బిన్‌ లాడెన్‌ కుమారుడు హతం! | Osama bin Laden's son Hamza killed | Sakshi
Sakshi News home page

బిన్‌ లాడెన్‌ కుమారుడు హతం!

Aug 2 2019 3:26 AM | Updated on Aug 2 2019 5:15 AM

Osama bin Laden's son Hamza killed - Sakshi

హమ్జా బిన్‌ లాడెన్‌

వాషింగ్టన్‌: ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడు, అల్‌కాయిదా కీలక నేత హమ్జా వైమానిక దాడుల్లో హతమైనట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. హమ్జా మరణించినట్లు ముగ్గురు అమెరికా అధికారులు స్పష్టం చేశారని, అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాలను వారు వెల్లడించలేదని ఎన్‌బీసీ న్యూస్‌ పేర్కొంది. దీని వెనుక అమెరికా హస్తం ఉందా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. గత రెండేళ్లుగా సాగుతున్న ఓ ఆపరేషన్‌లో భాగంగా హమ్జా హతమైనట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా చెప్పింది.

ఎన్‌బీసీ కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అంగీకరించలేదు.. కనీసం ఖండిం చనూ లేదు. అల్‌కాయిదాలో కీలక నేతగా ఎదుగుతున్న హమ్జాను పట్టించిన వారికి దాదాపు రూ.7 కోట్లు బహుమతిగా ఇస్తామని 2019 ఫిబ్రవరిలో అమెరికా ప్రకటించడానికి ముందే అతడు మరణించినట్లు ఎన్‌బీసీ, న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాలను బట్టి తెలుస్తోంది. లాడెన్‌ 20 మంది సంతానంలో 15వ కుమారుడైన హమ్జా.. లాడెన్‌ మూడో భార్య కొడుకు. కాగా, హమ్జాకు 30 ఏళ్ల వయసున్నట్లు భావిస్తున్నారు.

జిహాద్‌కు పట్టపు యువరాజుగా పేర్కొంటున్న హమ్జా.. అమెరికాపై దాడులు చేయాల్సిందిగా తరచూ వీడియోలు, ఆడియోల రూపంలో పిలుపునిస్తూ ఉండేవాడు. తన తండ్రి లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేవాడు. హమ్జా ఎక్కడున్నాడనే విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఇరాన్‌లో గృహనిర్బంధంలో ఉన్నాడని, అఫ్గానిస్తాన్‌లో ఉన్నాడని, పాకిస్తాన్, సిరియాలో తలదాచుకునే వాడని భావిస్తూ ఉండేవారు. లాడెన్‌ను 2011లో మట్టుబెట్టిన అనంతరం అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్ల ఆధారంగా అల్‌కాయిదాను ముందుండి నడిపేందుకు హమ్జాను జాగ్రత్తగా పెంచుతున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement