పోటీ మంచిదే

Naga Chaitanya reveals his character in Sailaja Reddy alludu - Sakshi

‘‘సక్సెస్‌ విషయంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి. పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. కథ ముఖ్యం. సినిమా సక్సెస్‌ అనేది కేవలం హీరో, డైరెక్టర్‌దే కాదు. ఆ సినిమాకి చేసిన ఇతర యాక్టర్స్, టెక్నీషియన్స్‌కూ చెందుతుంది’’ అన్నారు నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా ఎస్‌. రాధాకృష్ణ సమర్పణలో నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.

► ఈ సినిమాలో ఈగో లేని హీరో క్యారెక్టర్‌ చేశాను. కానీ, నా చుట్టూ ఉన్న క్యారెక్టర్స్‌ ఫుల్‌గా ఈగో ఫీల్‌ అవుతాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? అనేది ఆసక్తికరం. అనవసర ఈగో వల్ల వచ్చే సమస్యలు, రిలేషన్‌ బ్రేక్‌ అయ్యే పరిస్థితులను సినిమాలో చూపించాం. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్‌ డ్రామా ఉంది. నాకు, ‘వెన్నెల’ కిశోర్‌ మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. నా దృష్టిలో ఒక బ్యాలెన్సింగ్‌ కోణంలో ఈగో కరెక్టే అనిపిస్తుంది. కానీ, అది పక్కవారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ఈ సినిమాతో ఆడియన్స్‌కు మరింత చేరువ అవుతాను.

► మారుతీగారు ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నప్పుడు నేను ‘ప్రేమమ్‌’ చేస్తున్నాను. అప్పుడు ఆయనతో పరిచయం అయ్యింది. అలా ఈ సినిమా ప్రారంభానికి బీజం పడింది. నిర్మాత రాధాకృష్ణగారి జడ్జిమెంట్‌ బాగుంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్‌ ఇండస్ట్రీకి కావాలి. నాన్నగారితో రమ్యకృష్ణగారు చాలా సినిమాలు చేశారు. ఈ సినిమా బిగినింగ్‌లో రమ్యకృష్ణగారితో కలిసి వర్క్‌ చేయడం కాస్త నెర్వస్‌గా అనిపించింది.

► ఒక సినిమా రిలీజ్‌ డేట్‌ మార్చడం కరెక్ట్‌ కాదన్నదే నా అభిప్రాయం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ రిలీజ్‌ డేట్‌ మార్చాల్సి వచ్చింది. సమంత ‘యు టర్న్‌’, నా సినిమా ఒకేసారి వస్తాయనుకోలేదు. నిజానికి వాళ్లే ముందు డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. మా సినిమా, మీ ‘యు టర్న్‌’తో పాటు వస్తుందని సమంతతో చెప్పినప్పుడు ఇంట్లో ఓ డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. మా ఇద్దరి సినిమాల్లో  ఏది సక్సెస్‌ కావాలంటే.. రెండూ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను.

► యువసామ్రాట్‌ ట్యాగ్‌ వద్దని మారుతిగారికి చెప్పాను. కానీ వినలేదు. ఈ ట్యాగ్‌ను పెద్ద బాధ్యతగా ఫీల్‌ అవుతున్నాను. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చదువుతాను. నెగటివ్‌ కామెంట్స్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటాను. నా మీద ప్రేమతోనే వాళ్లు అలా స్పందిస్తున్నారనుకుంటున్నా.

► ‘సవ్యసాచి’ సినిమాలో ఒక సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. నవంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. శివనిర్వాణ డైరెక్షన్‌లో చేయబోతున్న సినిమా అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో, ‘వెంకీమామ’ సినిమా అక్టోబర్‌ ఎండింగ్‌లో స్టార్ట్‌ అవుతాయి.

► నాన్నగారి కోసం (నాగార్జున) రాహుల్‌ రవీంద్రన్‌ ఓ కథ రెడీ చేస్తున్నాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాలో నాన్నగారితో కలిసి యాక్ట్‌ చేసేది నేనా? అఖిలా? అనేది త్వరలో తెలుస్తుంది. డిజిటల్‌ మీడియా వైపు మా బ్యానర్‌ ఫోకస్‌ పెట్టింది. కొన్ని వెబ్‌ సిరీస్‌లు ప్లాన్‌ చేస్తున్నాం.

► కొత్త డైరెక్టర్స్‌ను ప్రోత్సహించడం ఇష్టమే. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశాను కూడా. కొన్ని వర్కౌట్‌ కాలేదు. అయితే ఒకరిని వేలెత్తి చూపే మనస్తత్వం కాదు నాది. నా జడ్జిమెంట్‌ కూడా తప్పు అయ్యుండవచ్చు. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కెల్లా ‘ప్రేమమ్‌’కు బాగా కనెక్ట్‌ అయ్యాను.

► పెళ్లి తర్వాత లైఫ్‌ బాగుంది. పెళ్లి తర్వాత సమంతకు కెరీర్‌ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ, ఆమె కెరీర్‌ సూపర్‌గా సాగడం హ్యాపీగా ఉంది.

► కెరీర్‌ పరంగా యాక్టర్స్‌ అందరికీ థ్రెట్‌ ఉంటుంది. అందరూ మంచి సినిమాలే చేయాలనుకుంటారు. ఇలాంటి పోటీ వాతావరణం మంచిదే. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ‘అర్జున్‌ రెడ్డి’, ‘ఆర్‌ ఎక్స్‌ 100’... సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నేనీ టైప్‌ సినిమాలు చేయాలంటే కాస్త టైమ్‌ పడుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top