
కశ్మీర్ గవర్నర్ నరేంద్ర నాథ్ వొహ్రా (ఫైల్ ఫోటో)
శ్రీనగర్ : కశ్మీర్ గవర్నర్ నరీందర్‌నాథ్ వొహ్రా (82) పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం యోచిస్తోందనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పీడీపీ, బీజేపీల మధ్య పొత్తు చెడిపోవడంతో కశ్మీర్‌లో మంగళవారం నుంచి గవర్నర్ పాలన మొదలైన సంగతి తెలిసిందే. అయితే వొహ్రా పదవీకాలం జూన్ 27న ముగియనుండగా.. జూలైలో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. దక్షిణ కశ్మీర్ మీదుగా అమర్‌నాథ్ యాత్ర సాగనుండగా.. అక్కడ ఇప్పటికే ఉగ్రవాద కార్యకాలాపాలు పెరిగిపోవడంతో భద్రతా సమస్యలు తలెత్తాయి.
వొహ్రా అనంతరం కొత్త గవర్నర్‌ను నియమిస్తే కశ్మీర్ పాలనా, భద్రతా పరమైన వ్యవహారాలు తెలుసుకొనే సరికే నూతన గవర్నర్‌కు దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వొహ్రా పదవీ కాలం పెంపు తథ్యమని పలువురు భావిస్తున్నారు. 2016లో ముఖ్యమంత్రి ముఫ్తి మహ్మద్ సయ్యద్ మరణానంతరం కశ్మీర్‌లో ఆరు నెలలపాటు గవర్నర్ పాలన విధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పకుండా వొహ్రా చక్కదిద్దారు. మరోవైపు అమర్‌నాథ్ క్షేత్ర బోర్డులో వొహ్రా పరిపాలనా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఆగస్టు 26న యాత్ర ముగియనుంది.