నేటి బడ్జెట్‌పై ఆశలెన్నో


సాక్షి, ముంబై: ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ‘అచ్చే దిన్ ఆయేంగే’ (మంచి రోజులు వస్తాయి) అనే నినాదంతో చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చింది. ఎన్నోకల సమయంలో ముంబై అభివృద్ధికి మోడీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని ముంబైకర్లు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు, రైలు చార్జీలు, ఇంధన ధరలు పెరగడంతో సామాన్యులు బేజారవుతున్నాడు. మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ముంబైకి ఎంతమేర ప్రాధాన్యం ఇస్తారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.



ముంబైలో ప్రతీరోజు 75 లక్షల మంది ప్రయాణికులు లోకల్ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వానికి అందే ఆర్థిక వనరుల్లో లోకల్ రైళ్ల వాటా అత్యధికంగా ఉంటుంది.  ఏటా ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో ముంబైకర్లకు మొండిచేయి ఎదురవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ప్రకటించిన అనేక రైల్వే ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయి. తీవ్రజాప్యం వల్ల వీటి వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. నిధులు లేక కొన్ని ప్రాజెక్టులు అర్థంతరంగా నిలిచిపోయాయి.



కనీసం ఈ బడ్జెట్‌లోనైనా నిధులు మంజూరైతే అవి పూర్తవుతాయని నగరవాసులు భావిస్తున్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ) ద్వారా మూడు ప్రాజెక్టులు పూర్తిచేయాలని రైల్వే బోర్డు సంకల్పించింది. అందులో మొదటి ప్రాజెక్టు కోసం రూ.3,125 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టు పనులు జాప్యం కావడంతో అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు పెరిగింది. ఇందులో తొమ్మిది బొగీలున్న లోకల్ రైళ్లను 12, 15 బోగీలుగా మార్చే ప్రాజెక్టు కూడా ఉంది. రెండో ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు మంజూరు చేశారు. అనేక కారణాలవల్ల ఇవన్నీ పెండింగులోనే ఉన్నాయి.



 దీంతో ప్రాజెకుల్ట వ్యయం రూ.7,013 కోట్లకు చేరుకున్నా పనులు పూర్తికాలే దు. మూడో ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు మంజూరు చేస్తామని గత బడ్జెట్‌లో ప్రకటించినా, ఇప్పటికీ అవి విడుదల కాలేదు. దీంతో ఠాణే-సీఎస్టీ స్టేషన్ల మధ్య ఐదు, ఆరో రైల్వే లేన్ల పనులు పెండింగులోనే ఉన్నాయి. ఈ పనులు సమయానికి పూర్తయినట్లతే లోకల్ రైలు సేవలను మరింత మెరుగుపరిచేందుకు వీలు పడేది. ముంబై రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు నిర్మించడం, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించడం, రైల్వే ప్రమాదాల నివారణ, ప్లాట్‌ఫారాల ఎత్తు పెంచడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేదా సబ్‌వే నిర్మాణం వంటి దీర్ఘకాల డిమాండ్లపై మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ముంబైకర్లు కోరుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top