
ఒక కోరిక నెరవేరింది!
‘తీయని కలలే ఫలియించెలే...’ అంటూ ఆనందంతో గోవా సముద్రతీరంలో... సోలో సాంగేసుకుంటున్నారు ఇలియానా. ఏంటి? నిజం అనుకుంటున్నారా! ఉత్తినే. అయితే... ప్రస్తుతం ఇలియానా సంబరం మాత్రం అలాగే ఉంది
‘తీయని కలలే ఫలియించెలే...’ అంటూ ఆనందంతో గోవా సముద్రతీరంలో... సోలో సాంగేసుకుంటున్నారు ఇలియానా. ఏంటి? నిజం అనుకుంటున్నారా! ఉత్తినే. అయితే... ప్రస్తుతం ఇలియానా సంబరం మాత్రం అలాగే ఉంది. ఉన్నట్టుండి ఎందుకీ సంబరం అనుకుంటున్నారా? అయితే, వివరాల్లోకెళ్దాం. గ్లామర్ ఫీల్డ్‌లో అడుగుపెట్టినప్పట్నుంచీ ఇలియానా కోరిక ఒక్కటే. అదే... ఖాన్ త్రయంతో జతకట్టడం. ‘బర్ఫీ’తో బాలీవుడ్‌లో తొలి విజయం అందుకున్నప్పుడు తన కోరిక తీరే సమయం ఆసన్నమైందని ఉబ్బితబ్బిబ్బయ్యారు ఇలియానా. ఆమిర్, సల్మాన్, షారుక్... ఈ ముగ్గురితో నటిస్తే నటిగా తన లక్ష్యం నెరవేరినట్లేనని మీడియా సాక్షిగా చెప్పారు కూడా. కానీ... షాహిద్ కపూర్‌తో తాను నటించిన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిల పడగానే... ఇక ఇలియానా ఆశలు అటకెక్కినట్టే అనుకున్నారంతా. అయితే... అలా అనుకున్నవారందరూ నాలుక కరుచుకునేలా ఓ విశ్వసనీయ సమాచారం బాలీవుడ్ మీడియాలో వెలువడింది.
ఇలియానా ఆకాంక్ష కొంతమేరకు నెరవేరబోతోందని తెలిపే వార్త అది. ఆమిర్‌ఖాన్‌తో ఈ గోవా సుందరి జతకట్టబోతున్నారట. ఆమిర్ కూడా ఇలియానాతో నటించడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిసింది. సినిమా వివరాలు అధికారికంగా వెలువడటమే ఇక ఆలస్యం. ఇలియానా సంబరానికి కారణం అదే. ఇక సల్మాన్, షారుక్‌లతో కూడా నటిస్తే ఇలియానా ఆకాంక్ష పూర్తిగా నెరవేరినట్టే. ప్రస్తుతం ఈ ఇలియానా హ్యాపీ ఎండింగ్, మే తేరా హీరో చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.