పోలీస్ పాత్రలో... పటాస్ | Police role ... patas | Sakshi
Sakshi News home page

పోలీస్ పాత్రలో... పటాస్

May 9 2014 11:35 PM | Updated on Sep 2 2017 7:08 AM

పోలీస్ పాత్రలో... పటాస్

పోలీస్ పాత్రలో... పటాస్

బాక్సాఫీస్ వద్ద ‘పటాస్’ మోత మోగించడానికి కల్యాణ్‌రామ్ సంసిద్ధమయ్యారు.

బాక్సాఫీస్ వద్ద ‘పటాస్’ మోత మోగించడానికి కల్యాణ్‌రామ్ సంసిద్ధమయ్యారు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ మోత మోగించడం ఏంటి? అనుకుంటున్నారా! ఆయన తాజా సినిమా పేరు ‘పటాస్’. రచయిత అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ... నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకుడు కూడా ఆయనే.
 
  శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నందమూరి జానకీరామ్ కెమెరా స్విచాన్ చేయగా, జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు. ‘కిక్’ సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నందమూరి హరికృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా విజయం సాధించాలని ఆహూతులందరూ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రమే ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సంస్థలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
 
  ‘కందిరీగ, ఆగడు’ చిత్రాలకు రచయితగా పనిచేసిన నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన కల్యాణ్‌రామ్‌గారికి కృతజ్ఞతలు. ఆసక్తికరమైన మలుపులతో సాగే... యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పటాస్’. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే అంశాలు ఇందులో ఉంటాయి. కల్యాణ్‌రామ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపిస్తారు. నేటి నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. కొత్తమ్మాయి కథానాయికగా పరిచయమయ్యే ఈ సినిమాలో సాయికుమార్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: సాయికార్తీక్, కూర్పు: తమ్మిరాజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement