
ఎన్టీఆర్.. ఏయన్నార్ సినిమాలు ప్రభావితం చేశాయి
‘ఓ తండ్రిగా కుమారుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను పడ్డ తపన ఈరోజు కుమారస్వామిగారిలో చూస్తున్నాను.
హెచ్.డి. కుమారస్వామి
‘‘ఓ తండ్రిగా కుమారుణ్ణి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను పడ్డ తపన ఈరోజు కుమారస్వామిగారిలో చూస్తున్నాను. తండ్రి ఓ నాయకుడు, డబ్బున్నవాడు అని కాకుండా కష్టపడితేనే ఎవరైనా పైకి వస్తారు. ఆ కష్టం నిఖిల్‌లో కనిపిస్తోంది’’ అన్నారు అల్లు అరవింద్. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతోన్న సినిమా ‘జాగ్వార్’. మహాదేవ్ దర్శకత్వంలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై అనితా కుమారస్వామి నిర్మిస్తోన్న ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. టి.సుబ్బరామి రెడ్డి, అల్లు అరవింద్, డి.సురేశ్‌బాబు, గంటా శ్రీనివాసరావులు టీజర్ విడుదల చేశారు. అనంతరం టీఎస్సార్ మాట్లాడుతూ -‘‘చాలామందిలో అధికారం వచ్చిన తర్వాత అహం వస్తుంది. ఆ అహంకారాన్ని జయించి మానవత్వానికి, ప్రేమకి ప్రతిరూపంగా కుమారస్వామి నిలిచారు. నిఖిల్ యాక్టింగ్ హాలీవుడ్ స్టైల్‌లో ఉంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పెద్ద హీరో కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను’’ అన్నారు. హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ -‘‘తెలుగులో ఎన్టీఆర్, ఏయన్నార్.. కన్నడంలో రాజ్‌కుమార్, విష్ణువర్ధన్ సినిమాల ప్రభావం నాపై ఉంది.
మా అబ్బాయిని హీరోని చేయాలన్నది నా కల. ఎగ్జిబ్యూటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా కన్నడంలో పలు హిట్ సినిమాలు అందించాను. నిర్మాతగా పదేళ్ల తర్వాత చేస్తున్న చిత్రం ఈ ‘జాగ్వార్’. కథ డిమాండ్ చేయడంతో 75 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో హీరోగా మా అబ్బాయికి ఇది మంచి లాంచింగ్ అవుతుంది. విజయేంద్ర ప్రసాద్ సలహాతో రెండు భాషల్లో తీస్తున్నాం’’ అన్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘మా నాన్నగారు నాకోసం ఎంతో చేశారు. ఆయనకు నేనేం చేసినా తక్కువే. నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. కథ, మ్యూజిక్, డెరైక్షన్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగుంటాయి. ఎంతో కష్టపడి చేస్తున్న సినిమా. తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘కర్ణాటకలో కుమారస్వామి బెస్ట్ సీయం అని చాలామంది చెప్పారు. కుమారుణ్ణి పెద్ద హీరో చేయాలని తపన పడుతుంటారు.
నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో ిసీబీఐ ఆఫీసర్‌గా నటించాను. పలువురు హాలీవుడ్ నిపుణులు పని చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘తాతయ్య, తండ్రి ఇమేజ్ కాపాడాల్సిన బాధ్యత నిఖిల్‌పై ఉంది’’ అన్నారు గంటా శ్రీనివాసరావు. ‘‘టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. విజయేంద్రప్రసాద్, మహాదేవ్ వంటి సేఫ్ హ్యాండ్స్‌లో నిఖిల్ ఉన్నాడు’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ఎంపీలు కుపేంద్ర రెడ్డి, సీఎస్ పుట్టరాజు, నిర్మాతలు వైజాగ్ రాజు, కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, అశోక్ కుమార్, పారిశ్రామికవేత్త రఘురామరాజు, చిత్ర దర్శకుడు మహాదేవ్, సంగీత దర్శకుడు తమన్, ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస తదితరులు పాల్గొన్నారు.