ఉద్ధవ్‌పై కేసు నమోదు

Case Filed Against Shiv Sena Chief Uddhav Thackeray - Sakshi

ఔరంగాబాద్‌ : ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న క్రమంలో ప్రజా తీర్పును ధిక్కరిస్తూ రాష్ట్ర ప్రజలను వంచించారని ఆ పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేపై ఫిర్యాదు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ప్రజా తీర్పును అవమానించారని ఉద్ధవ్‌పై ఓ న్యాయవాది కేసు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌, శివసేన నేత ప్రదీప్‌ జైస్వాల్‌ పేర్లను కూడా న్యాయవాది రత్నాకర్‌ చౌరే తన ఫిర్యాదులో ప్రస్తావించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉద్ధవ్‌ ఠాక్రేతో సహా శివసేన, బీజేపీలు హిందుత్వ పేరుతో ఔరంగాబాద్‌లో ఓట్లు అభ్యర్థించాయని, ఎన్నికల అనంతరం కూటమి నుంచి ఉద్ధవ్‌ బయటకు రావడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని అన్నారు.

ఇది ప్రజా తీర్పును వంచించడమేనని, సీఎం పదవి కోసం ఉద్ధవ్‌ రాష్ట్ర ప్రజలను మోసగించారని చౌరే ఆరోపించారు. ఉద్దవ్‌ ఠాక్రే, చంద్రకాంత్‌ పాటిల్‌, ప్రదీప్‌ జైస్వాల్‌లపై తమను మోసం చేశారని ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. శివసేన ప్రతిపాదించిన రొటేషనల్‌ సీఎం ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఇరు పార్టీల మధ్య దోస్తీ బ్రేక్‌ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో జట్టుకట్టి ప్రభుత్వ ఏర్పాటకు శివసేన సంసిద్ధమైంది. శివసేన, ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగేలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మంత్రి మండలిలోనూ మూడు పార్టీలకు ప్రాతినిథ్యం దక్కేలా కసరత్తు కొలిక్కివచ్చినట్టు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top