని తెలిసీ మందులెలా తెప్పించారని.. ఆ కంపెనీపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్‌ చేస్తూ ఉండగా.. అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. ప్యాకేజీ ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందా? అని ప్రశ్నించుకుంటే ఇండియన్‌ డ్రగ్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన ఒక ప్రకటనను గుర్తు చేసుకోవాలి. చైనాలోని హుబే ప్రాంతం నుంచే మనకు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు వస్తున్నాయని, ఆ ప్యాకేజీల ద్వారా వైరస్‌ సోకేందుకు అవకాశాలు లేకపోలేదని ఈ సంస్థ అప్పట్లో హెచ్చరించింది. ఏ విషయమూ స్పష్టంగా తెలిసేంత వరకూ పేషెంట్‌ 52కు వైరస్‌ ఎలా సోకింది అనేది మిస్టరీగానే ఉండిపోతుంది. 

పులిరాజాకు వైరస్‌ ఎలా వచ్చింది?
న్యూయార్క్‌లో ఓ మలేసియా పులికి కరోనా వైరస్‌ సోకిందనే వార్త మీరు చదివే ఉంటారు. కానీ ఎలా వచ్చిందనేది మాత్రం ఇప్పటివరకూ ఓ మిస్టరీనే. బ్రాంక్స్‌ జంతు ప్రదర్శనశాల సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలోనే ఉన్నారు. లక్షణాలేవీ కనిపించని మానవ కరోనా బాధితుడి నుంచి నాదియా అని పిలుస్తున్న పులికి వైరస్‌ సోకి ఉంటుందని కొంతమంది అంచనా వేస్తున్నప్పటికీ... సిబ్బందిలో ఎవరికీ కరోనా లేదని పాల్‌ కల్లే అనే వైద్యుడు చెబుతుండటం గమనార్హం. అడవిలో ఉండే జంతువులను మచ్చిక చేసుకోవడం లేదా వేటాడటం వల్ల వాటిల్లోని వైరస్‌లు మనిషికి సోకుతాయని మనకు తెలుసుగానీ.. నాదియా విషయంలో జరిగింది దీనికి పూర్తిగా భిన్నం. మనిషి నుంచి జంతువుకు వైరస్‌ సోకింది? మార్చి 27.. ఇది ఈ పులికి వైరస్‌ సోకిందని తెలిసిన రోజు.

అయితే అంతకు 11 రోజుల ముందే జంతు ప్రదర్శనశాలను మూసివేశారు. అమెరికాలో వైరస్‌ కేంద్రంగా మారిన న్యూయార్క్‌లోనే ఈ జంతు ప్రదర్శనశాల ఉంది కాబట్టి కరోనా బాధితుల్లో ఒకరి నుంచి నాదియాకు సోకి ఉండవచ్చని అనుకున్నారు. కానీ దీన్ని నిరూపించడం ఎలా? అల్ట్రాసౌండ్‌ ద్వారా పరీక్షించినా, ముక్కులోని ద్రవాలు, రక్తం వంటి వాటిని సేకరించి, పరీక్షించి జంతువుల కోసమే ఉద్దేశించిన పరీక్షలు కూడా నిర్వహించారు. మనుషులకు సోకిన కరోనా వైరసే నాదియా శరీరంలోనూ ఉన్నట్లు స్పష్టమైంది. ఎలా అన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఒకవేళ మనుషుల నుంచి జంతువులకు సోకి ఉంటే మాత్రం భవిష్యత్‌లో పెద్ద చిక్కే పొంచి ఉన్నట్లు.. 

ఆ మరణం ఎలా?
కేరళలో కరోనా కారణంగా ఇటీవల ఒక వ్యక్తి మరణించారు. పోతెన్‌కోడ్‌ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తికి కరోనా వైరస్‌ ఎలా సోకిందని ఆరా తీసేందుకు వైద్యాధికారులు చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. మరణించిన వ్యక్తి దగ్గరి బంధువులు, స్నేహితుల నుంచి తాజాగా సేకరించిన 19 నమూనాలు నెగెటివ్‌గా తేలగా.. అంతకుముందు సేకరించిన 97 నమూనాల్లోనూ వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదు. పోనీ ఆ వ్యక్తి వివాహం, ప్రార్థన, సమావేశం, అంత్యక్రియల్లాంటి వాటిల్లో పాల్గొన్నాడా? అని పరిశీలించినా అలాంటి ఆధారమేదీ కనిపించలేదు. దీంతో ఈ కేసును ఎవరికీ సంబంధం లేనిదిగా గుర్తించి వదిలేద్దామన్న ఆలోచనలో ఉన్నారు వైద్య సిబ్బంది.

కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉండే ఈ పోతెన్‌కోడ్‌లో కొన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నప్పటికీ అవన్నీ ఎలా వచ్చాయో స్పష్టమైంది. సమూహ వ్యాప్తికి మాత్రం ఆస్కారం లేదని ఇప్పటికే తీర్మానించారు. పోతెన్‌కోడ్‌లో మరణించిన వ్యక్తి మార్చి 10న కరెంటు ఆఫీసుకు వెళ్లాడని అంతకుముందు ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఒక సమావేశానికి హాజరయ్యాడని గుర్తించగలిగారు కానీ.. ఈ ప్రాంతాల నుంచి పాజిటివ్‌ కేసులేవీ లేవు. రెండుసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు కూడా ఈ వ్యక్తి ఎలాంటి లక్షణాలు కనపరచలేదు. 

జర్మనీలో తక్కువ మరణాలకు కారణం...
ప్రపంచం మొత్తమ్మీద శనివారం నాటికి కోవిడ్‌–19 బారిన పడి మరణించినవారు లక్షకుపైమాటే. అయితే చనిపోతున్న వేగం దేశాన్ని బట్టి మారుతోంది. కానీ.. జర్మనీలో ఇది అతి కనిష్టంగా ఎందుకు ఉందన్నది మాత్రం శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. వరల్డో్డమీటర్‌ వెబ్‌సైట్‌ లెక్కల ప్రకారం.. శనివారం జర్మనీలో 1.22 లక్షల మంది వ్యాధి బారిన పడగా 2,736గా ఉంది. ఇదే సమయంలో ఇటలీలో 1.47 లక్షల కేసులకు గాను మరణించిన వారు 18 వేలకుపైమాటే. స్పెయిన్‌లో 1.61 లక్షల కేసులకు గాను 16 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు కారణం ఏమిటన్నది తమకు అర్థం కావడం లేదని అంటున్నారు జర్మనీలోని రాబర్ట్‌ కోచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధికార ప్రతినిధి మారెకీ డీగెన్‌. 

ఆరోగ్యశాఖకు చెందిన ఈ సంస్థ వైరస్‌ కట్టడి చర్యలను పర్యవేక్షిస్తోంది. ఇటలీ, జర్మనీ రెండింటిలోనూ వయో వృద్ధులు ఎక్కువైనా ఒక దేశంలోనే ఎక్కువ మంది బలికావడం గమనార్హం. జర్మనీలో ఇతర దేశాల కంటే భిన్నంగా తీసుకున్న చర్యలు కూడా ఏవీ లేవు. కాకపోతే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు బాగా పనిచేస్తాయని వైరాలజిస్ట్‌ సెంట్‌మెర్‌ తెలిపారు. మరణాలు తక్కువగా ఉండేందుకు ఇదో కారణం కావచ్చునని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు కరోనా కోసం వేగంగా ఎక్కువమందికి పరీక్షలు జరపడం కూడా తమకు ఉపయోగపడి ఉండవచ్చని.. బాధితులను తొందరగా గుర్తించడం ద్వారా చాలామంది ప్రాణాలు దక్కి ఉండవచ్చునని వివరించారు. 

శేష ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి..
కరోనా వైరస్‌కు సంబంధించి ఇంకా చాలా మిస్టరీలే ఉన్నాయి. ఇటీవల తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో 23 రోజుల పసికందుకు ఈ వ్యాధి సోకిందని తెలిసింది. అలాగే కొంత కాలం క్రితం లండన్‌లోనూ ఓ నవజాత శిశువు వైరస్‌ కోరల్లో చిక్కుకుంది. ఇలా ఒకట్రెండు సంఘటనలను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఈ వైరస్‌ బారిన పడింది చాలా తక్కువ. దీనికి కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 11 వరకూ ఉన్న లెక్కల ప్రకారం తొమ్మిదేళ్ల లోపు వయసున్న వారు ఒక్క శాతం మాత్రమే ఉండగా, పది నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారు కూడా ఇదే స్థాయిలో ఉన్నారు. మరోవైపు 50 –59 మధ్య వయసుల వారి శాతం 25 కాగా, 60– 69 మధ్య వయసుల వారి శాతం 19గా ఉంది.

జలుబు కలిగించే వైరస్‌లకు పిల్లలు అలవాటు పడి ఉండటం వల్ల ఇలా జరుగుతోందని కొందరు చెబుతున్నా స్పష్టమైన కారణాలైతే తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అధిక రక్తపోటు ఉన్న వారు కరోనా కారణంగా మరణించేందుకు ఎక్కువ అవకాశాలు ఉండటంపై కూడా శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇలాంటి వారిలో గుర్తించిన ఇతర సమస్యలు ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని లివర్‌పూల్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌కు చెందిన టామ్‌ వింగ్‌ఫీల్డ్‌ అంటున్నారు. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారిలో ఎక్కువ మంది మధుమేహులు అయ్యేందుకు, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోయేందుకు అవకాశాలు ఉంటాయని, అయితే ఈ కారణాలతోనే కోవిడ్‌ బారిన పడినప్పుడు వీరు మరణిస్తున్నారా? అన్నది నిర్ణయించాల్సి ఉంది. 

