నట్టేట ముంచిన ‘నకిలీ’లు

Problems Faced by the Farmers due to Duplicate Seeds in khammam - Sakshi

తుమ్మలపల్లిలో గిర్‌ కీని విత్తనాలతో నష్టపోయిన రైతులు

 పట్టించుకోని కంపెనీ ప్రతినిధులు    

కొణిజర్ల : పంట వేయడానికి విత్తనాలు మేమే ఇస్తాం.. కొంత పెట్టుబడి మేమే పెడతాం.. మీరు పండించిన పంటను తిరిగి మేమే కొనుగోలు చేస్తాం.. మీరు చేసేదల్లా జాగ్రత్తగా పంటను పండించడమే.. ఇక మీకు లాభాలే లాభాలు.. ఎకరానికి రూ.40 వేల నుంచి రూ. 50 వేలు మిగులుతాయి.. కొత్త రకం పంట ఇది.. విదేశాల్లో ఔషదాల తయారీలో ఉపయోగించే కాయలు ఇవి.. మీరు పండించండి.. లాభాలు గడించండి.. అని కంపెనీ ప్రతినిధులు నమ్మబలికారు. నిజమే కాబోలు అని అక్కడి వారు నమ్మేశారు. కాయలు కాశాయి.. దిగుబడి వచ్చింది.. విక్రయించే సమయానికి ఆశించిన రీతిలో పరిస్థితులు లేవు. మీ ప్రాంత వాతావరణం పంటకు సరిపోలేదు.. ఈ కాయలకు మార్కెట్‌లో రేటు ఉండదు అని కొనకుండా వెనుదిరిగి పోయారు. దీంతో తామంతా మోసపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన మండలంలోని తుమ్మలపల్లిలో జరిగింది.

తుమ్మలపల్లికి చెందిన కుంచపు సీతారాములు, దండు ఆదినారాయణ, చల్లా ఆదినారాయణ, ఉప్పతల వీరయ్య, జోగు సత్యనారాయణ, బండారు వెంకన్న, మరికొంత మంది రైతులు ఓ ప్రైవేట్‌ కంపెనీ చెప్పిన మాయమాటలు నమ్మి గిర్‌ కీని అనే రకం పంట విత్తనాలు పెట్టారు. కీరా దోస రకం లాగానే ఉండే ఈ కాయలు ఔషదాల తయారీలో వినియోగిస్తారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రెండు రకాల కాయలను గ్రేడింగ్‌ చేసి కిలో రూ.18, రూ.14 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు నమ్మారు. తలా ఎకరం, రెండు ఎకరాల్లో విత్తనాలు పెట్టారు. 14 మంది రైతులు సుమారు 20 ఎకరాల్లో సాగు చేశారు. కంపెనీ ప్రతినిధులే పెట్టుబడి పెట్టారు. పై మందులు, కూలీల ఖర్చు, ఇతర రసాయన ఎరువులు అంతా కలిపి రైతులకు ఎకరానికి రూ. 20 వేలు వరకు ఖర్చు వచ్చింది.

అంతవరకు బాగానే ఉంది. పంట చేతికి వచ్చిన తర్వాత కంపెనీ ప్రతినిధులు కొనుగోలుకు వచ్చారు. వారి రెండు రకాల జల్లెడలు తెచ్చారు. గిర్‌కీని కాయలను ఆ జల్లెడలో వేసి పట్టారు. తమకు కావాల్సిన సైజ్‌ కాయలు మాత్రమే కొనుగోలు చేసుకుని వెళ్లి పోతున్నారు. మిగిలిన కాయలను రూ. 3, రూ. 4లకు కొనుగోలు చేస్తామని చెప్పారు. రోజుకు ఒక్కో కూలీ 10 కిలోల కాయలు కూడా కోయడం లేదు. దీంతో పంటకు వచ్చే రేటు కూలీలకు ఇచ్చే కూలికి కూడా సరిపోవడం లేదు. గత రెండు రోజుల క్రితం వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. మీ ప్రాంతం ఈ పంటకు అనుకూలంగా లేదని, పంట కొనుగోలు చేయలేమని, ఈ పంట మార్కెట్‌లో అమ్ముడు పోవడంలేదని చెప్పారని రైతులు తెలిపారు. దీంతో చేసేది లేక పశువులను మేపుతున్నారు.  

కొనకపోతే పారబోశా..   
గిర్‌కీనీ కీరా దోసకాయలను సాగు చేశా. దొండకాయల సైజ్‌ కాగానే కోయాలి. అలా కాకుండా ఒక్క రోజు ఆగినా అవి భారీగా పెరిగిపోతున్నాయి. సైజ్‌ పెరిగిన కాయలను తీసుకోవడం లేదు. 11 బస్తాల కాయలను ఖమ్మం మార్కెట్‌కు తీసుకువెళితే కొనలేదు. దీంతో అక్కడే పారబోసి వచ్చా. 
– కుంచపు సీతారాములు, తుమ్మలపల్లి 

రూ. 40 వేలు నష్టపొయా..   
రెండు ఎకరాలలో సాగు చేశా. ఒక్కసారి మాత్రమే పంట కోయించా. రెండు క్వింటాల కాయలు వస్తే రూ. 15 చొప్పున కొనుగోలు చేశారు. మిగిలివి వాటిని రూ. 3 చొప్పున కొనుగోలు చేశారు. కూలీలకు పెట్టిన డబ్బులు కూడా రాలేదు. రూ. 40 వేల వరకు నష్టపోయా. కంపెనీ వారే ఆలోచించాలి. 
– దండు ఆదినారాయణ, తుమ్మలపల్లి  

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top