అది డ్రగ్ పార్టీ కాదు..

న్యూఢిల్లీ : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన నివాసంలో సినీ ప్రముఖులకు డ్రగ్ పార్టీ ఇచ్చారని వచ్చిన ఆరోపణలపై కరణ్ స్పందించారు. తన ఇంట్లో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేయడంతో నెటిజన్లు కరణ్ జోహార్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ పార్టీలో నటులంతా డ్రగ్స్ మత్తులో జోగుతున్నారని శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి దీపికా పడుకోన్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, మలైకా అరోరా వంటి స్టార్స్ హాజరయ్యారు. ఈ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ వివరణ ఇచ్చారు. వారమంతా షూటింగ్‌లతో బిజీగా గడుపుతూ అలిసిపోయిన నటులందరూ సేదతీరేలా తన నివాసంలో విందు ఏర్పాటు చేశానని, నిజంగా సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుని ఉంటే తాను ఆ వీడియోను షేర్ చేసేవాడినా అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు.
డెంగ్యూ జ్వరంతో కోలుకుంటున్న విక్కీ కేవలం హాట్ వాటర్‌లో నిమ్మ రసం తీసుకున్నారని, తన తల్లి సైతం తమతో పాటే కొద్దిసేపు కూర్చున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సోషల్ గ్యాదరింగ్‌లా ఈ పార్టీ జరిగిందని అన్నారు. హాజరైన వారంతా మంచి సంగీతం, ఆహారాన్ని ఆస్వాదించారని అంతకుమించి ఏమీ జరగలేదని వెల్లడించారు. తాను ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ సేవించారనే ఆరోపణలు నిరాధారమని, మరోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి