పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్‌ ఓకే

Citizenship Amendment Bill Passes In Rajya Sabha - Sakshi

రాజ్యసభలో 125–99 ఓట్లతో గట్టెక్కిన బిల్లు

త్వరలో రాష్ట్రపతి ఆమోదంతో చట్టరూపం

ముస్లింలకు వ్యతిరేకం కాదన్న అమిత్‌ షా

ఇది న్యాయ సమీక్షకు నిలవదన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: మరో వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం, ఆ స్థాయిలో విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్న పౌరసత్వ (సవరణ) బిల్లు బుధవారం రాజ్యసభ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిఖ్‌ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై రాజ్యసభలో దాదాపు ఆరున్నర గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని విపక్షాలు తూర్పారబట్టాయి. బిల్లును ప్రవేశపెడ్తూ, ఆ తరువాత చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్‌ షా బిల్లుపై నెలకొన్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారు భారతీయ పౌరులుగా కొనసాగుతారని, ఈ బిల్లుతో వారికి ఏ సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు.  

సునాయాసంగానే: రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కొంత ఉత్కంఠ నెలకొంది. మిత్రపక్షాలు జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌తో పాటు అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ బిల్లుకు మద్దతివ్వడంతో  మెజారిటీ ఓట్లు సాధించింది. అంతకుముందు, బిల్లును సమగ్ర అధ్యయనం కోసం సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనిపై ఓటింగ్‌ జరగ్గా, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 124 ఓట్లు, అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు ఇతర సవరణలను  సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు, శివసేనకు చెందిన ముగ్గురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ, ఎన్సీపీలకు చెందిన ఇద్దరు చొప్పున ఎంపీలు, ఒక టీఎంసీ సభ్యుడు గైర్హాజరయ్యారు. ఉభయసభల ఆమోదం అనంతరం, బిల్లును రాష్ట్రపతి
ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత అది చట్టరూపం దాలుస్తుంది.

ముస్లింలకు వ్యతిరేకం కాదు: బిల్లులో ముస్లింలను మినహాయించడంపై పలువురు సభ్యులు విమర్శలు చేశారు. దానిపై స్పందిస్తూ.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని షా చెప్పారు. 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని, ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు.

ఆర్టికల్‌ 14కి ఉల్లంఘన కాదు
కాంగ్రెస్‌ నేతలు పాకిస్తాన్‌ నాయకుల్లా మాట్లాడుతున్నారని అమిత్‌ షా విమర్శించారు. ‘ఈ బిల్లు కానీ, గతంలో సభ ఆమోదం పొందిన ట్రిపుల్‌ తలాఖ్, ఆర్టికల్‌ 370 రద్దు బిల్లులు కానీ.. ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది.

ఆ  తప్పును సరిదిద్దేందుకే ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చింది’ అన్నారు. కాంగ్రెస్‌ ఈ విషయంలో రెండు నాలుకలతో మాట్లాడుతోందన్నారు. ‘గతంలో ఇదే కాంగ్రెస్‌ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్‌ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది’ అని విమర్శించారు. సమానత్వ హక్కును ప్రసాదించే రాజ్యాంగ అధికరణ 14కి కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదని అమిత్‌ షా స్పష్టం చేశారు. సహేతుక కారణాలతో పార్లమెంట్‌ చట్టాలు చేయడాన్ని ఆర్టికల్‌ 14 నిరోధించదన్నారు.  

మా మేనిఫెస్టోలోనే చెప్పాం
అంతకుముందు, బిల్లును సభలో ప్రవేశపెడ్తూ అమిత్‌ షా.. ఈ బిల్లు విషయంలో భారతీయ ముస్లింలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు భారతీయులుగానే కొనసాగుతారన్నారు. అనవసరంగా ముస్లింలకు తప్పుడు సమాచారం పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. పౌరసత్వ బిల్లు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలోనే ఉందని, దానికి అనుకూలంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారన్నారు. ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడలేదని, ఎన్నికలకు ముందే ఈ విషయమై హామీ ఇచ్చామని తెలిపారు.

ఈ బిల్లు కేవలం మూడు పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వివక్షకు, వేధింపులకు గురైన హిందూ, పార్శీ, జైన్, సిఖ్, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదేనని వివరించారు. పొరుగుదేశాల్లో దారుణమైన వివక్ష ఎదుర్కొని, భారత్‌కు వచ్చిన ఆ ఆరు మతాలకు చెందిన లక్షలాది శరణార్ధులకు భారత్‌లో విద్య, ఉద్యోగం, జీవనోపాధి కల్పించే సదుద్దేశంలో ఈ చరిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామన్నారు. వారు భారత్‌లో ఏర్పాటు చేసుకున్న దుకాణాలను రెగ్యులరైజ్‌ చేసే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వ కల్పించాలని కోరుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం?’ అని విపక్షాలను ప్రశ్నించారు.

ప్రసారాల నిలిపివేత
విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లును సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో కొద్దిసేపు సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. 

చరిత్రలో మైలురాయి: మోదీ
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కాగా, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన ఈ రోజు భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. ఇది విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయం అన్నారు. మరోవైపు, ఈ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సంకేతాలిచ్చారు. పార్టీ తరఫున కోర్టుకెళ్తామని సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ వెల్లడించారు. బిల్లు రాజ్యాంగబద్ధతపై పలు అనుమానాలున్నాయని, అందువల్ల కోర్టులో సవాలు చేసే అవకాశముందని అభిషేక్‌ మను సింఘ్వీ తెలిపారు.  

కోర్టు కొట్టివేస్తుంది
ఈ బిల్లును కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. మత ప్రాతిపదికన రూపొందిన ఈ బిల్లు న్యాయ సమీక్షకు నిలవబోదని హెచ్చరించాయి. ‘ఈ బిల్లు భారత రాజ్యాంగ మౌలిక భావనలకు వ్యతిరేకం. ఇది వివక్షాపూరితంగా, విబేధాలు సృష్టించేలా ఉంది’ అని కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ విమర్శించారు. ‘హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ మీరు రాజ్యాంగ సవరణ చేయడం లేదు. చట్టాన్ని చేస్తున్నారంతే. ఇది న్యాయసమీక్షకు నిలవబోదు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. దీన్ని కోర్టు కచ్చితంగా కొట్టేస్తుంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ సభ్యుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ బిల్లు బీజేపీ హిందూత్వ ఎజెండాలో భాగంగా, నాజీ కాఫీ బుక్‌ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా ఉందని టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రెయిన్‌ వ్యాఖ్యానించారు.

బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యకర్తల కాగడాల ప్రదర్శన  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top