మూకదాడి.. మనమే గెలుస్తాం: ట్రంప్‌

Trump Compares Impeachment Inquiry With Lynching Get Outrage - Sakshi

వాషింగ్టన్‌ : తనను అధికారం నుంచి తొలగించడానికి ప్రతిపక్ష డెమొక్రాట్లు తీసుకువచ్చిన అభిశంసన తీర్మానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూక దాడితో పోల్చారు. డెమొక్రటిక్‌ పార్టీ నాయకుడు అధ్యక్షుడైన నేపథ్యంలో... వారి తరహాలోనే తాము కూడా ఎలాంటి న్యాయ పరమైన ప్రక్రియ లేకుండానే వారిని గద్దె దింపుతామని పేర్కొన్నారు. ఈ మేరకు...‘ఏదో ఒకరోజు డెమొక్రాట్‌ అధ్యక్షుడు అయి... స్వల్ప తేడాతో రిపబ్లికన్లు హౌజ్‌ను సొంతం చేసుకున్నట్లయితే.... అప్పుడు వాళ్లు ఎలాంటి న్యాయ ప్రక్రియ లేకుండానే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగలరు. కాబట్టి ఇప్పుడు డెమొక్రాట్లు చేస్తున్న మూకదాడిని(మూక దాడులకు శిక్షలు పడవు అన్న ఉద్దేశంతో) ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అయితే మనమే గెలవబోతున్నాం’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ఈ క్రమంలో ప్రతిపక్షాలు, సామాజికవేత్తలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం ట్రంప్‌ తీరును విమర్శిస్తున్నారు. అత్యంత హేయమైన మూక దాడులను అభిశంసనతో పోల్చడం ఆయన మూర్ఖత్వం, భాషా పరిఙ్ఞానానికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. కాగా అమెరికా చరిత్రలో 1882 నుంచి 1968 మధ్య దాదాపు 4700 మూక హత్యలు జరిగాయి. వీరిలో ఎక్కువ మంది బాధితులు శ్వేతజాతీయేతర వారు అందులోనూ ముఖ్యంగా ఆఫ్రికా నుంచి వలసవచ్చిన వారు. ఇక అనధికారికంగా మరెన్నో మూక హత్యలు జరిగాయని ఈ మేరకు నాప్‌(ది నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్‌‍్డ పీపుల్‌) పేర్కొంది. 

ఇక సోషల్‌ మీడియాలో సైతం ట్రంప్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అసలు మూక హత్య అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా ట్రంప్‌? 14 ఏళ్ల నల్లజాతి బాలుడిపై ఓ శ్వేతజాతి మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు మోపి అతడి దారుణ హత్యకు కారణమైంది. అమెరికన్ల జాత్యహంకారాన్ని ప్రపంచాన్ని చూపించేందుకు వాళ్ల అమ్మ... అతడిని శవపేటికలో నుంచి బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించింది. మీరేమో అభిశంసనను మూక హత్య అంటున్నారు’ అని నెటిజన్లు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆయనకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రతినిధుల సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా ట్వీట్‌తో మరోసారి తన వైఖరి బయటపెట్టారు.

ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ నాయకుడు జోయ్‌ బైడన్‌ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్‌ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌లో బైడన్‌ కుమారుడు హంటర్‌ బైడన్‌కు భారీగా వ్యాపారాలున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్‌ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్‌ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే ట్రంప్‌ మాత్రం వీటిని కొట్టిపడేశారు.

అభిశంసన అంటే..?
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గద్ద దింపే ప్రక్రియే అభిశంసన. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడితే అభిశంసించే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు ఉంది.

ప్రక్రియ ఎలా ?
అధ్యక్షుడిని అభిశంసించి గద్దె దింపడం సులభమేమీ కాదు. దీనికి సుదీర్ఘమైన న్యాయప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ విచారిస్తుంది. అక్కడ ఆరోపణలు రుజువైతే 435 మంది సభ్యులు కలిగిన ప్రతినిధుల సభ సాధారణ మెజారీటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top