కన్నడ కమెడియన్‌ మైఖేల్‌ మధు మృతి

Michael Madhu Kannada Comedy Actor Dies - Sakshi

ప్రముఖ కన్నడ హాస్యనటుడు మైఖేల్ మధు ఈ నెల 13న(బుధవారం) బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గుండె పోటుతో కుప్పకూలిన మైఖేల్‌ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. మైఖేల్ మధు అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆయన అంత్యక్రియలకు కన్నడ సినీ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదు. మైఖేల్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు

హోంబలే ఫిల్మ్స్ క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ ట్విట్టర్‌ ద్వారా మైఖేల్‌ మృతికి సంతాపం తెలిపారు. ‘రిప్‌ మైఖేల్ మధు. మీ సినిమాలు ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులకు నవ్వును కలిగిస్తాయి’ అంటూ కార్తీక్‌ ట్వీట్‌ చేశారు.

మైఖేల్‌, శివరాజ్‌కుమార్ నటించిన ‘ఓం’ చిత్రంతో హాస్యనటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాల పాటు తన కెరీర్‌లో 300 కి పైగా చిత్రాల్లో నటించారు. ఏ, ఏకే 47, సూర్య వంశ, ష్ !, నీలంబరి, గజనూర్‌ గండు వంటి పాపులర్‌ చిత్రాలు వీటిలో కొన్ని. మైఖేల్ మధు మొదట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు కొరియోగ్రాఫర్ కావాలనుకున్నారంట. మైఖేల్‌కు అమెరికన్ గాయకుడు, డ్యాన్సర్‌ మైఖేల్ జాక్సన్‌ అంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆయన తన పేరు చివర మైఖేల్‌ను చేర్చుకున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top