‘తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలి’

Ke Gnanavel Raja About Naa Peru Surya Tamil Release - Sakshi

తమిళసినిమా: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మనం చాలా నేర్చుకోవాలని స్టూడియోగ్రీన్‌ సంస్థ అధినేత కేఇ.జ్ఞానవేల్‌రాజా వ్యాఖ్యానించారు. అల్లుఅర్జున్‌ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రం తమిళంలోనూ ఎన్‌ పేర్‌ సూర్య పేరుతో విడుదల కానుంది. కే.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషా లగడపాటి నిర్మించిన ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.

ఈ చిత్రం తమిళనాడు విడుదల హక్కులను శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అధినేత శక్తివేల్‌ పొందారు. నటి అనుఇమ్మానుయేల్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో శరత్‌కుమార్‌ విలన్‌గా నటించడం విశేషం. అరుణ్, కవిత, బిమ్మన్,  చారుహాసన్, సాయికుమార్, ప్రదీప్‌ ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 

కేఇ.జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ మనం తెలుగు పరిశ్రమ నుంచి చాలా నేర్చుకోవాలని అన్నారు. నటీనటుల పారితోషికం, వారి సహకారం వంటి విషయాలను మనం అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. అక్కడ రూ.50కోట్లు పారితోషికం తీసుకునే నటుడు కూడా అడ్వాన్స్‌గా రూ.5 లక్షలే తీసుకుంటారని, దీన్ని మన నటీనటులు కూడా పాటిస్తే బాగుంటుందని ఆన్నారు. ఈ విషయంపై నడిగర్‌ సంఘం చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

బాలీవుడ్‌కు వెళ్లినా తెలుగు చిత్రపరిశ్రమ గురించే చెప్పుకుంటున్నారని, ఆ పరిశ్రమ అంత సుభిక్షంగా ఉందని, అందుకే తానూ అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించానన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ లారెన్స్‌ హీరోగా తాను నిర్మించిన లక్ష్యం (తెలుగులో స్టైల్‌) తమిళ ప్రేక్షకులు ఆదరించారని, మంచి కథా చిత్రాలను ఎప్పుడూ ఆదరించే  తమిళ ప్రేక్షకులు ఎన్‌ పేర్‌ సూర్య చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇది అల్లుఅర్జున్‌ కెరీర్‌లోనే పెద్ద చిత్రంగా నిలిచిపోతుందని అన్నారు. సమావేశంలో శక్తిఫిలిం ఫ్యాక్టరి శక్తివేల్, రచయిత విజయ్‌బాలాజీ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top