పొట్టి మానవులు ఉన్నారా?
1932 లో శాన్‌పెడ్రో పర్వతాల్లో సెసిల్ మన్, ఫ్రాంక్ కర్ అనే ఇద్దరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు.
1932 లో శాన్‌పెడ్రో పర్వతాల్లో సెసిల్ మన్, ఫ్రాంక్ కర్ అనే ఇద్దరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. అంతలోనే లోహం తగిలిన శబ్దం. ఇరువురి కళ్లలో ఆనందం. ఎన్నో సంవత్సరాల తమ కల ఫలించిందనే ఉత్సాహంతో మరింత వేగంగా తవ్వకం జరిపి ఆరున్నర అంగుళాల ఓ పెట్టెను బయటకు తీశారు. అందులో ఓ మరగుజ్జు మమ్మీ ఉండాటాన్ని గుర్తించారు. పెట్టెలో కేవలం ఆరున్నర అంగుళాలున్న మరగుజ్జు మానవ మమ్మీని బయటకు తీసి నిలబెడితే 14 అంగుళాల పొడవు ఉంది. దీంతో ఆ మమ్మీ అతి విలువైనదిగా భావించిన ఇరువురు కొన్ని సంవత్సరాల తర్వాత ఓ కార్ల వ్యాపారికి అమ్మారు.
ఆ మమ్మీని కొంతకాలం పాటు ప్రదర్శనకు ఉంచి డబ్బు సంపాదించిన వ్యాపారి మరొకరికి ఇచ్చాడు. ఆ వ్యక్తి మమ్మీని ఓ శాస్త్రవేత్త వద్దకు తీసుకెళ్లి ఎక్స్‌రే పరీక్ష చేయించగా.. అది ఓ 65 ఏళ్ల వృద్ధుడి మమ్మీ అని తెలిసింది. ఎక్స్ రేలో మానవ అస్ధిపంజరం స్పష్టంగా కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన శాస్త్రవేత్త పొట్టి మానవులు ఉండేవారని ధ్రువీకరించాడు. ఈ మమ్మీని 1950లో మరో శాస్త్రవేత్త పరిశోధన కోసం తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ మమ్మీ ఏమయిందో ఎవరికీ తెలియదు.
ఈ మరుగుజ్జు మానవులు ఎవరు?
ఉత్తర అమెరికా ప్రాచీన జానపద సాహిత్యంలో ఈ మరుగుజ్జు మానవుల గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీళ్లు నిమరిగర్ అనే తెగకు చెందిన వారని, బాణాలను ఉపయోగిస్తుంటారని, వయివోమింగ్‌లోని విండ్ నది, పెడ్రో కొండల్లో వీళ్లు నివసిస్తారని అందులో ఉంది. బాణాలకు విషం పూసి స్ధానిక ప్రజలపై దాడులు చేసేవారని జానపద సాహిత్యం ద్వారా తెలుస్తోంది. వీళ్లను స్థానికులు బూచోళ్లు అని, రాక్షసులు, భూతాలు అని పిలిచేవారు.
తిరుపతిలోనూ ఉన్నారా?
తిరుపతి శేషాచలం అడవిలో బూచోళ్ల పేటు అనే ఓ ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా కేవలం కొన్ని అంగుళాల పొడవు ఉన్న మనుషులు ఉన్నారని స్థానికులు పేర్కొంటారు. వాళ్లను స్థానికులు బూచోళ్లు అని పిలుస్తుంటారు. ఈ బూచోళ్లు తమ బాణాలను పదును చేసుకునే ఆనవాళ్లను ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నాయని వారు చెప్తారు.