'మమత తల తెగ నరికి తెస్తే బహుమతి'
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగ నరికిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తానంటూ బీజేవైఎమ్ నాయకుడు యోగేష్ వార్ష్నే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆలీఘర్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలను తెగ నరికిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తానంటూ భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎమ్) నాయకుడు యోగేష్ వార్ష్నే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమ జయంతి సందర్భంగా బిర్భమ్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు పెల్లుబిక్కాయి. దీంతో పోలీసులు ర్యాలీ చేస్తున్న వారిపై లాఠీ చార్జి చేశారు.
ఈ ఘటనపై మాట్లాడిన యోగేష్.. మమత తల తెగ నరికి తన దగ్గరికి తీసుకొచ్చిన వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పూజ, రామ నవమి లాంటి వాటిని జరుపుకోనివ్వరని అన్నారు. ఇఫ్తార్ పార్టీలను మాత్రమే మమత నిర్వహిస్తారని.. ఆమె మద్దతు ముస్లింలకేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.