కంచుకోటలో ‘సూర్యుడు’ ఉదయించేనా?

In the 11 elections held till 2014 DMK has won seven times - Sakshi

చెన్నై సెంట్రల్‌లో డీఎంకే వర్సెస్‌ పీఎంకే

తమిళనాడు రాజధాని చెన్నై ప్రతిపక్ష డీఎంకేకు మొదటి నుంచీ కంచుకోట. నగరం పరిధిలోని చెన్నై సెంట్రల్‌ నియోజకవర్గం 1977లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2014 వరకూ జరిగిన 11 ఎన్నికల్లో డీఎంకే ఏడుసార్లు విజయం సాధించింది. కిందటి పార్లమెంట్‌ ఎన్నికల్లో దివంగత ఏఐఏడీఎంకే నాయకురాలు జయలలిత ప్రభంజనంలో ఇక్కడ ఈ పార్టీ అభ్యర్థి ఎస్సార్‌ విజయ్‌కుమార్‌ తన సమీప డీఎంకే అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్‌ను ఓడించారు. అంతకు ముందు వరుసగా రెండుసార్లు దయానిధి డీఎంకే టికెట్‌పై ఎన్నికై యూపీఏ ప్రభుత్వంలో  కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. డీఎంకే నేత, మాజీ సీఎం ఎం.కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్‌ చిన్న కొడుకు దయానిధి. మురసోలి మారన్‌ ఇదే నియోజకవర్గం నుంచి 1996, 98, 99 ఎన్నికల్లో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

నగరంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు చెన్నై సెంట్రల్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ స్థానంలో 13, 32, 135 మంది ఓటర్లు ఉన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ లోక్‌ నియోజకవర్గంలో ఉత్తరాది నుంచి వచ్చి స్థిరపడిన హిందీ, ఉర్దూ మాట్లాడే ప్రజలతో పాటు చెపాక్‌–తిరువల్లికేని, ఎగ్మోర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు లక్షల మందికి పైగా ముస్లిం జనాభా ఉంది. తెలుగువారు, మలయాళీలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అన్నానగర్‌ వంటి అత్యంత సంపన్న ప్రాంతాలతో పాటు పక్కనే జీహెచ్‌ క్వార్టర్స్‌ వంటి మురికివాడలు ఉన్న నియోజకవర్గం ఇది.

మళ్లీ డీఎంకే చేతికి చిక్కేనా?
మధ్య చెన్నై సీటు డీఎంకేకు గతంలో కంచుకోటగా పేరున్నా ఈ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సమీప బంధువైన దయానిధి మారన్‌ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ‘చెన్నై సెంట్రల్‌లో డీఎంకేకు నల్లేరుపై నడకే. కాని, 2014లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్సార్‌ విజయ్‌కుమార్‌ గెలిచాక పరిస్థితి మారిపోయింది’ అని తమిళ రాజకీయ విశ్లేషకుడు సీఎస్‌ కోటీశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న పాలక ఏఐఏడీఎంకే కూటమి తరఫున పీఎంకే అభ్యర్థి ఎస్‌ఆర్‌ శామ్‌ పాల్‌ పోటీ చేస్తున్నారు. కరుణానిధి సమీప బంధువైన దయానిధి మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిగా పనిచేశారు. ఆయన అన్న కళానిధి మారన్‌ ఆసియాలోనే అతిపెద్ద టీవీ నెట్‌వర్క్‌ సన్‌ గ్రూప్‌ అధిపతి. జయలలిత మరణానంతరం డీఎంకేకు రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఇక్కడ దయానిధి మారన్‌ గెలుపు ఖాయమని యూపీఏ భావిస్తోంది.

బరిలో ముస్లింల పార్టీ అభ్యర్థి 
ముస్లింలలో పలుకుబడి ఉన్న సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్డీపీఐ) కేకేఎస్‌ఎస్‌ఎం దెహ్లాన్‌ బకావీని ఇక్కడ నిలబెట్టింది. సినీ నటుడు కమల్‌హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీతి మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) అభ్యర్థిగా కమీలా నాసర్‌ పోటీచేస్తున్నారు. కానీ, పోటీ ప్రధానంగా దయానిధి మారన్, శామ్‌ పాల్‌ మధ్యనే ఉంటుంది.

పీఎంకే అభ్యర్థిగా వ్యాపారి పాల్‌
ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి తరఫున వన్నియార్ల పార్టీగా అందరికీ తెలిసిన పీఎంకే పోటీ చేస్తోంది. పీఎంకేకు నగరంలో చెప్పుకోదగ్గ బలం లేకున్నా అన్నాడీఎంకే కూటమిలోని ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడింది. పీఎంకే అభ్యర్థి శామ్‌ పాల్‌ మైనారిటీ మతానికి చెందిన ధనిక వ్యాపారి. ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అయితే, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తనను గెలిపిస్తారని ఆయన చెబుతున్నారు. మురికివాడల ప్రజల సంక్షేమానికి పాటుపడతానని, నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కరిస్తానని పాల్‌ హామీ ఇస్తున్నారు. గణనీయ సంఖ్యలో ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల మద్దతు తమ కూటమికే ఉందని ఆయన ప్రకటించారు. అవినీతిపరుడుకాని అందుబాటులో ఉండే నాయకుడినే మధ్య చెన్నై నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారన్న ధీమా పాల్‌ వ్యక్తం చేశారు.

2014 ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు..
►3,33,296 ఎస్సార్‌ విజయకుమార్‌ (ఏఐఏడీఎంకే)

►2,87,455దయానిధి మారన్‌(డీఎంకే)

►1,14,798కాన్‌స్టాంటిన్‌ రవీంద్రన్‌ (డీఎండీకే)

►25,981సీడీ మెయ్యప్పన్‌(కాంగ్రెస్‌)

►45,841విజయ్‌కుమార్‌ మెజారిటీ

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top