
లిమా(పెరూ) : కరోనా మహమ్మారితో పెరూలోని మిగల్ క్యాస్ట్రో జైలులో పెద్ద దుమారం చెలరేగింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వార్తలతో, భయాందోళనకు గురైన ఖైదీలు, తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పెరులో సుమారు 600 మంది ఖైదీలకు కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో తమను వెంటనే విడుదల చేయాలంటూ హింసాత్మక చర్యలకు ఖైదీలు దిగారు.
జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించడమే కాకుండా, మంచాలను తగులబెట్టారు. జైలు సిబ్బందిపై కూడా దాడికి యత్నించారు. ఈ హింసాత్మక ఘటనల్లో 9 మంది మృతిచెందగా, 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసు అధికారులు, ఇద్దరు ఖైదీలకు గాయాలయ్యాయి. పెరూలో మొత్తం 31 వేల మందికి కరోనా వైరస్ సోకగా 800 మందికి పైగా మృతిచెందారు.