అనారోగ్యంపాలైన నటుడికి కమల్ ఆర్థిక సాయం

ప్రముఖ తమిళ నటుడు, విలన్ పొన్నంబళమ్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిపాలయ్యారు. కిడ్నీ సంబంధ సమస్యలతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన స్టార్ హీరో, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ అతనికి ఆర్థిక చేయూత అందించనున్నారు. ఫోన్‌లో అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని డబ్బు సాయం చేస్తానని మాటిచ్చారు. అలాగే అతని పిల్లలను చదివించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. పొన్నంబళమ్ ఆరోగ్య పరిస్థితి గురించి కమల్ హాసన్ టీమ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. (కమల్‌తో డేటింగ్.. పూజా క్లారిటీ)
మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో అతను ఆక్సిజన్ మాస్క్‌తోనే ఊపిరి పీల్చుకుంటున్నారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా అతను "స్టంట్‌మ్యాన్" చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి 'అపూర్వ సాగోధరార్గల్', 'మైకేల్ మదన కామరాజన్' వంటి చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. దీంతో అతను రజినీకాంత్ 'ముత్తు', 'అరుణాచలం', అజిత్ 'అమర్కలమ్', విక్రమ్ 'సామి' వంటి చిత్రాల్లో కనిపించారు. ఆయన చివరిసారిగా 2019లో రిలీజైన 'కోమలి' సినిమాలో నటించారు. పొన్నంబళమ్ తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లోనూ పాల్గొన్నారు. (భారతీయుడు ఆగలేదు)