
విజయ్ సేతుపతి
ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒకరికి ఏదైనా ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే బావుండదనుకుంటారు పేరెంట్స్. ఇలానే అనుకుని తన కూతుర్ని తన తదుపరి చిత్రంలో నటింపజేస్తున్నారు విజయ్ సేతుపతి. ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలో విజయ్ సేతుపతి చిన్నప్పటి పాత్రలో అతని తనయుడు సూర్య నటించాడు. విడుదలకు సిద్ధమైన విజయ్ సేతుపతి ‘సిందుబాద్’లోనూ సూర్య ఓ పాత్ర చేశాడు. విజయ్ సేతుపతి నటిస్తున్న ‘సంఘ తమిళన్’ చిత్రంలో అతని కుమర్తె శ్రీజ నటించనుందట. విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ‘‘వాడిని (సూర్య) యాక్ట్ చేయించి తనని (శ్రీజ) యాక్ట్ చేయించకపోతే తనని వదిలేసినట్టు తను బాధపడకూడదు. అందుకే ఈ సినిమాలో యాక్ట్ చేయిస్తున్నాను’’ అని పేర్కొన్నారు విజయ్ సేతుపతి.