'2 కంట్రీస్' మూవీ రివ్యూ

2 Countries Movie review - Sakshi

టైటిల్ : 2 కంట్రీస్
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్
తారాగణం : సునీల్, మనీషా రాజ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, 30 ఇయర్స్ పృథ్వీ
సంగీతం : గోపీ సుందర్‌
నిర్మాత, దర్శకత్వం : ఎన్. శంకర్

హాస్యనటుడిగా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్ తీసుకున్న సునీల్.. కథానాయకుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోతున్నాడు. హీరోగా ఒకటి రెండు విజయాలు దక్కినా.. వరుస ఫ్లాప్ లతో కెరీర్ కష్టాల్లో పడింది. జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత దర్శకుడు ఎన్ శంకర్ మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందించిన 2 కంట్రీస్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సునీల్. మరీ ఈ సినిమాతో అయినా సునీల్ హీరోగా సక్సెస్ సాధిస్తాడా..? లాంగ్ గ్యాప్ తరువాత వచ్చిన ఎన్.శంకర్ మరో విజయాన్ని సాధించాడా..?

కథ :
ఉల్లాస్ కుమార్ (సునీల్) బాధ్యత లేకుండా ఈజీ మనీ కోసం ప్రయత్నించే పల్లెటూరి కుర్రాడు. తను డబ్బు సంపాదించటం కోసం ప్రాణ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందుల్లోకి నెడుతుంటాడు. పటేల్ అనే రౌడీ దగ్గర తను తీసుకున్న అప్పును తీర్చలేక వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. (సాక్షి రివ్యూస్) అయితే అదే సమయంలో ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి  స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది. ఆమె కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ వాళ్ల సంబంధం కాదని లయను పెళ్లి చేసుకుంటాడు.

చిన్నతనంలో అమ్మ నాన్నలు విడిపోవటంతో లయ మద్యానికి బానిసవుతుంది. ఉల్లాస్ అయితే తన అలవాట్లకు అడ్డురాడన్న నమ్మకంతో అతడితో పెళ్లికి అంగీకరిస్తుంది. అయితే పెళ్లి తరువాత లయ గురించి నిజం తెలుసుకున్న ఉల్లాస్, లయతో మందు మాన్పించే ప్రయత్నం చేస్తాడు. లయ గతం తెలుసుకొని ప్రేమతో ఆమెను మామూలు మనిషిని చేయాలనుకుంటాడు. ఉల్లాస్ ప్రేమను లయ అర్థం చేసుకుందా..? ఈ ప్రయత్నంలో ఉల్లాస్ ఎలాంటి ఇబ‍్బందులు ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు :
హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు కష్టాలు పడుతున్న సునీల్, 2 కంట్రీస్ సినిమా విజయం కోసం తనవంతు ప్రయత్నం చేశాడు. తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది. (సాక్షి రివ్యూస్) మద్యానికి బానిసైన పొగరుబోతు అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంది. ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, నరేష్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

విశ్లేషణ :
మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగు ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించటంలో దర్శకుడు ఎన్.శంకర్ ఫెయిల్ అయ్యాడు. సునీల్ గత చిత్రాల్లో కనిపించిన రొటీన్ కామెడీ సన్నివేశాలతో సినిమాను నడిపించిన దర్శకుడు నిరాశపరిచాడు. రెండు గంటల 40 నిమిషాల సినిమా నిడివి కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది. గోపిసుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. రెండు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా ఆకట‍్టుకుంటుంది. (సాక్షి రివ్యూస్) సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి. పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్ :
కథా కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top