అక్కడికి వెళ్లాలంటే నగ్నంగా ప్రయాణించాల్సిందే..! | Women are not allowed into the island of Okinoshima | Sakshi
Sakshi News home page

అక్కడికి వెళ్లాలంటే నగ్నంగా ప్రయాణించాల్సిందే..!

Jul 10 2017 4:49 PM | Updated on Sep 5 2017 3:42 PM

పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారస్వత గుర్తింపు లభించింది.



టోక్యో(జపాన్‌):
పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారస్వత గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్లుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాధించటం  ఆచారంగా వస్తోంది. ఈ దీవిలోకి మహిళలకు అనుమతి లేదు. ఆ పవిత్ర ప్రాంతంలో ప్రవేశించే పురుషులు  అక్కడి ఆచారాలను తుచ తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకు గాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో ఒకినోషిమా దీవి ప్రత్యేకత, పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారట. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని, కేవలం పూజారులనే రానిస్తామని చెబుతున్నారు.

అయితే, ఆడవారికి ప్రవేశం నిరాకరించటంపై ఓ అధికారి స్పందిస్తూ.. దీనిపై తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవటం చాలా ప్రమాదకరమని భావిస్తారని, శతాబ్ధాలనాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదని అన్నారు. ఇలాంటి నిషేధాన్ని  మహిళలను రక్షించటానికే పెట్టిఉంటారని అన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని, చైనాను కలిపే చోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లభించాయి.

అవి ఎటువంటి అవరోధాలు లేకుండా సముద్ర ప్రయాణం సాగినందుకు ఇక్కడి దేవతను ఆరాధించిన వ్యాపారులు సమర్పించినవి అయి ఉంటాయని ఆలయ పూజారి మునకత తైషా తెలిపారు. కాగా, ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ ఆదివారం తాజాగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్‌ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్‌ ట్రయాంగిల్‌ కూడా ఉంది. అలాగే, యూకేలో లేక్‌ డిస్ట్రిక్ట్‌, ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగో వార్ఫ్‌ అనేవి కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement