విదేశీ వైద్యులకు గుంటూరులో శిక్షణ

బంగ్లాదేశ్‌తో సాయిభాస్కర్‌ హాస్పటల్‌ ఒప్పందం

విలేకరుల సమావేశంలో డాక్టర్‌ నరేంద్రరెడ్డి వెల్లడి

గుంటూరుమెడికల్‌: మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు(జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ) ఎలా చేయాలనే విషయాలను నేర్చుకునేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన వైద్యులు గుంటూరు రానున్నారు. బంగ్లాదేశ్‌ ఆర్థోపెడిక్‌ సొసైటీతో గుంటూరు సాయిభాస్కర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ అధినేత, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఒప్పందం చేసుకున్నారు. గుంటూ రు అరండల్‌పేటలోని ఆస్పత్రిలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ నరేంద్రరెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఈనెల 3న బంగ్లాదేశ్‌ ఆర్థోపెడిక్‌ సొసైటీ కాన్ఫరెన్స్‌–2018 జరిగినట్టు తెలిపారు. సదస్సులో తాను పాల్గొని ఢాకాలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మోకీళ్ల మార్పిడి లైవ్‌ ఆపరేషన్‌ చేసి వివరించానన్నారు.

గుంటూరులోని తమ ఆస్పత్రిలో బంగ్లాదేశ్‌ యువ వైద్యులకు ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తామని, రెండు నెలల్లో శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు.  ప్రతి ఆరునెలలకు నలుగురు ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌కు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో ఇండోనేషియా రాజధాని జకార్తా వెళ్లి అక్కడి వైద్యులకు కూడా గుంటూరులో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకోనున్నామని తెలిపారు. మెడికల్‌ హబ్‌గా మారుతున్న గుంటూరులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వైద్యసేవలను అందిస్తున్న నేపథ్యంలో విదేశాలకు చెందిన రోగులు సైతం ఆపరేషన్ల కోసం ఇక్కడకు వస్తున్నారని వెల్లడించారు. విలేకరుల ఆస్పత్రి సీఈఓ డాక్టర్‌ యరగూటి సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top