
జయశ్రీదేవి , (ఇన్‌సెట్‌లో భౌతికకాయం)
ప్రముఖ మహిళా నిర్మాత నారా జయశ్రీదేవి (58) బుధవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ‘‘హార్ట్ ఆపరేషన్ జరిగింది. స్టంట్ కూడా వేశారు. రూమ్ షిఫ్ట్ చేస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారు’’ అని జయశ్రీదేవి దత్త పుత్రుడు వాసు ‘సాక్షి’కి తెలిపారు. స్వతహాగా జయశ్రీదేవి తెలుగు అయినప్పటికీ కన్నడ సినిమాలు నిర్మిస్తూ అక్కడ స్థిరపడటంవల్ల ఆమె భౌతిక కాయాన్ని బెంగళూరుకి తరలించారు.
తొలుత పాత్రికేయురాలిగా కెరీర్ ఆరంభించిన నారా జయశ్రీదేవికి సినిమాల పట్ల ఆసక్తితో నిర్మాణ వ్యవహారాలు చూసేవారు. 1992లో మద్యపాన నిషేధంపై సినిమా తీయాలనుకున్నారామె. అప్పటికి రాష్ట్రంలో ఆ విధానం అమలులో ఉండటంతో బెంగళూరు వెళ్లి, కన్నడంలో ‘భవానీ’ పేరుతో సినిమా నిర్మించారామె. అక్కడ్నుంచి వరుసగా ‘నిశ్శబ్ద, నమ్ముర మందార హువే, హబ్బా, అమృతవర్షిణి, ముకుందా మురారి’ వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. కన్నడలో దాదాపు 25 సినిమాలు నిర్మించారామె.
తెలుగులో చిరంజీవితో ‘మంజునాథ’, కృష్ణతో ‘చంద్రవంశం’, మోహన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, కౌశిక్ తదితర భారీ తారాగణంలో ‘జగదుర్గురు ఆదిశంకర’ సినిమాలు తీశారు. ప్రస్తుతం కన్నడంలో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పదిభాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోపు ఈ విషాదం నెలకొంది. భర్త నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న జయశ్రీదేవికి కుమార్తె వెన్నెల ఉన్నారు. ఆమె బ్యాంక్ ఉద్యోగినిగా చేస్తున్నారు. మృదుస్వభావిగా పేరు తెచ్చుకున్న నారా జయశ్రీదేవి అంత్యక్రియలు నేడు బెంగళూరులో జరుగుతాయి. ఆమె మృతిపట్ల కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.