ప్రద్యుమ్నను హత్య చేసింది సీనియరే!

CBI Charge 16-Year-Old Student, Gurugram Cops Evasive - Sakshi

ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కేసులో అనూహ్య మలుపు

సీబీఐ విచారణలో వెల్లడి  

న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో హత్యకు గురైన ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్‌ కేసు అనూహ్య మలుపు తిరిగింది. పోలీసులు చెబుతున్నట్లుగా ఈ నేరానికి పాల్పడింది పాఠశాల బస్‌ కండక్టర్‌ కాదని సీబీఐ విచారణలో తేలింది. ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేశాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను  సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్‌ కండక్టర్‌ అశోక్‌ను అరెస్టు చేశారు.

అశోక్‌ దోషి అని నిరూపించేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు తమకు ఆనవాళ్లు కనిపించలేదనీ, హత్య మూడు నుంచి నాలుగు నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అనుమానితుల కాల్‌ డేటా పరిశీలించామనీ, సీసీటీవీ ఫుటేజీ పరీక్షించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించాక 11వ తరగతి విద్యార్థే నిందితుడని తాము తేల్చామని అధికారి చెప్పారు. పరీక్షను వాయిదా వేయించేందుకు సెప్టెంబరు 8న ఎవరో ఒకరిని చంపాలని నిందితుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడని అధికారి వెల్లడించారు. నిందితుడి తండ్రి మాట్లాడుతూ తమ కొడుకు అమాయకుడని చెప్పుకొచ్చారు. సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్‌ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top