మీ లోపాలు ఎత్తి చూపితే ట్రంప్‌తో పోలుస్తారా..?

Tesla Inc Executive Elon Musk Start A Website That Analyze Credibility Of Media - Sakshi

న్యూయార్క్‌ : ‘జర్నలిజం అతి పురాతనమైన, పవిత్రమైన వృత్తి. ఒకప్పుడు వార్తాపత్రిక అంటే విశ్వసనీయతకు మారుపేరు. మరి నేడు.. అధికారంలో ఎవరూ ఉంటే వారికి కొమ్ముకాసి, భజన చేసి ప్రజల దృష్టిలో వారిని దేవుళ్లను చేసి అసలు నిజాలను ప్రజలకు తెలియకుండా.. తాము చెప్పిందే అక్షరసత్యంగా భ్రమింపచేసే అందమైన అబద్ధంగా మారింది. సమాజంలో ఉన్న అన్ని పత్రికలు ఇలానే ఉంటాయని చెప్పడం లేదు. కానీ ఎక్కువ శాతం ఇలానే ఉంటాయనేది బహిరంగ రహస్యం. పత్రికలకైనా, విలేకరులకైనా ముఖ్యంగా ఉండాల్సింది విశ్వసనీయత. కానీ నేడది నేతి బీరకాయ చందంగా తయారైంది.

విలువలు పాటించడంలో తమకు సాటి మరెవరూ లేరని బీరాలు పలికే పత్రికా యజమాన్యాల అసలు రూపం అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం మాత్రమే. ఈ పరిస్థితిని మార్చడానికి నేను ఒక నూతన మార్గాన్ని కనుగొన్నాను. ఇందుకు గాను నేను ఒక వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రతి జర్నలిస్టు విశ్వసనీయతకు మార్కులు ఇవ్వొచ్చు. మీరు చదివే ప్రతి కథనానికి సంబంధించి అసలు వాస్తవాలను తెలపవచ్చు. దాని ఆధారంగా సదరు పత్రిక, దాని యాజమాన్యం, ఆ విలేకరి విశ్వసనీయతను విశ్లేషించి మార్కులు ఇవ్వొచ్చు’ అంటున్నారు  ప్రపంచ బిలియనీర్‌, స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ యజమాని, టెస్లా ఇంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎలన్‌ మస్క్‌.

ఎలన్‌కు మీడియా మీద ఇంత కోపం రావడానికి కారణం.. కొన్ని నెలలుగా టెస్లా కంపెనీ విడుదల చేసిన సెడాన్‌ మోడల్‌ 3 కార్ల గురించి మీడియాలో వరుసగా ప్రతికూల కథనాలు ప్రచురితమవుతున్నాయి. పోయిన వారం కూడా ఒక ప్రముఖ వార్త పత్రిక టెస్లా కంపెనీ సెడాన్‌ మోడల్‌ 3 కార్‌లో బ్రేకింగ్‌ వ్యవస్థ సరిగా లేదని.. అంతేకాక సెడాన్‌ మోడల్‌ 3 కార్లు ఎక్కువగా క్రాష్‌ అవుతున్నాయని ప్రచురించింది. దీనిపై స్పందిస్తూ ఎలన్‌ త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ప్రమాణం చేశారు. తమ కార్లకు సంబంధించి ఎన్నో మంచి విషయాలు ఉన్నా కూడా మీడియా సంస్థలు లోపాలనే ఎక్కువగా ప్రచురించి ప్రజల్లో కంపెనీ పట్ల ఉన్న నమ్మకాన్ని నీరుగార్చటంతో తానే స్వయంగా మీడియా రంగంలోకి ప్రవేశించాలని భావించారు మస్క్‌.

దాన్ని గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. పత్రికల వారికి అసలు నిజాలు తెలిసినప్పటికీ వారు చక్కర పూత పూసిన తియ్యని అబద్దాలనే ప్రచారం చేస్తారు. ఎందుకంటే తమ వెబ్‌సైట్లను/ పత్రికలను ఎక్కువ మంది చూడాలని వారు కోరుకుంటారు. ఎంత ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌/పత్రికను చూస్తే వారికి అంత ఎక్కువ మొత్తంలో ప్రకటనలు వస్తాయి. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. అందుకే వారు ఎక్కువగా అహేతుకమైన వాటినే ప్రచురిస్తారని మస్క్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితిని మార్చడానికి తాను ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. ఈ ఆలోచన తనకు పోయిన ఏడాదిలో వచ్చిందని వెంటనే తన ఆలోచనను తమ న్యూరాలింక్‌ కంపెనీ అధ్యక్షుడితో పంచుకున్నానన్నారు.

దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మేము ‘ప్రావ్దా క్రాప్‌(సత్యం) వెబ్‌ సైట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రావ్దాను కాలిఫోర్నియాలో రిజిస్టర్‌ చేయించడం కూడా జరిగిందన్నారు. ఈ విషయాన్ని మస్క్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే దాదాపు 54 వేల మంది ఎలెన్‌కు తమ మద్దతును తెలిపారు. అయితే ఎలన్‌ వెబ్‌సైట్‌ గురించి టెక్‌ వెబ్‌సైట్‌లో ట్రాన్స్‌పోర్టేషన్‌ రిపోర్టర్‌గా పనిచేసే ఆండ్రూ జే. హకిన్స్‌ ట్రంప్‌ గురించి ప్రచారం చేయడానికి మరో కొత్త మీడియా రంగంలోకి ప్రవేశిస్తోందని వ్యాఖ్యానించారు.

దీనికి స్పందిస్తూ ఎలన్ ‘అంటే ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని(మీడియా) విమర్శిస్తే మీరు వారిని ట్రంప్‌తో పోలుస్తారన్నమాట. మంచిది మరి ఎన్నికల సమయంలో మీరు ట్రంప్‌ గురించి ఎంత చెడుగా ప్రచారం చేసిన అతనే గెలిచారు. ఇది ఎందువల్ల జరిగిందో మీకు తెలుసా ఎందుకంటే ప్రజలకు మీ మీద విశ్వాసం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే మీరు దానిని కోల్పోయారు’ అని రీట్విట్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top