పండ్లు, కూరగాయలపై సబ్సిడీ ఇస్తే..?

Subsidy on fruits, vegetables may help reduce death risk - Sakshi

న్యూయార్క్: పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ధరలను తగ్గించగలిగితే వేలాది ప్రాణాలను రక్షించవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో పాటు జంక్‌ఫుడ్స్‌, రెడ్‌మీట్‌, చక్కెరతో తయారయ్యే శీతల పానీయాలు, తినుబండారాలపై పన్ను రేట్లు పెంచి డయాబెటిస్‌, కార్డియోవాస్కులర్‌ వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని రుజువైంది. బోస్టన్‌లోని టఫ్ట్స్‌ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జోస్‌ ఎల్‌. పెనల్వో ఈ విషయం వెల్లడించారు. ఆహారంలో ప్రముఖంగా ఉండే.. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గింజలు, శుద్ధి చేసిన శుద్ధి చేయని రెడ్‌ మీట్‌తో పాటు షుగర్‌ కలిపిన డ్రింక్స్‌ వంటి వాటి ధరలను పదిశాతం మారిస్తే ఏడాదికి దాదాపు 23 వేల మరణాలను తగ్గించగవలని ఆ పరిశీలనలో తేలింది.

అదే వీటి ధరల్లో 30 శాతం మార్పు చేస్తే 9.2 శాతం కార్డియోవాస్కులర్‌ వ్యాధుల మృతులను, అంటే దాదాపు 63 వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని వెల్లడైంది. ఆరోగ్య కారకాలైన పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాల వంటి ఆహార పదార్థాల ధరలను తగ్గించటం, అనారోగ్యానికి కారణమయ్యే జంక్‌ఫుడ్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి వాటి రేట్లను పెంచటం వల్ల కార్డుయోవాస్కులర్‌ వ్యాధుల కారణంగా కలిగే మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయి. అంతేకాదు, శీతల పానీయాలపై పన్నులను అధికంగా వేసినప్పుడు డయాబెటిస్‌ కేసులు తగ్గాయని తేలింది.

దీంతో పాటు పండ్లు, కూరగాయలపై సబ్సిడీలు ఇవ్వటం వల్ల గుండె జబ్బులు, మరణాలు తగ్గుముఖం పట్టినట్లు తేలిందని బీఎంసీ మెడిసిన్‌ జర్నల్‌లో ఇటీవల ఓ వ్యాసం కూడా ప్రచురితమైం‍ది. పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు కొనుగోలు చేసే వారికి పారితోషికాలు, ప్రోత్సాహకాలు ఇవ్వటంతో పాటు కూల్‌డ్రింక్స్‌, జంక్‌ఫుడ్ కొనుగోలు దారులపై అదనపు రుసుము వసూలు చేసిన సందర్భంలోనూ మంచి ఫలితాలు కనిపించాయని ఆ వ్యాసం వెల్లడించింది. వ్యాధుల తీవ్రతలో గణనీయమైన తరుగుదల కనిపించిందని వివరించింది. సమాజంలోని దిగువ తరగతుల వారి కొనుగోలు శక్తికి తగ్గట్టుగా మంచి ఆహారాన్ని అందుబాటులోకి తేవటం ప్రభుత్వా‍ల లక్ష్యంగా ఉండాలని సూచించింది. ఇలా చేస్తే లక్షలాది మందిని వ్యాధుల బారి నుంచి రక్షించవచ్చని వివరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top