సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు
హైదరాబాద్ : సంగీతంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చక్రి...... ఇప్పటివరకు దాదాపు 85 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు చక్రి. బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్రహీరోలతో పాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, తరుణ్, సుమంత్ లాంటి యువహీరోలకు కూడా సంగీతమందించారు. అగ్ర హీరోల్లో వెంకటేష్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు మినహా దాదాపు అందరి స్టార్లకు సంగీతాన్ని అందించిన ఘనత చక్రికే దక్కింది.
నాగార్జున, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన శివమణి పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి, చక్రి కాంబినేషన్‌లో వచ్చిన సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టించింది. బాలకృష్ణ, రవి చావలి కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమన్నారాయణకి కూడా చక్రినే సంగీతమందించారు. సింహా చిత్రానికి ఆయన ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకున్నారు. అలాగే సత్యం చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'ఎర్రబస్సు' చిత్రానికి చక్రి చివరిగా సంగీతం అందించారు.