సూర్యతో మరోసారి స్వీటీ ? | Anushka Will Screening With Surya Next Movie In Kollywood | Sakshi
Sakshi News home page

సూర్యతో ఓకేనా స్వీటీ? 

Nov 20 2019 8:29 AM | Updated on Nov 20 2019 8:29 AM

Anushka Will Screening With Surya Next Movie In Kollywood - Sakshi

సాక్షి, చెన్నై : సూర్యతో మరోసారి రొమాన్స్‌ చేయడానికి స్వీటీ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం. సూర్య కథానాయకుడిగా నటిస్తూ, తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న సేరరై పోట్రు చిత్రం సాధించే విజయం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈయన మంచి విజయాన్ని చూసి చాలా కాలమైందని చెప్పవచ్చు. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన పొలిటికల్‌ నేపథ్యంతో కూడిన ఎన్‌జీకే చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే పూర్తిగా నిరాశ పరిచింది. ఇక కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించిన కాప్పాన్‌ మిశ్రమ స్పందనతోనే సరిపెట్టుకుంది. దీంతో తనే స్వయంగా నిర్మిస్తూ, నటిస్తున్న సూరరై పోట్రు చిత్ర విజయం సూర్యకు చాలా అవసరం. ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్‌ సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకురాలు. చిత్రం ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

కాగా ఆయన ఇప్పుడు దర్శకుడు హరి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు ఆరు, వేల్, సింగం సిరీస్‌ చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. మాస్‌ మసాలా చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న హరి ఇటీవల విక్రమ్‌ హీరోగా సామీ స్క్వేర్‌ చిత్రం చేశారు. అదీ నిరాశపరచింది. కాగా తాజాగా తనకు కలిసొచ్చిన నటుడు సూర్యతో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. నటుడు సూర్య దర్శకుడు వెట్రిమారన్‌తో ఒక చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వెట్రిమారన్‌ ఇటీవల ధనుష్‌ హీరోగా అసురన్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఆ చిత్ర నిర్మాతనే సూర్య, వెట్రిమారన్‌ల కాంబినేషన్‌లో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌. నటుడు సూర్య మరో దర్శకుడికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనే గౌతమ్‌మీనన్‌. వీరిది హిట్‌ కాంబినేషనే. ఇంతకు ముందు కాక్క కాక్క., వారణం ఆయిరం వంటి హిట్‌ చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చాయి. ఆ తరువాత కూడా ఒక చిత్రం తెరకెక్కాల్సి ఉండగా, అది కథ విషయంలో సూర్యకు, దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు మధ్య విబేధాల కారణంగా ఆగిపోయింది.

ఆ తరువాత 11 ఏళ్లకు ఈ కాంబినేషన్‌ మళ్లీ సెట్‌ అయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరిగణేశ్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో అందాల నటి అనుష్కను హీరోయిన్‌గా  నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్‌. అనుష్క ప్రస్తుతం సైలెన్స్‌ చిత్రాన్ని పూర్తి చేసి, త్వరలో అసురన్‌ తెలుగు రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. కాగా సూర్యతో ఆరోసారి నటించే చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement