
ప్రేమ గుడ్డిది. అవును. కళ్లతో చూసుకుని ప్రేమించుకునే ప్రేమ గుడ్డిది. అది కులం పట్టించుకోదు. మతం పట్టించుకోదు. ఆస్తి పట్టించుకోదు. అంతస్తు పట్టించుకోదు. రంగు నలుపా తెలుపా ఆకారం పొడుగా పొట్టా పట్టించుకోదు. అది గుడ్డిది. కాని ఈ గుడ్డి ప్రేమకు కనీసం తాను ప్రేమించిన వ్యక్తి ఎలా ఉంటాడో ఉంటుందో తెలుసు. మరి– అసలు చూసుకోకనే– ఎప్పుడూ కలుసుకోకనే– ఒకరినొకరు గుడ్డిగా ప్రేమించుకుంటే? ఒకరికొకరు జీవితాన్ని పాదాక్రాంతం చేసేందుకు సిద్ధపడితే? ఆ ప్రేమ గుగుడ్డిది.
ఆ అమ్మాయిది ఊటి. అబ్బాయిది జైపూర్. ఇద్దరూ తెలుగువాళ్లే. వేరు వేరు కారణాల వల్ల అక్కడ ఉంటున్నారు. అమ్మాయి ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చి తిరుగు ప్రయాణంలో తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకుంటుంది. అబ్బాయి కూడా వైజాగ్‌కు పని మీద వచ్చి తిరుగు ప్రయాణంలో తనకు దొరికిన హ్యాండ్‌బ్యాగ్‌ను చూస్తాడు.అందులో అమ్మాయి సర్టిఫికెట్లు ఉంటాయి.అరెరె... వీటిని పోగొట్టుకుని ఎంత బాధపడుతోందో కదా అని జైపూర్ వెళ్లాక ఆ సర్టిఫికెట్లు జాగ్రత్తగా చేసంచిలో పెట్టి పోస్ట్ చేస్తాడు.అమ్మాయి వాటిని అందుకుని మళ్లీ జన్మ పొందినట్టుగా సంతోషపడుతుంది.కృతజ్ఞతగా అతడికి ఉత్తరం రాస్తుంది.ఏం పర్లేదు అంటూ అతడు ఉత్తరం రాస్తాడు.‘నాకు పెళ్లి కాలేద’ని అతడు రాస్తే ‘నేనింకా అవివాహితనే’ అని ఈ అమ్మాయి రాస్తుంది.
‘మీ ఫొటో పంపండి’ అని అతడు రాస్తాడు.‘వద్దు. అన్ని ప్రేమలూ కళ్లతో మొదలయ్యి హృదయంతో ముగుస్తాయి. కాని మన ప్రేమ హృదయంతో మొదలయ్యి కళ్లతో పూర్తవ్వాలి. ఏ రోజైతే మనం కలుస్తామో ఆ రోజే మన పెళ్లి’ అని అమ్మాయి అంటుంది.ఒక అందమైన ప్రేమ మొదలైంది.అమ్మాయి ఎక్కడో. అబ్బాయి ఎక్కడో. ఒకరినొకరు చూసుకోలేదు. కాని గాఢంగా ప్రేమించుకుంటున్నారు.తర్వాత ఏమవుతుంది?
ప్రేమకు పరీక్షలు ఎదురవుతాయి. వాటిని దాటి వస్తేనే అది ప్రేమో కాదో తెలుస్తుంది. అతడికి పరీక్ష వచ్చింది.ఆఫీసులో అతడి బాసే అతణ్ణి ప్రేమించింది. దాదాపు 18 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు. తనని చేసుకుంటే అదంతా అతడికే. కాని అతడు ప్రేమలో ఉన్నాడు. కనిపించని తన దేవత ప్రేమలో. ఆమె కోసం ఆ ఆస్తిని ఆ బాస్‌ను వదలుకుంటాడు. ఈ స్థాయి ప్రేమను ప్రదర్శించడానికి శక్తి కావాలి.ఆ అమ్మాయి కూడా అంతే.ఆమెను చూసి ఎవరో శ్రీమంతుడు చేసుకుంటానని ముందుకు వస్తాడు.కాని చేసుకోదు. ఎందుకంటే ఆమె మనసు నిండా అతడే ఉన్నాడు.హృదయాలు ఎందుకు ముడిపడతాయి. హృదయాలు ఎందుకు ఆ ఒక్కరి కోసమే లబ్‌డబ్ అంటాయి. హృదయాలు ఎందుకు మరే ఇతర ఆకర్షణను ఏహ్యభావంతో చూస్తాయి. తెలీదు. అందుకు ప్రేమలో పడాల్సి ఉంటుంది.
