టైమొచ్చింది!

Break The Silence of  Times - Sakshi

సైలెన్స్‌ బ్రేక్‌ చేసే టైమొచ్చింది!

ఓ కిటికీ లేని గది శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది దశాబ్దాలుగా గుండెల్లో గూడుకట్టుకున్న భయాన్ని జయించిన మహిళలే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకొని తమ గుండె గాయాలకు స్వాంతన చేకూర్చుకున్నారు.

అక్కడకు చేరినవారంతా స్త్రీలు. బతుకు బండిని లాగేందుకో, కన్నబిడ్డల కడుపు నింపేందుకో, తల్లిదండ్రుల బాధ్యతను భుజానికెత్తుకున్నందుకో, భర్త చేతిలో మోసపోయినందుకో తోటి ఉద్యోగులైన పురుషుల నుంచీ, ఇతరుల నుంచీ తామెదుర్కొన్న అనేకానేక అవమానాలను, అవహేళనలను, వేధింపులను, చివరకు అత్యాచార యత్నాల చేదు అనుభవాలను సైతం గుండె గొంతుకలోంచి దిగమింగిన వైనాన్ని తొట్టతొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు.

ఆర్థిక స్వావలంబనే ఆకాశంలో సగభాగాన్ని ఆత్మస్థైర్యంతో నిలబెడుతుందన్న ఒకే ఒక్క కారణం మహిళలను భద్రత లేకున్నా పని ప్రదేశాల్లో కొనసాగేలా చేస్తుంది. స్త్రీ పురుష సమ్మతితో జరగాల్సిన రెండు మనసుల శారీరక కలయికని జుగుప్సాకరమైన లైంగిక హింసాప్రయోగంతో స్త్రీలను వారి పని ప్రదేశాల నుంచి తరిమికొడుతోన్న విషయం చాలా కాలంగా దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది.
ఇదే నేప«థ్యంలో ఇటీవల లైంగిక హింసపై నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన స్త్రీలను 2017వ సంవత్సరానికిగాను ‘టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా  టైమ్‌ మేగజైన్‌ ప్రకటించింది. అమెరికాతో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలందరినీ టైమ్‌ మేగజైన్‌ శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని మిషన్‌ yì స్ట్రిక్‌ లోని ఓ గదిలో సమావేశపరిచింది. దశాబ్దాలుగా వారిని వెంటాడుతోన్న కన్నీటి గాథలు బద్దలైన అగ్నిపర్వతాలయ్యి, ఆ గదిని మరింత వేడెక్కించాయి.

ఉన్నతోద్యోగాలు మొదలుకొని, కార్యాలయాలను శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికురాలి వరకు పురుషుల వెకిలి చేష్టలకు, లైంగిక వేధింపులకు, అత్యాచార యత్నాలకూ గురైనవారున్నారక్కడ. విభిన్న వర్గాలు, వైవిధ్యభరితమైన ఉద్యోగాలు, భిన్నమైన ఆర్థిక పరిస్థితులు, హోదాలు, జీతాల్లో అంతరాలూ. అయినా వారందరినీ అక్కడకు చేర్చింది మాత్రం ఒక్కటే.. దివారాత్రులు తమను వెంటాడి వేటాడుతోన్న పురుష దేహాల పీడకలలు. అప్పటివరకూ అణచిపెట్టుకున్న వేనవేల చేదు అనుభవాలను చెప్పడం ప్రారంభించారు ఒక్కొక్కరుగా..

గాయాన్ని చూపిన గాయని
టేలర్‌ స్విఫ్ట్‌ ... పాప్‌ సింగర్‌... ఓ సంగీత ఝరి. అదే ఆమెను డెన్వర్‌ రేడియో స్టేషన్‌లో డీజేగా పనిచేస్తోన్న ముల్లర్‌ ఆహ్వనాన్ని మన్నించేలా చేసింది. స్విఫ్ట్‌ని ఇంటర్వ్యూ చేయాల్సిన ముల్లర్‌ హఠాత్తుగా, అందరూ చూస్తూ ఉండగా ఆమె లోదుస్తుల్లోకి చేతులు పెట్టాడు! ఈ హఠాత్పరిణామానికి బిత్తరపోయిన టేలర్‌ స్విఫ్ట్‌ అతనికి దూరంగా జరిగేందుకు ప్రయత్నించింది. కానీ అతడి ఉక్కు పిడికిల్లోంచి బయటపడేందుకు గిజగిజలాడాల్సి వచ్చింది. గుండెల్ని పిండేసే ఈ ఘటనపై ఆమె రేడియో స్టేషన్‌ వారికి ఫిర్యాదు చేసింది. టేలర్‌ స్విఫ్ట్, ఆమె తల్లి విచారణ సమయంలో కూడా అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాల చీకటి చరిత్రను బహిరంగంగా చర్చించాలని టేలర్‌ స్విఫ్ట్‌ తొలిసారిగా అక్కడే నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు ఆమెలాంటి బాధితులు. అన్ని రంగాల్లోని వాళ్లు.

