అలా కష్టపడితే ఫలితమేముంది

madonna sebastian About Her Next Music Album - Sakshi

తమిళసినిమా: మలయాళ చిత్రం ప్రేమమ్‌తో బహుభాషా నటిగా పేరు తెచుకున్న యువ నటీమణుల్లో మడోనా సెబాస్టియన్‌ ఒకరు. ఇటీవల ఈ అమ్మడు తమిళంలో విజయ్‌సేతుపతితో నటించిన జుంగా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. సక్సెస్‌ఫుల్‌ నటి అనిపించుకున్నా మడోనాసెబాస్టియన్‌  చిత్రాల ఎంపికలో మాత్రం కాస్త ఎక్కువగా ఆలోచిస్తుందని, వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడంలేదనీ ప్రచారం వైరల్‌ అవుతోంది. ఇలాంటి విషయాల గురించి ఈ బ్యూటీ ఏమంటుందో చూద్దాం. అవును నేను చిత్రాల ఎంపికలో కాస్త ఎక్కువగానే ఆలోచిస్తాను. ఎందుకంటే నా వ్యక్తిగత జీవితానికి సమయం అవసరం. కుటుంబం, మనకు నచ్చిన విషయాల కోసం సమయాన్ని వెచ్చించకుండా శ్రమించి ఫలితం ఏమిటీ? ఎలాంటి కథా పాత్రలను ఎంచుకోవాలన్నది నాకు తెలుసు. ప్రస్తుతం కిచ్చా సుదీప్‌కు జంటగా ఒక కన్నడ చిత్రంలో నటిస్తున్నాను.

తరువాత ఒక తెలుగు చిత్రంలో నటించనున్నాను. పలు విధాలుగా భావోద్వేగాలను ప్రదర్శించే పాత్రలను కోరుకుంటున్నాను. నాకు జిమ్‌లో వర్కౌట్స్‌ చేయడం అంటే ఇష్టం. అలాగని స్లిమ్‌గా మారడం నచ్చదు. ఆహారం విషయంలో బాగానే లాగించేస్తాను. సమయం దొరికితే కుటుంబ సభ్యులందరం ఇంట్లోనే ఉంటాం. పనిలేకుండా బయటకు వెళ్లడం ఇష్టం ఉండదు. నా స్నేహితుల్లో అధిక మంది సినిమా రంగానికి సంబంధం లేనివారే. సినిమా రంగంలో సన్నిహితుడు విజయ్‌సేతుపతినే. ప్రేమమ్‌ చిత్రంలో నాతో కలిసి నటించిన సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్‌తో ఇంతకు ముందు టచ్‌లో ఉన్నాను. ప్రస్తుతం ముగ్గురం బిజీగా ఉండటంతో మాట్లాడుకోవడం కుదరడం లేదు. అయితే అనుపమ పరమేశ్వరన్‌తో అప్పుడప్పుడూ టచ్‌లో ఉన్నా. సాయిపల్లవి కూడా బాగుందనే భావిస్తున్నా. మరో విషయం ఏమిటంటే నేను ఆరేళ్ల వయసులోనే గాయనినయ్యాను. అయితే నటిగా బిజీగా ఉండడం వల్ల పాడటానికిప్పుడు  ప్రాముఖ్యత నివ్వడం లేదు. నాకు సంగీత బృందం ఉంది. త్వరలోనే ఒక తమిళ ఆల్బమ్‌ను విడుదల చేస్తాను అని పేర్కొంది ఈ జాన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top