
గత మూడేళ్లుగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి
సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీల గురించి ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తూ.. వారిని కించపర్చడం (ట్రోల్) బాగా ఎక్కువయ్యింది. కొందరు సెలబ్రిటీలు వీటిని పట్టించుకోరు. కానీ జునియర్ బచ్చన్ మాత్రం ఇలాంటి వారికి సరైన సమాధానం ఇస్తుంటారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యతో కలిసి విహారయాత్ర కోసం పారిస్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని వెబ్‌సైట్లు పారిస్ ట్రిప్‌లో అభిషేక్, ఐశ్వర్య దెబ్బలాడుకున్నారనే వార్తలను ప్రచారం చేశాయి. అయితే అభిషేక్ ఆ వార్తలను ఖండిచడమే కాక ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయోద్దంటూ చిన్న వార్నింగ్‌లాంటిదే ఇచ్చారు.
అయిన ట్రోలర్స్ మాత్రం అభి వార్నింగ్‌ను లెక్క చేయకపోగా.. ఆయన చేసిన వార్నింగ్ ట్వీట్‌పై చిత్రమైన కామెంట్ చేశారు. ‘అవును మీరు గత మూడేళ్లుగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అలాంటప్పుడు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎలా వస్తున్నాయని’ రవి పురోహిత్ అనే నెటిజన్ ప్రశ్నించారు. దీనికి అభిషేక్ దీటుగా సమాధానమిచ్చారు. ‘ఎందుకంటే సర్.. నేను సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతను కూడా. ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాను. వాటిలో క్రీడలు ఒకటి’ అని సమాధానమిచ్చారు.
Because, sir, I have several other businesses that I run apart from acting and producing movies. Sports being just one of them.
— Abhishek Bachchan (@juniorbachchan) July 24, 2018
అభిషేక్‌కు దాదాపు మూడేళ్లుగా సినిమాల్లేవు. 2016లో వచ్చిన ‘హౌస్‌ఫుల్ 3’ చిత్రం తర్వాత అభిషేక్ మరే చిత్రంలో కనిపించలేదు. ఈ చిత్రంలో కూడా ఆయన ముగ్గురు హీరోల్లో ఒకరిగా కన్పించారు. దీని గురించే సదరు నెటిజన్ ఈ ‘గురు’ హీరోపై ట్విటర్‌లో కామెంట్ చేశాడు.
ప్రస్తుతం అభిషేక్ ‘మన్మర్జియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఈ విషయం గురించి కూడా ప్రస్తావిస్తూ ‘అసలు అనురాగ్ కశ్యప్ తన సినిమాలో మిమ్మల్ని ఎలా తీసుకున్నారు. అతనికి మరో హీరో దొరకలేదా’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు బదులుగా అభిషేక్ ‘అనురాగ్ నన్ను ‘సినిమా స్టార్‌గా భావించారు. అందుకే నన్ను ఈ చిత్రం కోసం తీసుకున్నారని’ సమాధానమిచ్చారు.
‘మన్మర్జియా’ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాప్సి కథానాయిక. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.