ఓవర్‌నైట్‌ స్టార్‌ని కాదు

Sakshi special interview with vijay devarakonda

రిషి, ప్రశాంత్, డా. అర్జున్‌ రెడ్డి దేశ్‌ముఖ్, విజయ్‌ ఆంటోని, విజయ్‌ గోవింద్‌... ఇప్పుడీ పేర్లు చాలా పాపులర్‌. ఎందుకంటే ఇవన్నీ విజయ్‌ దేవరకొండ పేర్లు. ఇన్ని పేర్లా? అనుకోరని తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకూ విజయ్‌ దేవరకొండ చేసిన సినిమాలు చూసినవాళ్లకు ఇవి ఈ యువ హీరో చేసిన పాత్రల పేర్లని తెలుస్తుంది. ఆ పాత్రల్లో విజయ్‌ దేవరకొండ కనిపించలేదు. ఓన్లీ క్యార్టెక్టర్‌ మాత్రమే కనిపించింది. అంత బాగా నటించారు. ఇప్పుడు ‘నోటా’లో శీను పాత్రలో కనిపించబోతున్నారు విజయ్‌. ఈ నెల 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండతో స్పెషల్‌ టాక్‌.

ఓవర్‌నైట్‌ మీరు ఎక్కడికో వెళ్లిపోయారనిపిస్తోంది.
విజయ్‌:  ఓవర్‌నైట్‌ అని ఎందుకంటారో? నేను ఎప్పటినుంచో కష్టాలు పడుతున్నా. రెండేళ్లు ఖాళీగా తిరిగితే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అవకాశం వచ్చింది. అక్కణ్ణుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తుంటే ఇప్పుడు కూర్చున్నా. మీ అందరికీ నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా నుంచి తెలుసు. చాలా మందికి ‘అర్జున్‌రెడ్డి’ నుంచే తెలుసు. అందుకే త్వరగా స్టార్‌ అయ్యాననే భావన వారిలో ఉంటుంది.యాక్చువల్లీ నాక్కూ డా అలా అనిపిస్తుందనుకోండి. ఇదంతా చాలా తొందరగా అయిపోయిందేమోనని!

‘నోటా పోస్టర్స్‌ చూస్తుంటే పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అని తెలుస్తోంది. ‘నోటా’ అంటే ఏంటో  తెలుసు. కానీ తమిళ్‌ ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నారు?
పొద్దున్నే, సాయంత్రం కూర్చుని చదువుకుంటూ చదువుకుంటూ కష్టపడి నేర్చుకున్నా. రానానో, నాగచైతన్యనో కలిసినప్పుడు మీకు తమిళ్‌ వచ్చు కదా? అంటే చిన్నప్పుడు చెన్నైలోనే ఉన్నాం కదా... వచ్చు అంటారు. వీరికేమో సులభంగా తమిళ్‌ వచ్చేసింది.. మనమేమో కష్టపడాలి అనుకున్నా.

‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో రకరకాల అభినందనలు అందుకుని ఉంటారు. ఈ చిత్రాల్లో మీరు అన్ని షేడ్స్‌ చూపించారు. ఇది పెద్ద భారం. నెక్ట్స్‌ సినిమా ఏది సైన్‌ చేసినా ఎలా ఉంటుందో? ఏంటో? అని. ‘నోటా’ సినిమాకి సైన్‌ చేసేటప్పుడు మీకు అలా అనిపించిందా?
భారం మనం ఎత్తుకుంటే ఫీల్‌ అవుతాం. ఎత్తుకోకుంటే ఏం లేదు. నాపై నమ్మకంతో టిక్కెట్‌ కొనుక్కుని కూర్చున్నోళ్లు.. నా నటన, నా సినిమాల్ని ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. నా సినిమాల్లో క్వాలిటీ బాగాలేకుంటే నాకే నచ్చదు. ఆడియన్స్‌ని వదిలేయండి. నాకే చిరాకు లేస్తుంటుంది. కరెక్ట్‌ మ్యూజిక్‌ పడకపోతే, లైట్లు కరెక్టుగా లేకపోతే, క్యాస్టింగ్‌ పర్ఫెక్ట్‌గా లేకుంటే నాకే ఇరిటేషన్‌ వస్తుంటుంది. అందుకే సినిమాల సెలెక్షన్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను.

ఇలాంటి విషయాలు మీరు డైరెక్టర్‌కి చెబుతారా?
యా. నాకు ఏదైనా కరెక్ట్‌ అనిపించకపోతే డైరెక్ట్‌గా వెళ్లి చెబుతా. ఇలాంటి చర్చలవల్లే ఏదైనా బెటర్‌ అవుతుంది. సినిమాలనే కాదు.. లైఫ్‌లో కూడా గుడ్డిగా ఏదీ చేయకూడదు. ఏదైనా ఓ డౌట్‌ ఉంటే అవతలివాళ్లతో మాట్లాడాలి. మనం కన్విన్స్‌ అవ్వాలి.. లేదా అవతలి వాళ్లని కన్విన్స్‌ చేయాలి. ఏదైనా చర్చించుకోవడం అవసరం.

సినిమా సినిమాకి ఎవరైనా పైకి వెళ్లాలనుకుంటారు. ఇంకా అద్భుతం చేసి చూపించాలని. ‘నోటా’ సినిమాతో మీరు..
అదే కొలమానం అయితే ‘నోటా’సినిమాతో ఇంకా పైకే వెళ్లా. నటన పరంగానూ, మల్టీపుల్‌ లాంగ్వేజెస్‌ పరంగానూ.. తమిళ్‌లో కూడా ఇది మన సినిమా అని వాళ్లు యాక్సెప్ట్‌ చేయగలగాలి. అలా మేం చేయగలిగాం. హిందీ వాళ్లకి మనకంటే అప్పర్‌హ్యాండ్‌ ఏంటంటే పాపులేషన్‌. దేశంలో హిందీ మాట్లాడేవాళ్లు ఎక్కువ. హిందీతో పోల్చితే తెలుగు మాట్లాడేవాళ్లు తక్కువ. కోటి మంది సినిమా చూస్తే వందకోట్లు వసూలు చేస్తుంది సినిమా.

మూడు కోట్లమంది చూస్తున్నారంటే 300 కోట్లు ఏ సినిమా అయినా ఈజీగా వసూలు చేస్తుంది. హాలీవుడ్‌ సినిమాలకి ప్లస్‌ ఏంటంటే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నారు. దాని తర్వాత హిందీ వాళ్లకి బిగ్గెస్ట్‌ పాపులేషన్‌. ఆ తర్వాత తెలుగువాళ్లం. మన తర్వాత తమిళ్‌. మనమందరం హిందీ, తమిళం, మలయాళం సినిమాలు చూస్తున్నాం. వాళ్లు మన సినిమాల్ని విపరీతంగా చూస్తున్నారు.

‘గీత గోవిందం’ సినిమాని తమిళ్‌లో డబ్బింగ్‌ కూడా చేయించలేదు. కానీ, సబ్‌ టైటిల్స్‌తో విపరీతంగా చూశారు. ఎందుకంటే ఒక ఎమోషన్‌.. ఒక పెర్ఫార్మెన్స్‌.. మ్యూజిక్‌.. ‘ఇంకేం ఇంకేం కావాలే’ తెలుగు సాంగ్‌. దేశం మొత్తం ఆ పాట ఎందుకంత హిట్‌ అయ్యిందంటే మ్యూజిక్‌. ఓ కథకి బారియర్‌ ఉండదు. పక్క రాష్ట్రాల్లో నేను సినిమాని ప్రమోట్‌ చేయలేదు. ఏ ఎఫర్ట్‌ పెట్టలేదు. అయినా వాళ్లు ఆదరిస్తున్నారు.

మీరు కూడా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు కానీ, మీకు ఇంకా కరెక్టయిన పాత్రలు పడలేదేమో? మీ సక్సెస్‌ని చూసి పేరెంట్స్‌ ఎలా  ఫీల్‌ అవుతుంటారు?
నా పేరెంట్స్‌ కంప్లీట్లీ హ్యాపీ. ఓ శాటిస్‌ఫ్యాక్షన్‌. పేరెంట్స్‌కి బిగ్గెస్ట్‌ ఆనందం ఏంటంటే పిల్లల సక్సెస్‌ని చూడటం.. పిల్లలు సెటిల్‌ అవ్వడం చూడటం.. మనం యంగ్‌ ఏజ్‌లో సక్సెస్‌ అయితే వాళ్లు దాన్ని కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ చేయగలుగుతారు. ముసలివాళ్లయ్యాక సక్సెస్‌ అయితే ఏముంటుంది? పూజలు, హాస్పిటల్స్‌ అంటూ తిరగడం తప్ప.

యంగ్‌ ఏజ్‌లో సక్సెస్‌ అయితే నువ్వూ ఎంజాయ్‌ చేస్తావు. మేమూ ఎంజాయ్‌ చేస్తాం. నువ్వు పెద్దయ్యాక సక్సెస్‌ అయితే మనం కాదు నీ పిల్లలు ఎంజాయ్‌ చేస్తారు. మనం 40–45 ఏజ్‌లో సక్సెస్‌ అయితే మన పిల్లలు ఎంజాయ్‌ చేస్తారు మనం చేయలేం. అది నాకు చాలా ఇంపార్టెంట్‌. మా పేరెంట్స్‌ రిలాక్స్‌ అయిపోవాలి.. కంఫర్టబుల్‌గా బతకాలి. అది యంగ్‌ ఏజ్‌లోనే కావాలి ఎలాగైనా అనే మోటివేషన్‌ నాలో ఉండేది. గత ఆరేడు నెలల్లో నేను ఇంట్లో చాలా తక్కువగా ఉన్నా.

షూటింగ్‌ కోసం చెన్నై,  హైదరాబాద్‌.. తిరుగుతున్నా. షూటింగ్‌ నుంచి నేను లేట్‌నైట్‌ ఇంటికొచ్చే సరికి పడుకుండిపోయేవాళ్లు. ఈ ఇంటర్వ్యూకి వస్తుంటే అమ్మ, నాన్నలను చూశా. చాలా హ్యాపీగా ఉన్నారు. బిగ్‌ హగ్‌ ఇచ్చి, ముద్దులు పెట్టి గో అండ్‌ టేక్‌ కేర్‌ అన్నారు. వారి కళ్లలో ఆ గర్వం కనిపించింది. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది వాళ్లకు ఇవ్వగలిగాననే సంతృప్తి చాలు.

మీరు చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. ‘నోటా’ డైరెక్టర్‌ ఆనంద్‌ శంకర్‌గారితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
ఆనంద్‌కీ, తరుణ్‌ భాస్కర్‌కి వర్కింగ్‌ స్టైల్‌లో ఓ పోలిక ఉంది. వాళ్ల ప్లానింగ్‌ ఎలా ఉంటుందంటే.. ప్రీ లంచ్‌.. ఆఫ్టర్‌ లంచ్‌.. నైట్‌ .. ఏ సన్నివేశాలు ఎలా తీయాలనే క్లారిటీ ఉంటుంది. టెకి ్నకల్‌ అంశాలపై చక్కని పట్టుంది. కొన్ని సినిమాల సన్నివేశాలు తీసేటప్పుడు పదిసార్లు తీసుకుని ఎడిటింగ్‌ రూంలో కూర్చుని ఫైనల్‌గా ఏది కావాలో అది తీసుకుంటారు. వీళ్లు ఏంటంటే కావాల్సింది మాత్రమే తీసుకుంటారు.

దాని వల్ల మన పని తక్కువ అవుతుంది, షూటింగ్‌ డేస్‌ తక్కువ అవుతాయి. ప్రొడక్షన్‌ ఖర్చు కూడా. ఏది కావాలంటే అది పర్‌ఫెక్ట్‌గా వచ్చేవరకు ఐదు సార్లయినా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రెజర్‌ అనిపించదు. పక్కా ప్రణాళికతో ఉంటారు. సరదా మనుషులు. సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. మా సెట్స్‌ చాలా రిలాక్సింగ్‌గా ఉంటాయి. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటుంటాం.

పని ఒత్తిడి ఉండి, మనుషులతో ఒత్తిడి ఉంటే పనిచేయడం కష్టంగా ఉంటుంది. వీళ్లు అలా కాదు. పనివరకే సీరియస్‌. ఆ తర్వాత ఫుల్‌ ఫన్‌. చివరికి షాట్‌ అయిపోగానే కెమెరామెన్‌ కూడా. కె.రవిచంద్రన్‌ అని ఇండియాలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ కెమెరామెన్స్‌ ఉన్నారు. వాళ్లబ్బాయి సంతాన కృష్ణన్‌ ఈ చిత్రానికి కెమెరా చేశారు. యంగ్‌బాయ్‌. పాతికేళ్లు కూడా ఉండవు. మేమంతా యంగ్‌ బంచ్‌ కావడంతో సెట్స్‌లో చాలా ఫన్‌ ఉండేది.

మంత్రి కేటీఆర్‌కి మీరు చాలా క్లోజ్‌. ఆయన మిమ్మల్ని ఓపెన్‌గానే అభినందిస్తుంటారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా?
రామ్‌ అన్నతో (కేటీఆర్‌) నాకు ఉన్నది ఫ్రెండ్‌షిప్‌ అనుకుంటారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన ఓ బాధ్యతగల మంత్రి. ఓ లీడర్‌.. ఓ యాక్టర్‌గా ఆయన నన్ను అభినందిస్తుంటారు. నేను చేసేవి ఆయనకు ఇష్టం.. ఓ లీడర్‌గా ఆయన చేసేవి నాకు ఇష్టం. దాన్ని నేను ఫ్రెండ్‌షిప్‌ అనుకోవడం తప్పు.

నేనెప్పుడూ ఏదీ ఆయన్ని అడగను. నేను ‘ఫిల్మ్‌ఫేర్‌’ అవార్డు ఇచ్చేద్దామనుకున్నప్పుడు.. మన స్టేట్‌ నుంచి వచ్చినవాడు మన రాష్ట్రం కోసం ఏదో చేస్తుండు అనుకున్నాడు.వాళ్లేం చేశారు వీళ్లేం చేశారని  ఓ పౌరుడిగా మనం కంప్లైంట్‌ ఇస్తుంటాం. నువ్వు ఏం చేశావన్నది ముఖ్యం. మనవైపు నుంచి చేస్తున్నానని వచ్చారు. నేను ఆయన్ని ఎందుకు ఇష్టపడతానంటే.. జనరల్‌గా రాజకీయాలంటే.. కెమెరాలుంటే ఓ చెట్టు నాటి తర్వాత ఎవరి పనుల్లోకి వారు వెళ్లిపోతారు.

మా ఇంట్లో ఆయన, నేను ఉన్నప్పుడు ఏ కెమెరా లేదు.. దీని గురించి నేను ఇప్పటి వరకూ ఎక్కడా మాట్లాడలేదు. మన సిటీ అది. చెట్లను చూసుకోవాలి కదా. ఎక్కడికి పోయినా వీవర్ల గురించి మాట్లాడతారు. విజయ్‌.. నువ్వు చేనేత వస్త్రాలు వేసుకోవాలి. నిన్ను ఇంత మంది ఫాలో అవుతున్నారు కదా అంటారు. ఆయన వారంలో ఏదో ఓ రోజు వేసుకుంటారట. ప్రతి బుధవారం నువ్వు వేసుకో అన్నారు. కెమెరా లేకున్నా ఆయన భవిష్యత్‌ గురించి బ్రాడ్‌మైండెడ్‌గా ఆలోచిస్తారు కాబట్టే ఇష్టం.

మీ పబ్లిక్‌ ఇమేజ్‌ని మీరు ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉందా?
తీసుకెళ్లొచ్చు. ఐ మైట్‌ అన్నదానికి నన్ను హోల్డ్‌ చేయకండి. చేయాలిరా అవసరం ఉంది అని నాకు అనిపిస్తే చేస్తా.

మీరు ఇంత తొందరగా దూసుకొచ్చేసి మొత్తం బాక్సాఫీసులో అందరూ విజయ్‌ దేవరకొండ.. విజయ్‌ దేవరకొండ అంటుంటే మీకేమైనా కొంచెం అసౌకర్యంగా ఉంటుందా? ఇదివరకు ఉన్న యాక్టర్స్‌తో మూవ్‌ అవుతున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా?
నేను యాక్ట్‌ర్స్‌తో ఎప్పుడూ మూవ్‌ అవ్వలేదు. నేను కలిసే కొంతమంది యాక్టర్లు ఎవరంటే రానా. ఆయనెప్పుడూ కూల్‌గా ఉంటారు. మా ప్రొడ్యూసర్లు మన సినిమా ఇంత కలెక్ట్‌ చేసింది అంత కలెక్ట్‌ చేసిందని పంపిస్తుంటే.. సార్‌.. ఇవన్నీ నాకొద్దు. మీరే చూసుకోండి అని చెప్పాను. 100కోట్లు అంటూ పోస్టర్స్‌ని రానాగారు పంపించి ఎగై్జట్‌మెంట్‌తో కంగ్రాట్స్‌ చెప్పారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి నానీతో ప్రయాణం చేస్తున్నా కాబట్టి కొంచెం కంఫర్ట్‌గా ఫీలవుతా.

