పేరు కోసమే కష్టపడ్డాను

Samantha interview about Jaanu movie - Sakshi

‘‘నా కెరీర్‌ ప్రారంభం నుంచి కూడా నేను పేరుకోసమే పని చేశాను. ఒక సినిమా చేయాలా? వద్దా? అనే నా నిర్ణయాన్ని డబ్బు ప్రభావితం చేయలేదు. కొత్త సినిమాని ఒప్పుకునేముందు ఆ సినిమా వల్ల నాకు ఎంత పేరు వస్తుందని మాత్రమే ఆలోచించుకుని నా వంతు కష్టపడ్డాను. డబ్బు ఆటోమేటిక్‌గా వచ్చేసింది(నవ్వుతూ)’’ అని సమంత అన్నారు. శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాను’. తమిళంలో హిట్‌ సాధించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్‌. ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రేమ్‌కుమారే ‘జాను’ సినిమాని డైరెక్ట్‌ చేశారు. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు(శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు...

► ‘జాను’ ఇద్దరు వ్యక్తుల కథ. నాకైతే చాలా పెద్ద సినిమా చేశాననిపించింది. ఎక్కువ రిస్క్‌ అనిపించింది. నా 100 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టాను.  ‘96’ సినిమా బాగా నచ్చింది. ఆ చిత్రంలో విజయ్‌ సేతుపతి బాగా చేశారన్నారు. నాకైతే ‘96’ త్రిషగారి సినిమా అనిపించింది. ఈ సినిమా రీమేక్‌లో నటించకూడదని తొలుత అనుకున్నాను. ‘దిల్‌’రాజుగారు అడగడంతో కాదనలేకపోయాను. కానీ ‘జాను’ సినిమా చేయకపోతే నా కెరీర్‌లో ఒక మంచి సినిమా కోల్పోయేదాన్ని.. పశ్చాత్తాపం చెందాల్సి వచ్చేది.

► త్రిషగారి నటనను కాపీ చేయలేదు. సినిమాలోని పాత్రని అర్థం చేసుకుని నా శైలిలో విభిన్నంగా నటించాను. అది స్క్రీన్‌పై ఎంత వర్కవుట్‌ అయ్యిందన్నది ప్రేక్షకులు చెబుతారు. నేను చాలా కష్టపడ్డాను. స్క్రిప్ట్‌ను చాలాసార్లు చదివాను. నాకైతే పూర్తి నమ్మకం ఉంది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను. ‘96’లాంటి సినిమాలను రీమేక్‌ చేయడం కష్టం. కానీ ప్రేమ్‌కుమారే తెరకెక్కించడంతో ఆ మ్యాజిక్‌ను రీ–క్రియేట్‌ చేశారనిపించింది.

► స్క్రిప్ట్‌ ప్రకారం నా నటన బట్టే శర్వాగారి నటన ఉంటుంది. అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుని బెస్ట్‌ ఔట్‌పుట్‌ రావడం కోసం కష్టపడ్డాం.. శర్వా బాగా నటించారు. క్లైమాక్స్‌ మార్చడం కోసం షూటింగ్‌ను ఆపేశామనే వార్తల్లో నిజం లేదు. శర్వాగారికి ఆరోగ్యం సహకరించనప్పుడు కొంత షూట్‌ ఆపాం. ఆ తర్వాత మొదలైన ఒక్క షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేశాం.

► నా కెరీర్‌లో పది సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచేకొద్దీ కొత్త హీరోయిన్లు వస్తుంటారు. ట్రెండ్‌ మారిపోతుంటుంది. కొందర్ని బెటర్‌ పెర్ఫార్మెన్స్‌ అంటారు.. ఇంకొందర్ని బ్యూటిఫుల్‌ అంటారు. కానీ వీలైనంత కాలం నా పేరు నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్లు కష్టపడుతున్నాను. నేను చేసే ప్రతి సినిమా నా మొదటిదిగా భావిస్తాను. నా నటన, నా ప్రవర్తన పట్ల సినిమా యూనిట్‌ సంతోషంగా ఉన్నారో లేదో కూడా ముఖ్యమే.

► ప్రమోషన్స్‌ ఎంతవరకు సినిమా కలెక్షన్స్‌ను ప్రభావితం చేస్తాయో నాకు తెలియదు. కానీ నేను ఒక చోటుకు వెళ్లి సినిమాను ప్రమోట్‌ చేయడం వల్ల పది టిక్కెట్లైనా అమ్ముడు పోతాయంటే వెళ్లి ప్రమోట్‌ చేస్తాను. ఎందుకంటే ఒక నిర్మాత నన్ను నమ్మి, ఇంత పారితోషికం ఇచ్చినప్పుడు చేయాలి. మూవీ విడుదలై, విజయం సాధిస్తే నేను ఫోన్‌ లిఫ్ట్‌ చేయను (సరదాగా). అదే రిలీజ్‌కు ముందు అయితే నాకు వీలైనంత ప్రమోషన్‌ చేస్తాను. రిలీజ్‌ టైమ్‌లో సినిమా ఫలితం గురించి కాస్త ఆందోళనకి గురవుతా.

► నా చదువు పట్ల మా అమ్మగారు మరీ స్ట్రిక్ట్‌గా ఉండేవారు కాదు. కానీ, నేను ఫుల్‌ మార్క్స్‌ రావాలని కోరుకుంటాను. 12వ తరగతిలో అకౌంట్స్‌లో 200కి 199 మార్కులు రావడంతో బాగా ఏడ్చాను. నేను ఫెయిల్‌ అయ్యానని మా అమ్మ అనుకున్నారు. అసలు విషయం తెలియడంతో సైలెంట్‌గా వెళ్లిపోయారు.

► నా సినిమాలను చూడమని నా స్నేహితులకు చెబుతుంటాను. నేను గ్రాడ్యుయేషన్‌ చేసేటప్పుదు మాది గర్ల్స్‌ కాలేజ్‌. చాలా స్ట్రిక్ట్‌. ఎవరూ టీవీ, ఇండస్ట్రీ అంటూ ఉండేవారు కాదు. కానీ, నేను చేసేదాన్ని.   సినిమాలకే కాదు.. కుటుంబానికీ సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఒక ఆర్టిస్టుగా నేను సాధించే విజయాల కన్నా కూడా నా వ్యక్తిత్వం గురించి మా కుటుంబ సభ్యులు గర్వంగా ఫీల్‌ అవుతారు.

► ‘రంగస్థలం’ తర్వాత సమంత ఏం చేసినా హిట్‌ అయిపోతుందన్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్, కొంచెం కథ తెలుసంతే. ఎంటైర్‌ స్క్రిప్ట్‌ తెలియదు. ఇప్పుడు నేను సినిమాలను చాలా తెలివిగా ఎంచుకుంటున్నాని అంటున్నారు. కానీ అది అలా జరుగుతోందంతే.

► ‘ది ఫ్యామిలీమేన్‌ సీజన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో కొత్త సమంతను చూస్తారు. చాలా కష్టపడ్డాను. నేను ఒక్కషాట్‌లో కూడా డూప్‌ వాడలేదు. అప్పుడు అనుకున్నాను.. సినిమాలో ఫైట్స్‌ కోసం హీరోలు ఇంత కష్టపడతారా అని!. ఇందులో నేను చేసిన పాత్రను ఇదివరకు చేయలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top