తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

Hema Comments On Bigboss Show - Sakshi

‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో గడిపిన వారం రోజుల్లో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ మొదలు పెట్టకుండానే బయటకు వచ్చాను. అయినా హౌస్‌లో ఉన్న సమయంలో బోలెడెంత నాలెడ్జ్‌ వచ్చింది. నేను తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు. వారి ముందు (బిగ్‌బాస్‌లో ఉన్న మిగతా పార్టిసిపెంట్స్‌ని ఉద్దేశిస్తూ) నా 30 ఏళ్ల నటనా జీవితం వృథా. నేను తిట్టలేకపోయాను. తిట్టించుకోలేకపోయాను (నవ్వుతూ)’’ అన్నారు నటి హేమ. నాగార్జున హోస్ట్‌గా ఇటీవల బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోలో ఎలిమినేట్‌ అయిన తొలి పార్టిసిపెంట్‌ హేమ. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హేమ మాట్లాడుతూ ‘‘బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా నేను వెళ్లలేదు.

సెకండ్‌ సీజన్‌కు పిలుపు రాలేదు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉందామని థర్డ్‌ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాను. నేటి తరం పిల్లలు మనం చేప్పేది వినరు. సరిగ్గా అర్థం చేసుకోరు. అక్కా అక్కా అంటూ నన్నే టార్గెట్‌ చేశారు (నవ్వుతూ). నాకు బిగ్‌బాస్‌ హౌస్‌పైన ఫిర్యాదులు లేవు. హౌస్‌లోనూ నటిస్తే జనాలు నన్ను తిడతారు. హౌస్‌లోని వారు గేమ్‌ ఆడి గెలవాలి అనుకుంటున్నారు. అందులో తప్పు లేదు. అది షో మాత్రమే. హౌస్‌ నుంచి ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినందుకు బాధగా లేదు. వ్యక్తిగతంగా నాకు చాలా మంది ట్వీట్లు చేశారు. మెసేజ్‌లు పంపారు. చాలా సంతోషంగా అనిపించింది. హౌస్‌లో శ్రీముఖిది కన్నింగ్‌ క్యారెక్టర్‌. గొడవలు పెడుతుంది. హిమజాకు, నాకు గొడవలు ఉన్నాయి. అందుకే నన్ను టార్గెట్‌ చేసింది. నేను పారితోషికం డిమాండ్‌ చేసే హౌస్‌లోకి వెళ్లాను. అయితే ఆ పారితోషికం గురించి చెప్పలేను. నేను గేమ్‌ ఆడలేదు. హౌస్‌లో వితిక, శ్రీముఖి బాగా నటిస్తున్నారు. అశు రెడ్డి ఇంకొన్ని రోజులు హౌస్‌లో ఉండాలని కోరుకుంటున్నాను.

నా ఎలిమినేషన్‌కు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా కారణమై ఉండొచ్చు. నాకు గూగుల్‌ ఓట్లు బాగానే వచ్చాయి. కానీ హాట్‌స్టార్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో ఓట్లు వేస్తేనే లెక్కలోకి వస్తుంది. ఇలాంటి టెక్నికల్‌ ఇష్యూస్‌ నన్ను అభిమానించే విలేజ్‌లోని వారికి తెలియకపోవచ్చు. అది నా దురదృష్టం. నేను ఎలిమినేట్‌ అయినందుకు మా ఇంట్లో నో రియాక్షన్‌. ఏం మమ్మీ.. టైమ్‌పాస్‌ చేసి వచ్చేశావా అని నా కూతురు అడిగింది. అలాగే నేను సినిమాల్లో నటించడం మానుకున్నాననే వార్తల్లో నిజం లేదు’’ అన్నారు. త్వరలో మీరు వైఎస్సార్‌సీపీ పార్టీలో జాయిన్‌ కాబోతున్నారా? అనే ప్రశ్నకు.. ‘‘తొందర్లోనే అనౌన్స్‌ చేస్తాను. జగన్‌గారికి సపోర్ట్‌ చేశాను. ప్రచారం చేయలేదు. జగన్‌గారు, ఆయన పార్టీ అంటే ఇష్టం. నేను స్ట్రాంగ్‌ అవ్వాలి. ఏదొచ్చినా ఫేస్‌ చేయగలగాలి. తీసుకున్న స్టాండ్‌కు కట్టుబడి ఉండే గుండె ధైర్యం రావాలి. నా కూతురు డిగ్రీ సెకండ్‌ ఇయర్‌కి వెళ్లే లోపు నా నిర్ణయం చెబుతా’’ అన్నారు  హేమ. 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top