‘ఎవడే సుబ్రమణ్యం’ డైరెక్టర్‌ నాగి (నాగ్‌ అశ్విన్‌), మేం కలిసినప్పుడు సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. డైరెక్టర్లు తరుణ్‌ భాస్కర్, సందీప్‌ రెడ్డి వంగా.. ఇలాంటివాళ్లు నాకు పర్సనల్‌గా బాగా కనెక్ట్‌ అయ్యారు. మా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే కూడా నాగి, స్వప్నాదత్‌.. వీళ్లందరూ ఉంటారు. సినిమాలకన్నా కూడా  మా పర్సనల్‌ బాండ్‌ ఎక్కువ. తారక్, బన్నీ అన్నలను కలిసా. ప్రొఫెషనల్‌గా వాళ్లకి నా వర్క్‌ నచ్చింది. ఇంటికి పిలిచి అభినందించి ప్రోత్సహిస్తుంటారు.

పక్క రాష్ట్రాల్లోకెళ్లినప్పుడు ఆ క్రేజ్‌ ఎలా ఉంటుంది?
అది హైదరాబాదా? చెన్నైనా? అన్నది అర్థం కాదు. చుట్టూ చేరి ‘తలైవా తలైవా’ (నాయకుడు) అని అరిచేస్తుంటారు. వాళ్లు ఎవరినైనా ఇష్టపడితే అలాగే పిలుస్తుంటారు.

మీకు స్పెషల్‌గా ఓ బిరుదు కాయిన్‌ చేయాలి. ఎందుకంటే.. రొమాంటిక్‌ రోల్స్‌ చేస్తారు. పంచ్‌ కొట్టే పాత్రలు చేస్తారు. ‘నోటా’ చిత్రంలో ఓ డిఫరెంట్‌ రోల్‌ చేశారు. కాబట్టి మీకు అన్ని షేడ్స్‌ ఉండే పేరు కావాలి.
మధ్యలో అందుకుంటూ... ‘రాజాది రాజా’ ఆ టైప్‌ ఏమైనా పెట్టుకోనా?  రాజాది రాజా విజయ్‌ దేవరకొండ అలా..

దేవాది దేవా విజయ్‌ దేవరకొండ మస్తుగుంది.
(నవ్వుతూ). ఇట్లాంటిది ఏమైనా పెట్టుకుందాం. మనకు ఈ స్టార్‌.. ఆ స్టార్‌ వద్దు. కొత్తగా పెట్టుకుందాం. కొత్త ట్రెండ్‌ స్టార్ట్‌ చేద్దాం.

మిమ్మల్ని మంచి ఆంధ్ర సినిమాలో చూడాలి. అండీ అనే యాసలో మీరు మాట్లాడాలి.  
నేను అలా మాట్లాడితే కామెడీగా ఉంటుందేమో. వీడు మిమిక్రీ చేస్తుండ్రా అని జనాలకి అనిపించొద్దు. జెన్యూన్‌గా, మంచిగా అనిపించాలి. లేదంటే కోపమొస్తుంది. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో విజయవాడ యాసలో చేస్తున్నా.

చాలా మంది అమ్మాయిలు మీకు ఫ్యాన్స్‌ ఉంటారు కదా. రీసెంట్‌ ఫిల్మ్స్‌ తర్వాత మీ క్రేజ్‌ చూసి మనసులు పారేసుకుంటున్న అమ్మాయిలు కూడా ఉన్నారనుకుంటా?
ఉండి ఉంటారేమో! (నవ్వుతూ).. దాని గురించి నేనేం చెప్పగలను. ఇట్స్‌ నైస్‌. ఇట్స్‌ పార్ట్‌ ఆఫ్‌ ద లైఫ్‌. ఇప్పుడు నేను ఓ బ్యాంక్‌లో పనిచేస్తుంటే ఇద్దరు ముగ్గురు కొలీగ్స్‌కి నచ్చేవాడినేమో? యాక్టర్‌గా ఉన్నా కాబట్టి ఇంత పెద్ద స్క్రీన్‌పై ప్రపంచమంతా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఐ థింక్‌ ఇట్స్‌ పార్ట్‌ ఆఫ్‌ ది జాబ్‌. అదే ఊర్లో ఉండి పొలం చూసుకుంటుంటే.. నేను, నా బర్రెలు ఇదే.. నేను ఓ యాక్టర్‌ని. రోజూ నన్ను చూస్తుంటారు. నా మాటలు వాళ్లకి రీచ్‌ అవుతుంటాయి కాబట్టి ఇదంతా అశాశ్వతమే.

– ఇంటర్వ్యూ: స్వప్న, సాక్షి టీవీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top