ప్రమాద ఘంటికలు

ground water levels decreasing in medak district - Sakshi

పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు

ప్రతియేటా పెరుగుతున్న బోరుబావుల సంఖ్య

నిరంతర విద్యుత్‌తో సమస్య మరింత జటిలం

మెదక్‌:  జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో సాగు నీరు కోసం రైతన్న భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాడు. పాతాళగంగను పైకి తెచ్చేందుకు ప్రతి ఏటా విరివిగా బోర్లు తవ్వుతూనే ఉన్నారు. దీని కోసం లెక్కకు మించిన అప్పులు చేసి మరీ బోర్లు వేస్తున్నారు. విచ్చలవిడిగా బోర్లు తవ్వడంతో  భూగర్భ జలాలు   ప్రమాదస్థాయికి  పడిపోయాయి.  జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 1.30 లక్షల బోర్లు పనిచేస్తున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన బోర్లు 90 వేలు ఉండగా 10వేల బోర్లు గృహ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మరో 30 వేల బోర్లు తాగునీటి కోసం, కంపెనీల యజమాన్యాలు తవ్వినవి.
 కొన్ని గ్రామాలకు మాత్రమే..
సరైన వర్షాలు లేకపోవడంతో  పాతాళంలోనుంచి నీటిని బోర్లు  ఎత్తిపోస్తున్నాయి. ఫలితంగా ప్రమాదస్థాయికి నీరు పడిపోయింది.  జిల్లాలో పాపన్నపేట, మండలంతోపాటు మెదక్, కొల్చారం, హవేళిఘణాపూర్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలకు మాత్రమే ఘనపూర్‌ ప్రాజెక్టు నుంచి ఎఫ్‌ఎం, ఎంఎ కాల్వలద్వారా  సాగు నీరందుతోంది.   కొంతకాలంగా  సరైన వర్షాలు లేక చెరువు, కుంటలు నెర్రలు బారాయి. దీంతో సాగునీటికోసం రైతులు పోటీపడి మరి బోర్లుతవ్వుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకదగ్గర జిల్లాలో  40 నుంచి 50 వరకు బోర్లు తవ్వుతున్నారు.  ప్రస్తుతం ఎండలు ముదురుతున్న క్రమంలో ఈ సంఖ్యామరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతున్నారు.  కాగా పాలకులు, అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే  ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నీటి జాడ కరువు
గతంలో బోరుబావిని తవ్వాలంటే 250  అడుగుల లోతు వేసేవారు. నేడు ఏకంగా 350 నుంచి 400 ఫీట్ల లోతుకు వెళ్తే తప్ప నీరు కనిపించని దుస్థితి. కొన్న చోట్ల ఎంత కిందకు వెళ్లినా నీటిజాడ దొరకని మండలాలు అనేకం ఉన్నాయి.  సాగునీటికోసం చేసే ప్రయత్నంలో రైతులు అప్పుల పాౖలౌవుతున్నారు.    

ప్రమాద స్థాయిలోకి..
వ్యవసాయానికి ప్రభుత్వం   24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడంతో ఈ సమస్య మరింత జటిలమవుతుంది. దీంతో రైతులు స్థాయికి మించి పంటలను సాగు చేస్తున్నారు.  బోరుబావిలో వచ్చే నీటిని కాకుండా   సదరు రైతుకు బోరువద్ద ఎంత భూమి ఉంటుందో పూర్తి స్థాయిలో సాగు చేస్తున్నాడు.  ఈ క్రమంలో సాగుచేసిన పంటకు నీటి తడులు అందక పోవడంతో    24 గంటల పాటు బోరును నడిపిస్తున్నాడు. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతూ ప్రమాద స్థాయికి చేరుతున్నాయి.

నీటి తడులు అందడం లేదు..
నాకున్న రెండు ఎకరాల  భూమిలో ఇటీవలే   రెండు బోర్లువేశాను. ఒక దాంట్లో మాత్రమే కొద్దిపాటిగా నీరు వచ్చింది.  ఆనీటి ఆధారంగా ఎకరం పొలంలో వరి నాటు వేశాను.  కాగా ఆ నీటితో పొలానికి  సరిపడ నీటితడులు అందడం లేదు.   పంటను రక్షించుకోవాలనే తాపత్రయంతో  మరో బోరు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.    –బాగయ్య, రైతు 

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top