లోక్‌సభనూ తాకిన ఉల్లి ఘాటు

Chidambaram Attacks Sitharaman Over Remark On Onion Price Hike  - Sakshi

కిలో రూ.150కి చేరిన ధర

నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్‌ 

పార్లమెంటులో కాంగ్రెస్‌ నిరసన  

న్యూఢిల్లీ: ఉల్లి కొయ్యకుండానే కంట కన్నీరు తెప్పిస్తోంది. నిరుపేదలకు ఏమున్నా లేకపోయినా గంజన్నం, ఉల్లిపాయ ముక్క ఉంటే చాలు. అదే పంచభక్ష్య పరమాన్నాలతో సమానం. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో ఏకంగా రూ.150 కి చేరుకుంది. దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బంద్యోపాధ్యాయ జీరో అవర్‌లో ఉల్లిపాయ ధరల అంశాన్ని లేవనెత్తారు.  అక్రమ నిల్వల కారణంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కేంద్రం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీలు చిదంబరం, అ«దీర్‌ చౌదరి, గౌరవ్‌ గొగోయ్‌ ఇతర కాంగ్రెస్‌ నాయకులు ఉల్లి ధరలపై నిరసనకు దిగారు. నిరుపేదలు నిత్యం ఆహారంలో వాడే ఉల్లి ధరల్ని తగ్గించడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు.  

నేను ఉల్లిపాయలు ఎక్కువగా తినను: నిర్మలా సీతారామన్‌  
అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి ధరల్ని ప్రస్తావిస్తూ ఒక ఎంపీ మీరు ఉల్లిపాయలు తింటారా అన్న ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ ‘నేను ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినను. అందుకే ఎవరూ పెద్దగా విచారించాల్సిన పని లేదు’ అని అన్నారు. దీంతో విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే ఆమె తనను తాను సరిదిద్దుకొని ఉల్లి ధరలకు కేంద్రం పలు చర్యలు తీసుకుందని, ఎగుమతులకు అడ్డుకట్టవేసి దిగుమతుల్ని పెంచుతోందని వెల్లడించారు. టర్కీ, ఈజిప్టుల నుంచి కేంద్రం ఉల్లిపాయల్ని దిగుమతి చేస్తోందని తెలిపారు.  

సీతారామన్‌పై సెటైర్లు
సీతారామన్‌ ఉల్లిపాయలకు బదులుగా అవకాడోలు తింటారా అని కాంగ్రెస్‌ నేత చిదంబరం ప్రశ్నిస్తే అటు సామాజిక మాధ్యమాల్లోనూ సెటైర్లు హోరెత్తిపోతున్నాయి. ట్విట్టర్‌లో ఉల్లి ధరలు 9,793 ట్వీట్లతో ట్రెండింగ్‌లో ఉంటే, అందులో నిర్మలా సీతారామన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో 7,990 ట్వీట్లు ఉన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అని అంటే , నేను గాలి అంతగా పీల్చను అని మీరు సమాధానమిస్తారా అంటూ కేంద్ర మంత్రిపై నెటిజన్లు వ్యంగ్యా్రస్తాలు విసురుతున్నారు. మార్కెట్‌లో అమెరికా డాలర్‌ కంటే శక్తిమంతమైనది భారత్‌లో ఉల్లిపాయే అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు హోరెత్తిపోతున్నాయి.

పార్లమెంట్‌ క్యాంటీన్‌లో సబ్సిడీలు కట్‌!
పార్లమెంటు క్యాంటీన్లలో రాయితీలతో కూడిన ఆహార పదార్థాలకు మంగళం పాడేయనున్నారు. భారీ సబ్సిడీలతో క్యాంటీన్లను నడపడం సరికాదన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచనకు దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారు అంగీకరించడంతో సబ్సిడీ ఆహారానికి త్వరలో తెరపడనుంది. ఫలితంగా ఏడాదికి సుమారు రూ. 17 కోట్లు ఆదాకానుందని అధికారులు తెలిపారు. సబ్సిడీల ఎత్తివేత నిర్ణయం అమల్లోకి వస్తే చాలా వరకూ ఆహార పదార్థాల ధరలు ఇప్పుడున్న దానికి రెట్టింపు కావచ్చు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top