క్లయిమాక్స్ వస్తుంది. అతణ్ణి
వెతుక్కుంటూ ఆమె భోరున కురిసే వర్షంలో వైజాగ్ చేరుకుంటుంది. కాని అతడెలా ఉంటాడో తెలియదు. అతడు కూడా బాస్‌ను కాదన్నందుకు ఉద్యోగం పోగొట్టుకుని ఆత్మాభిమానంతో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అతడికి ఆమె ఎలా ఉంటుందో తెలియదు. కాని ఒకరినొకరు కలుస్తారు. తామెవరో తెలియకనే కలిసి ఆటోలో ప్రయాణిస్తుంటారు. అతడు డ్రైవర్‌గా. ఆమె ప్రయాణికురాలిగా. వెతికి వెతికి ఆమె విసిగిపోతుంది. నిస్పృహతో తిరిగి ఊటీ వెళ్లిపోవడానికి స్టేషన్‌కు చేరుకుంటుంది. ఆమె అయినవారెవరో దొరక్క బాధ పడుతోందని అతడు గ్రహిస్తాడు. కాని ఎలా సాయం చేయాలో తెలియక నిస్సహాయుడవుతాడు. ఆమె ట్రైన్ ఎక్కుతుంది. అతడు ప్లాట్‌ఫామ్ మీద నిలబడి ఉంటాడు. ఆ క్షణం చాలా కీలకమైనది. అతడు ప్లాట్‌ఫామ్ వీడినా ఆమె ఎక్కిన ట్రైన్ కదిలిపోయినా వాళ్లు మళ్లీ కలుస్తారో లేదో. ఇప్పుడు ఎదురూ బొదురూ ఉన్నా ఎలా కలవాలి? ఒకరినొకరు ఎలా గుర్తుపడతారు? ఇంతలో ఎవరో హడావిడిలో అతడి పైన టీ ఒలకపోస్తారు. అతడు కంగారుగా షర్ట్ విప్పి చేతిలో పట్టుకుంటాడు. లోపల స్వెటర్ ఉంటుంది. వానకు చలి పుట్టకుండా ధరించిన స్వెటర్. ఇంతలో ట్రైన్ కదలుతుంది. ట్రైన్ కదిలి వెళ్లిపోతూ ఉంటుంది. ఆమె అదాటున అతడి వైపు చూస్తుంది. స్వెటర్ పైన కమలం బొమ్మ. ఎర్రటి కమలం బొమ్మ. ఆ స్వెటర్ తాను అల్లి పంపినదే. తన ప్రేమకు గుర్తు. అంటే అతడే తన ఆరాధ్యమూర్తి. ఆ క్షణాన్ని ఆమె దాటిపోనివ్వదు. ట్రైన్‌ని దాటిపోనివ్వదు.‘సూర్యా’ అని ఆర్తారావం చేస్తూ ప్లాట్‌ఫామ్ మీదకు దూకేస్తుంది.అతడు సంశయంగా ఆమె వైపు చూస్తాడు.ఆమే ‘కమలీ’ అని గ్రహించాక నిరత్తరుడై నిలబడతాడు.ఆమె పరిగెడుతూ వచ్చి అతణ్ణి అల్లుకుపోతుంది.అంతవరకూ తడిపిన వాన వారి ఆలింగనంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరిఅవుతుంది. ఆ ప్రేమ ఏనాడో మనసుతో మొదలయ్యింది. ఇప్పుడు కళ్లను చేరుకుని పరిపూర్ణం అయ్యింది.
కాదల్ కొటై్ట
దర్శకుడు అగస్త్యన్ 1996లో తీసిన ‘కాదల్ కొటై్ట’ తమిళంలో సూపర్ డూపర్ హిట్. తెలుగులో ఏ.ఎం. రత్నం దానిని ‘ప్రేమలేఖ’ పేరుతో విడుదల చేస్తే ఇక్కడా ఘన విజయం సాధించింది. అజిత్, దేవయాని జంట ఈ కథను తమ భుజస్కందాల మీద వేసుకుని అద్భుతంగా పండించారు. మరో నటి హీరా సెడెక్టివ్‌గా స్క్రీన్ మీద కనిపించి ప్రేక్షకులకు తియ్యని బాధ రేపుతుంది. రొడ్డ కొట్టుడు ప్రేమ కథల మధ్య ఈ కథ ఎంతో ఫ్రెష్‌గా ఉండటం సినిమా హిట్ కావడానికి కారణం. కొన్ని కథలు కాలాన్ని అనుసరించి పుడతాయి. ఉత్తరాలు, పి.పి ఫోన్ల కాలం కావడం వల్లే ఈ కథ జరుగుతుంది. ఇవాళ ఈ కథ ఇలా జరగడానికి ఆస్కారం లేదు. రెండు క్షణాల్లో ఫొటో వాట్సప్ అవుతుంది. మరో రెండు క్షణాల్లో మాట కూడా కలుస్తుంది. ఇళయరాజా ఊపు మీద ఉన్న రోజుల్లో దేవా ఈ సినిమాలో ప్రతి పాటను హిట్ చేయడం చెప్పుకోవాల్సిన సంగతి. భువనచంద్ర రాసిన పాటలు ‘చిన్నాదానా ఓసి చిన్నాదానా’, ‘ప్రియా నిను చూడలేక’, ‘పట్టు పట్టు పరువాల పట్టు’... చాలా బాగుంటాయి. ఆర్.ఆర్. కూడా బాగుంటుంది. ఎంతో అందమైన ప్రేమ కథలను స్మరించుకోవాల్సి వచ్చినప్పుడు తప్పక గుర్తుకు వచ్చే పేరు– ఈ పేరు– ప్రేమలేఖ.
– కె