తండ్రికి వైరస్‌.. కొడుక్కి నెగెటివ్‌..
కర్ణాటకలోని బాగల్‌కోటలో 75 ఏళ్ల వ్యక్తి ఇటీవల కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈయన స్వయంగా విదేశాలకు వెళ్లిందీ లేదు. ఇరుగు పొరుగులో ఎవరికీ వైరస్‌ కూడా సోకలేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈయన కొడుకు బెంగళూరు నుంచి వచ్చాడని తెలుసుకున్న అధికారులు.. ముసలాయనకు వైరస్‌ ఎలా సోకిందో అర్థమైపోయిందనుకున్నారు. కొడుక్కు పరీక్షలు చేయించారు. ఆశ్చర్యకరంగా అతడిలో వైరస్‌ లేదని నిర్ధారణ అయ్యింది. అదెలా? అని జిల్లా యంత్రాంగం తలబద్దలు కొట్టుకుంటూనే ఉంది. ఈ లోపు ఆ ముసలాయన నివసించిన ఇంటి నుంచి కనీసం అర కిలోమీటర్‌ దూరం వరకూ మొత్తం బంద్‌ పెట్టేశారు. ఒక్కో ఇంటికి వెళుతూ ఎవరైనా కోవిడ్‌ బారిన పడి తమకు తెలపకుండా ఉన్నారా? అని వెతకడం మొదలుపెట్టారు.

చనిపోయిన వ్యక్తి నూనెలు అమ్ముకునే వ్యక్తి కావడంతో అతడి వినియోగదారుల్లో ఎవరైనా వైరస్‌ను మోస్తూ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చివరకు ఈ వెతుకులాట ఫలితంగా పోలీసులకు ఒక కొత్త విషయం తెలిసింది. బెంగళూర్‌ నుంచి వచ్చిన కొడుకు మరో ఆరుగురితో కలసి ప్రయాణించాడని.. హమ్మయ్యా అనుకున్న పోలీసులు వారందరినీ వెతికి నిర్బంధంలో ఉంచారు. నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు కూడా. వీరిలో ఎవరికైనా వైరస్‌ ఉందని స్పష్టమైతే ముసలాయనకు వ్యాధి ఎలా వచ్చిందో తెలిసిపోతుంది. లేదంటే..?

ముందు నెగెటివ్‌.. తర్వాత పాజిటివ్‌...
కరోనా వైరస్‌ పుట్టిల్లు వూహాన్‌లో వైద్యులకు, శాస్త్రవేత్తలకు అంతుపట్టని మిస్టరీ ఒకటి చోటు చేసుకుంటోంది. ఒకసారి కరోనా బారిన పడి తేరుకున్న వారిలో ముందుగా నెగెటివ్‌ సూచించినా... కొంత సమయం తర్వాత పరీక్షల్లో పాజిటివ్‌ రావడం ఆశ్చర్యపరుస్తోంది. మార్చి 18 నుంచి 22 మధ్య వూహాన్‌లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో గత ఏడాది డిసెంబర్‌ ఆఖరులో మొదలైన వైరస్‌ శాంతించిందని భావించారు. కానీ.. వ్యాధి నయమైన కొందరిలో మళ్లీ వైరస్‌ కనిపించింది. వూహాన్‌లోని వేర్వేరు క్వారంటైన్‌ కేంద్రాల సమాచారం మేరకు ఐదు నుంచి పది శాతం మందిలో మళ్లీ పాజిటివ్‌ కనిపిస్తోంది. వీరిలో కరోనా లక్షణాలు కనిపించకపోవడం మిస్టరీగా మారింది. కొన్ని రోజుల నుంచి వారాల వ్యవధిలో రెండో పరీక్ష జరగ్గా అంత వేగంగా వైరస్‌ మళ్లీ సోకే అవకాశాలు తక్కువేనని వైరాలజిస్టులు చెబుతున్నారు. మొదటిసారి పరీక్షల్లో వారికి తప్పుగా నెగెటివ్‌ వచ్చిందా.

తరువాతి పరీక్షల్లో తప్పు జరిగిందా? అన్నది అర్థం కావడం లేదు. రెండో పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారు వైరస్‌ను వ్యాపింపజేస్తారా? లేదా? అన్నది కూడా స్పష్టంగా తెలియకపోవడంతో ప్రస్తుతానికి వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. చైనాలో సార్స్‌ తరహా వైరస్‌ ఒకటి వ్యాపిస్తోందని అందరికంటే ముందుగా హెచ్చరించిన డాక్టర్‌ లీ వెన్‌ లియంగ్‌కు కూడా చాలాసార్లు నెగెటివ్‌ వచ్చిన తరువాత గానీ ఒకసారి పాజిటివ్‌ రాలేదు. అయితే చైనాలో వైరస్‌ నిర్ధారణకు ఉపయోగిస్తున్న న్యూక్లియిక్‌ ఆసిడ్‌ టెస్ట్‌ కచ్చితత్వం తక్కువని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ డైరెక్టర్‌ వాంగ్‌ చెన్‌ స్వయంగా ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top