యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా!

యువతరాన్ని ప్రతిబింబించే కథతో తిక్క తీశా! - Sakshi


 సునీల్‌రెడ్డి

సినిమా జర్నీ డీవోపీ (కెమేరామ్యాన్)గా  మొదలైంది. ‘ఒకరికొకరు’తో ఆయన కెమెరాలో ఎంత బలముందో చూపించాడు. ఆ తర్వాత ఆయన మనసు దర్శకత్వంపైకి మళ్లింది. కళ్యాణ్‌రామ్‌తో ‘ఓం’ త్రీడీ సినిమాని తెరకెక్కించాడు. మరోసారి టెక్నికల్‌గా తానెంత స్ట్రాంగో ఆ సినిమాతో  చాటి చెప్పాడు సునీల్‌రెడ్డి. కాస్త గ్యాప్ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో తిక్క తెరకెక్కించాడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహిన్ రెడ్డి నిర్మించిన  ఈ చిత్రం శనివారమే ప్రేక్షకుల  ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు సునీల్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు...అర్బన్ బేస్డ్ కామెడీ కథతో తెరకెక్కించిన చిత్రమే ‘తిక్క’. పేరులో ఉన్న మూడ్ తెరపై కూడా కనిపిస్తుంటుంది.  బ్రేకప్ అయిన కుర్రాడి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. నేటి యువతరాన్ని ప్రతిబింబించే ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. టైటిల్ కాస్త నెగిటివ్‌గా అనిపించినా కథకు తగ్గట్టుగా ఉందని అదే ఓకే చేశాం. ప్రతి సన్నివేశం కామెడీగా సాగుతుంది. సినిమా చూసినవాళ్లంతా బాగుందని మెచ్చుకొంటున్నారు. ముఖ్యంగా కామెడీ బాగా పండింది అంటున్నారు. పంచులు, ప్రాసలు కాకుండా కేవలం సన్నివేశాలతోనే వినోదాన్ని పండించే ప్రయత్నం చేసాం. అది ఫలించినందుకు ఆనందంగా ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ నటనలో ఓ కొత్త యాంగిల్‌ని చూపించారని చెబుతున్నారు. తమన్ , గుహన్ లాంటి సాంకేతిక బృందం ఈ సినిమాకి పనిచేసింది. రోహిన్ రెడ్డి నిర్మాణం పరంగా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఓ మంచి క్వాలిటీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగాం.

 

నో కన్‌ఫ్యూజన్ నేనొక డీవోపీగానే ప్రయాణం మొదలు పెట్టినా దర్శకుణ్ణి కావాలనే కోరిక మొదట్నుంచీ ఉంది. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకొన్నా. డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పరిధి పరిమితం అనేది నా భావన. ఏం చేయాలన్నా వేరొకరి ఆలోచనలకి తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది. మనదైన అభిరుచికి తగ్గట్టుగా, మనదైన  కోణంలో చేయాలను కొన్నది ఏదీ చేయలేం. అందుకే నా దృష్టి దర్శకత్వంవైపు మళ్లింది. ‘ఓం’ త్రీడీ అనుకొన్న ఫలితాన్నివ్వలేకపోయింది. నా అసలు ప్రతిభ ఏంటన్నది ‘తిక్క’లోనే  కనిపిస్తుంది. ఒక డీవోపీగా నాకు టెక్నాలజీ పైన కూడా అవగాహన ఉంటుంది కాబట్టి అది దర్శకుడిగా నాకు చాలా సాయం చేస్తుంటుంది. ఏం చేస్తే ఎలాంటి ఔట్‌పుట్ వస్తుందో ముందుగానే తెలుస్తుంటుంది. ‘తిక్క’ విషయంలో ఎక్కడా ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా పనిచేశాం.

 

 రాజీపడను: ఏం చేసినా ఒక ప్లాన్  ప్రకారం చేయడమే  నాకు అలవాటు. చిత్రీకరణకి వెళ్లడానికి ఆర్నెల్ల ముందుగానే స్క్రిప్టుని నా టెక్నీషియన్లకి అందజేశాను. దానివల్ల అందరూ ఓ అవగాహనకొస్తుంటారు. అలాగే  కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటా. అనుకొన్నది వచ్చేవరకు రాజీపడను. ‘తిక్క’లోని  ఐదు పాటల కోసం తమన్ తో 50 బాణీలు సిద్ధం చేయించా. కథని క్యారీ చేసేలా బాణీ కుదరాలనే ఆ ప్రయత్నం. టీమంతా అలా పనిచేశాం కాబట్టే ఓ మంచి ఔట్‌పుట్ బయటికొచ్చింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top