మూతి కొరికి..ముద్దు పెట్టుకోవడం అంటే ఇదే!

మూతి కొరికి..ముద్దు పెట్టుకోవడం అంటే ఇదే! - Sakshi

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులంటూ ఉండరనేది పాత నానుడే. అయితే తాజా లోకసభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీని చావుదెబ్బ కొట్టి చల్ల అమిత్ షా తాగించాడనేది కాదనలేని వాస్తవం. ఎన్నికల ఫలితాల వెల్లడి కావడానికి కొద్ది గంటల వరకు ప్రధాని పదవిపై ఆశలు పెంచుకున్న సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ నమ్మకాన్ని తుంగలో తొక్కిన వ్యూహం వెనుక 'షాడో ప్రైమ్ మినిస్టర్' అమిత్ షాదే కీలక పాత్ర.  దేశవ్యాప్తంగా ఏ కాంగ్రెసేతర పార్టీ సాధించని విధంగా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం వెనుక అమిత్ షా కృషి ఎనలేనిది. 

 

ఉత్తరప్రదేశ్ లో బీజేపీని పటిష్టం చేయడంలో అమిత్ షా రచించిన వ్యూహాలకు బ్రహ్మండమైన ఫలితాలు వచ్చాయి. బీజేపీ ఫలితాలు ఢిల్లీ కోటపై ఆశలు పెంచుకున్న బీఎస్పీ, సమాజ్ వాదీ, కాంగ్రెస్, అర్ఎల్డీలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. బీజేపీ ప్రభంజనం కారణంగా మాయావతి పార్టీ బీఎస్పీకి పార్లమెంట్ లో ఒక్క సీటు కూడా దక్కలేదు. రాహుల్ గాంధీ ఓటిమి బారి నుంచి తప్పించుకుని విజయాన్ని చేజిక్కించుకున్నారు. అయితే అదంతా ఎన్నికలకు ముందు వ్యవహారం. ఎన్నికలు శాంతియుతంగా ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆతర్వాత పార్టీల మధ్య ఉన్న వైరం, విభేదాలు మరిచిపోయారనేడానికి తాజా ఫోటోనే ఉదాహారణ. 

 

మోడీ ప్రమాణ స్వీకారం సందర్బంగా సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ చేయిని పట్టుకుని అమిత్ షా అప్యాయంగా లాక్కెలుతున్నారు. ఆ సన్నివేశానికి ముందు, వెనుక ఏం జరిగిందో ఏమో కాని.. ఫోటో చూస్తే మాత్రం గెలుపు ఓటముల పట్టింపు మాత్రం కనిపించడం లేదు. కాని ఉత్తర ప్రదేశ్ లో పార్టీలన్నింటికి దిక్కు దివాణం లేకుండా చేసిన అమిత్ షా.. ములాయంను పట్టుకెళ్లడం చూస్తే మాత్రం మూతి కొరికి ముద్దు పెట్టినట్టు ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడ కనిపించని ఓ మంచి సంప్రదాయం భారత దేశంలోనే కనిపిస్తుంది. అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థ అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని గర్వంగా చెప్పుకుందాం. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top