మోదీ ముందుంది అతి పెద్ద సవాల్‌!

Corona Virus: How to Face Economic Crisis In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలతో పాటు భారత దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతుంది. ప్రస్తుత ప్రాథమిక అంచనాల ప్రకారం నెల రోజుల లాక్‌డౌన్‌ వల్ల జాతీయ స్థూల ఉత్పత్తిలో వార్షిక ఉత్పత్తి 8.5 శాతం తగ్గుతుంది. అంటే ఈ ఏడాది జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 0.5 శాతానికి మించదు. జీడీపీలో వినిమయం మాత్రం సాధారణంగా 63 శాతం ఉంటుంది. లాకౌడ్‌ వల్ల ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోయి, ప్రభుత్వ సహాయం అందక వినిమయం ఆరు నుంచి ఎనిమిది శాతం తగ్గవచ్చు. అయినప్పటికీ వినిమయం 55–57 శాతం ఉంటుంది. (ప్రధానితో కాన్ఫరెన్స్: అందరి నోట అదే మాట!)

ఈ అత్యయిక ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికా రెండు లక్షల కోట్ల డాలర్లు, అంటే తన జీడీపీలో పది శాతాన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద ప్రకటించింది. జపాన్‌ లక్ష కోట్ల డాలర్లు, అంటే తన జీడీపీలో 20 శాతాన్ని, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు తమ జీడీపీలో 5 శాతాన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలుగా ప్రకటించాయి. ఇక భారత్‌లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం 1.7 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. అదీ భారత జీడీపీలో 0.6 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్‌ దేశాలు తమ జీడీపీ వృద్ధిరేటుకన్నా ఐదారింతలు ఎక్కువగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించగా, మోదీ ప్రభుత్వం భారత జీడీపీ వృద్ధి రేటులో ఐదారింతలు తక్కువగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. (కరోనా: ఇటలీ మరోసారి కీలక నిర్ణయం)

భారత్‌ జీడీపీలో ఆటోమొబైల్‌ రంగం వృద్ధి రేటే అత్యధికంగా 7.5 శాతం ఉంటూ వచ్చింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించినప్పుడు దాని ప్రభావం ఈ రంగంపై పడి అమ్మకాలు ఘోరంగా పడిపోతాయి. ఈ రంగంపైనే  భారత ప్రభుత్వం అత్యధికంగా జీఎస్టీ వసూలు చేస్తోంది కనుక ఆ ఆదాయం కూడా భారీగా పడి పోతుంది. భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది కార్మికులే. వారిలో సగానికి సగం మంది వ్యవసాయ కూలీలే. వారిలో 13.5 కోట్ల మంది ఉపాధికి ఎలాంటి గ్యారెంటీ లేదు. వారంతా దినసరి కూలీలు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ముందుగా రోడ్డున పడుతున్నది వీరే. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం రేటు 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా ఉంది. (టర్కీలో అద్భుతం.. కేవలం 10 రోజుల్లోనే..)

అత్యయిక ఆర్థిక పరిస్థితి కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న రిజర్వ్‌ నిధుల్లో ఇప్పటికీ మోదీ ప్రభుత్వం డ్రా చేసుకోగా, బ్యాంకు వద్ద కేవలం 9.2 శాతం లక్షల కోట్లు మాత్రమే మిగిలాయి. ఇలాంటి పరిస్థితిలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా ఉంది. నరేంద్ర మోదీ బలమైన నాయకుడు అయనప్పటికీ ఆర్థిక వ్యవహారాలు చూస్తున్న ఆయన మిత్రులంతా బలహీనులే. అలాంటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని ఎలా ఉద్దరిస్తారన్నది కోటి రూకల ప్రశ్న. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top