ఒక్కో ‘మీ టూ’.. ఒక్కో కడలి
టేలర్‌ స్విఫ్ట్‌ అయినా, కాలిఫోర్నియా పొలాల్లో పనిచేస్తోన్న శ్రామికురాలైనా, న్యూయార్క్‌ సిటీలోని రీగల్‌ ప్లాజా హోటల్‌లో పనిచేసే హౌస్‌ కీపర్‌ అయినా అందరూ తమపై జరిగిన అఘాయిత్యాలను గొంతెత్తి ప్రతిఘటించడమొక్కటే పరిష్కారంగా భావించారు. అందుకు ‘మీ టూ’ నినాదమే నాదమైంది. లైంగిక వేధింపులకు గురైన యువతులకు సంఘీభావం ప్రకటించే పనిలో భాగంగా ఒక దశాబ్దం క్రితం తరానా బర్క్‌ అనే సామాజిక కార్యకర్త ‘మీ టూ’ అనే నినాదాన్నిచ్చారు. తరానా స్ఫూర్తితో  ‘మీరు ఏదైనా లైంగిక వేధింపులకు గురైతే ఈ ట్వీట్‌కి ‘మీ టూ’ అని రిప్లై యివ్వండంటూ అలీస్సా మిలానో అనే హాలీవుడ్‌ నటి ఓ రోజు రాత్రి ఓ స్క్రీన్‌ షాట్‌ని పోస్ట్‌  చేశారు. మిలన్‌ నిద్రలేచి చూసేసరికి 30 వేల మంది ‘మీ టూ’ అని దానికి రిప్లై యివ్వడం చూసి ఆమె కళ్లు నీటితో నిండిపోయాయి.

జీతం రాళ్ల కోసమే ఈ మౌనం
‘‘నన్ను వెంటాడుతోన్న చూపుల తాకిడిని నేను గ్రహించాను. హోటల్‌ గదిని శుభ్రం చేసి తిరిగి చూసేసరికి గది తలుపుకి అడ్డంగా ఆ వ్యక్తి ఆబగా నాపై దాడికి సిద్ధంగా నగ్నంగా ఉన్నాడు’’ అంటూ జరిగిన దారుణ  దృశ్యాన్ని వివరిస్తోంది జూవానా మెలారా. ఈ హోటల్‌లో బసచేసేవారి వే«ధింపులపై ఫిర్యాదు చేయకపోవడానికి తమకు రావాల్సిన జీతం రాళ్లే కారణమంటారు గత దశాబ్ద కాలంగా హోటల్‌ లో హౌస్‌ కీపర్‌గా పనిచేస్తోన్న జువానా మెలారా.

మరోసారి    ఆలోచించమన్నారు   ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తుండే  ‘ఐవూ’దీ ఇదే అనుభవం. తన సహోద్యోగు లందరి ఎదుటా తన శరీరాన్ని తడిమి లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తిని గురించి ఫిర్యాదు చేయడానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంపై ఐవూని కలచివేస్తుంది. తన సహ మహిళా ఉద్యోగులు దాదాపు 150 మంది సంతకాలతో తనపై జరిగిన లైంగిక దాడిపై కాలిఫోర్నియా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ‘ఇది నిజమేనా? నిజంగా నువ్వు ఫిర్యాదు చేయబోతున్నావా? మరోమారు ఆలోచించుకొమ్మని హెచ్చరించడం మనలో పాతుకుపోయిన ఉదాసీన ధోరణికి చిహ్నమేనంటారామె.

ఎలుగెత్తితేనే వెలుగొస్తుంది    
 లైంగిక వేధింపులకు గురైన సూజెన్‌ ఫౌలర్‌ బ్లాగ్‌లో చేసిన ఒక పోస్ట్‌ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉబర్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ ఆఫీసర్‌ ట్రావిస్‌ కెలానిక్‌ రాజీనామాకి దారితీసిన ఘటన.. ప్రతిఘటన ప్రభావాన్ని ఎలుగెత్తి చాటింది. ట్రావిస్‌ సహా మరో 20 మందికి ఉబర్‌ ఉద్వాసన పలికింది.
 
ఇరవై ఏళ్లుగా బతుకు భయం
జేమ్స్‌ టోబాక్‌ అనే ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌మేకర్‌తో సమావేశమవడానికి సెల్మా బ్లెయర్‌ 1999లో ఓ రెస్టారెంట్‌కి వచ్చారు. కానీ జేమ్స్‌ టోబాక్‌ హోటల్‌ గది తలుపులు మూసి తన కోర్కె తీర్చాలంటూ ఒత్తిడి చేసిన విషయాన్ని చెపుతూ ‘‘నేను తనని ఎదిరించి ఉంటే అతను నన్ను కిడ్నాప్‌ చేసేవాడనీ, తన దగ్గరున్న పెన్నుతో నా కళ్లు పెరికి హడ్సన్‌ నదిలో తోసేస్తాననీ బెదిరించాడు. దాదాపు 20 ఏళ్ల పాటు తాను నన్ను చంపుతాడనే భయంతోనే బతికాను’’ అని వెల్లడించి,  సినీప్రపంచపు లైంగిక వేధింపుల పరంపరను మరోమారు తెరపైకి తెచ్చారు సెల్మా బ్లెయర్‌.
      
నా బిడ్డలనూ వదలనన్నాడు
‘‘నాపై లైంగిక హింసకు పాల్పడిన వ్యక్తి ఇంటి వరకూ వచ్చాడు. ఇంటి లోనికి కూడా. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తాను ఇకపై నా కోసమే కాదు, నా పిల్లలకోసం కూడా వస్తానని బెదిరించాడు.. అతనికి లొంగకపోతే’’ అని చెప్పారు పాస్క్యుయల్‌ ఫెల్ట్‌.ఇలా మౌనాన్ని ఛేదించి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలపై  ధైర్యంగా మాట్లాడిన ఎందరో మహిళల మనోబలానికి సంకేతంగా ప్రఖ్యాత ‘టైమ్‌’ మేగజైన్‌.. స్త్రీ ఉద్యమ శక్తిని ఈ ఏడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించింది.  
– అత్తలూరి అరుణ, సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top