టీచర్లను గౌరవించడంలో భారత్ స్థానం

Where In the World Are Teachers Most Respected - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : ప్రపంచంలో అతి పవిత్రమైన, గొప్పదైన వృత్తి ఏదన్న ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తే. ఎంత గొప్పవారైనా గురువు చేతిలోంచే వెళ్తారు కనుక ఉపాధ్యాయ వృత్తిని అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది. మారుతున్న సమాజం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ, తాను మారుతూ, సమాజాన్ని ముందుకు నడిపించే ఒకే ఒక్కడు.. ఉపాధ్యాయుడు. చీకటిని తొలగించి జీవితంలోను, సమాజంలోనూ వెలుగులు ప్రసారించే గొప్ప వ్యక్తి గురువు. పురాణాల్లో కూడా గురువుకు మంచి గౌరవం ఉంది. గురువును దైవంగా భావించేవారు. మరి ప్రస్తుతం ఉపాధ్యాయులకు ఈ ప్రపంచం ఇస్తున్న గౌరవం ఎంత? సమాజంలో వారిని ఏ దేశంలో ఎక్కువగా గౌరవిస్తున్నారు? ఇదే విషయంపై తాజాగా ‘వర్కీ ఫౌండేషన్’ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే నిర్వహించింది. ఉపాధ్యాయులను అత్యంత గౌరవం ఇచ్చే దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో నిలిచిందని సర్వేలో వెల్లడించింది.

ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మలేసియా, తైవాన్ ఉండగా, భారత్ ఎనిమిదవ ర్యాంకు సాధించింది. బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇటలీ దేశాలు చివరి స్థానాల్లో నిలిచాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న జపాన్‌ లాంటి దేశాల్లో కూడా ఉపాధ్యాయులకు గౌరవం అంతంతమాత్రంగానే ఉంది. కానీ 2013నాటి సర్వేతో పోల్చుకుంటే జపాన్‌, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉపాధ్యాయ గౌరవం 20శాతం మేర పెరిగింది. చైనాలో ఉపాధ్యాయులపై గౌరవం ఉందని 81 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో అది 36 శాతం ఉంది.
 

వీరే ఎక్కువగా టీచర్లను గౌరవిస్తారు
వర్కీ పౌండేషన్‌ సర్వేలో ఏ వర్గానికి చెందిన వారు ఎక్కువగా టీచర్లను గౌరవిస్తున్నారు అనే అంశాన్ని కూడా అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం..వృద్ధులు ఎక్కువ శాతం మేరకు ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు. మహిళల కంటే పురుషులే ఉపాధ్యాయులను ఎక్కువగా గౌరవిస్తున్నారు. నాన్‌గ్రాడ్యూయేట్స్‌ కంటే గ్రాడ్యూయేట్సే టీచర్లకు ఎక్కువ రెస్పెక్ట్‌ ఇస్తున్నారు.సంతానం లేని వారికంటే సంతానం ఉన్న తల్లిదండ్రులే గురువలను గౌరవిస్తున్నారు. యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించడం తక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

35దేశాల్లో గురువులకు ఇచ్చే గౌరవ సూచిక

ఉపాధ్యాయ వృత్తిని ప్రోత్సహించే దేశాలు ఇవే
ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని కోరుకుంటున్నారో కూడా వర్కీ ఫౌండేషన్ అధ్యయనం చేసింది. భారత్, చైనా, ఘనా, మలేషియా దేశాల్లో అత్యధిక కుటుంబాలు తమ పిల్లలను బోధనా వృత్తిని ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. యూఎస్‌లో మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారని తేలింది.ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి చైనా, భారత్, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఆసియా దేశాల్లో బలంగా ఉంది. ఈ దేశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు.

రానున్న రోజుల్లో టీచర్ల పాత్రలో సమాజంలో మరింత కీలకం కానుందని సంస్థ వెల్లడించింది. టెక్నాలజీ పరంగా యువతకు మార్గదర్శకంగా ఉపాధ్యాయుడు ఉండబోతున్నారని పేర్కొంది. ఉపాధ్యాయలకు మంచి గౌరవం లభించినప్పుడు ఆ వృత్తిని ఎంచుకునేందుకు ప్రతిభావంతులు ఎక్కువగా ముందుకొస్తారని, దాంతో చదువుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top