ప్రేమకు కేరాఫ్‌ మధుబాల

Actress Madhubala born on Valentines Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భిన్న సంస్కతుల సమ్మిలిత దేశాల్లో ఎన్ని సామాజిక అవరోధాలున్నా ఫిబ్రవరి 14వ తేదీని 'వాలెంటైన్స్‌ డే'గా అంటే, ప్రేమికుల రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూనే ఉన్నారు. హిందూ అతివాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా భారత్‌లో కూడా ప్రేమికుల రోజును ఘనంగానే జరుపుకుంటున్నారు. ప్రేమకు, మధుర భావాలకు చిహ్నంగా సినీ ప్రేక్షకుల హదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన బాలీవుడ్‌ సినీ తార మధుబాల పుట్టింది కూడా ఈ రోజే. 

మధుబాల అసలు పేరు ముంతాజ్‌ జెహాన్‌ బేగమ్‌ డెహ్లావి. ఆమె 1933, ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టారు. నిజజీవిత ప్రేమలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న మధుబాల పిన్న వయసులోనే 1969, ఫిబ్రవరి 23వ తేదీన ముంబైలో మరణించారు. అలనాటి మేటి నటి దేవికా రాణినే ముంతాజ్‌ జెహానాకు స్క్రీన్ నేమ్‌ను మధుబాలగా సూచించారు. 1947లో రాజ్‌కుమార్‌ సరసన నీల్‌ కమల్‌లో నటించిన మధుబాల ఆ చిత్రానికి మాత్రం ముంతాజ్‌గానే పరిచయం అయ్యారు. ఆ తర్వాత తాను నటించిన అన్ని చిత్రాలకు మధుబాలగా పరిచయం.


 
మహల్‌ (1949), అమర్‌ (1954), మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ‘55 (1955), చల్తీకా నామ్‌ గాడీ (1958), ఔరా బ్రిడ్జీ (1958), మొఘల్‌ ఏ ఆజమ్‌ (1960), బర్సాత్‌ కీ ఏక్‌ రాత్‌ (1960) సినిమాలతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. కటిక దారిద్య్రం, సామాజిక దోపిడీ, సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, దుర్భర జీవితాల ఇతివృత్తాలు కలిగిన సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మొఘల్‌ ఏ ఆజమ్‌ చిత్రంలో అనార్కలీ పాత్రలో చెరగని ముద్రవేసి వెండితెరకు దూరమయ్యారు. 

బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ను ప్రేమించి, ప్రముఖ గాయకుడు కిషోర్‌ కుమార్‌ను పెళ్లి చేసుకొని ప్రేమాయణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె తన 27వ ఏటనే జబ్బు పడ్డారు. చిత్రమైన గుండె జబ్బుతో ఆమె మంచం పట్టారు. శరీరంలో రక్తం పంపింగ్‌ ఎక్కువ జరిగి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం కార్చేవారు. ఆమె శరీరం నుంచి వైద్యులు ఎప్పటికప్పుడు రక్తాన్ని బయటకు తీసేవారు. తొమ్మిదేళ్లపాటు మంచానికి పరిమితమై మానసికంగా, శారీరకంగా చిక్కి శల్యమై 1969లో శాశ్వతంగా కన్నుమూశారు. ప్రేక్షకజన హృదయాల్లో మధుబాల శాశ్వతంగా నిలిచిపోయారని, వాలెంటైన్స్‌ డే రోజున ఆమె తప్పక గుర్తొస్తారని ఆమె సోదరి మధూర్‌ బ్రిజ్‌ ఎప్పుడూ అనేవారు. ఆశాభోంస్లే ఆమెకు పాడిన పాటలు అచ్చం మధుబాల పాడినట్లే అనిపిస్తాయి. ఆమెను మరిచిపోయినా ఆ పాటలు మాత్రం ఆమెను ఇప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top