ఆ స్ఫూర్తితోనే రూలర్‌ చేశాం

nandamuri balakrishna speech at ruler movie - Sakshi

– బాలకృష్ణ

‘‘రైతుల మీద సినిమాలు చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఓ సందర్భంలో చాలామందిని కలిశాను కూడా. కానీ కుదర్లేదు. ‘రూలర్‌’ సినిమాతో ఆ కోరిక కొంత తీరింది’’ అన్నారు బాలకృష్ణ. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి. కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘రూలర్‌’. ఇందులో వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి శీను, నందమూరి రామకృష్ణ విడుదల చేశారు.

బాల కృష్ణ మాట్లాడుతూ–‘‘నేనూ, కల్యాణ్, కేఎస్‌ రవికుమార్‌ కలిసి చేసిన ‘జై సింహా’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే ‘రూలర్‌’ సినిమా తీశాం. మొదట్లో ఈ సినిమాకు మరో కథ అనుకున్నాం. కుదర్లేదు. ఆ సమయంలో నేను పరుచూరి మురళిగారికి ఫోన్‌ చేశాను. ఆయన దగ్గర ఉన్న ఓ కథను వినిపించారు. ఆ కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయాలని నిర్ణయించు కున్నాను. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, కొత్తదనం అందించాలనే ప్రయత్నాలు చేస్తుంటాను.

ఈ ప్రయత్నంలో భాగంగానే ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. కళామతల్లికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించిన తెలుగు ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘రూలర్‌’ అనే పేరు బాలకృష్ణగారికి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. తమిళంలో రవికుమార్‌గారు చేసిన సినిమాలు మాలాంటి దర్శకులకు రిఫరెన్స్‌లా ఉపయోగపడతాయి.  సి.కల్యాణ్‌గారికి అభినందనలు’’అన్నారు బోయపాటి శీను. ‘‘ఇండస్ట్రీలో నాకు బాగా సపోర్ట్‌ అందించిన వ్యక్తి బాలకృష్ణగారు.

కేఎస్‌ రవికుమార్‌ సూపర్‌ డైరెక్టర్‌. సి.కల్యాణ్‌గారితో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఇంతమంది నాకు కావాల్సిన వ్యక్తులు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు నటుడు రాజశేఖర్‌. ‘‘జైసింహా’ తర్వాత మా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ఇది. టీమ్‌ అందరూ ఎంతగానో కష్టపడ్డారు’’ అన్నారు కేఎస్‌ రవికుమార్‌. ‘‘బాలకృష్ణగారు ఈజ్‌ గ్రేట్‌’ అనేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు సి. కల్యాణ్‌. కథానాయికలు సోనాల్‌ చౌహాన్, వేదిక మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు, అంబికా కృష్ణ, జీవితా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top