తప్పిపోయానంటూ పోలీసులకు ఓ కుక్క ఫిర్యాదు 

Lost Dog Walks Into Police Station To Report Himself Missing In Texas - Sakshi

కుక్క విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు కొంతమంది. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. అమెరికాలో టెక్సస్‌ రాష్ట్రంలో ఒక కుక్క స్వయంగా తాను తప్పిపోయానంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు దారి తెలియడం లేదని, యజమానికి తనను అప్పగించమని పోలీసులను వేడుకుంది. తన సైగలతో పోలీసులకు ఇదంతా అర్థమయ్యేలా చెప్పింది.  

ఈ నెల 11న అర్థరాత్రి టెక్సాస్‌లోని ఒడెస్సా పోలీస్ స్టేషన్‌లోకి జర్మన్ షెపర్డ్(ఓ జాతి కుక్క) పరిగెత్తుకుంటూ వచ్చింది. తన సైగలతో తాను తప్పిపోయిన విషయాన్ని పోలీసులకు వివరించింది. కుక్క ప్రవర్తనకు ఫిదా అయిన పోలీసులు.. రాత్రంతా దానిని తమ వద్దనే ఉంచుకున్నారు. దానితో సంతోషంగా ఆడుకున్నారు. కుక్క కూడా పోలీసులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చక్కగా వారితో కలిసిపోయింది. కుక్క తెలివికి ఫిదా అయిన పోలీసులు.. దాని ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ’గత రాత్రి యాదృచ్చికంగా మా స్టేషన్‌లోకి వచ్చిన ఈ తెలివిగల కుక్క.. రాత్రంతా మాతో సరదాగా గడిపింది. మాపై ఎంతో ప్రేమను చూపించింది. అది సురక్షితంగా యాజమాని దగ్గరకు చేరినందుకు సంతోషంగా ఉంది’ అని పోలీసులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

కుక్క మెడలో ఎలాంటి గుర్తింపు ట్యాగ్‌ లేకపోవడంతో దాని యజమానిని గుర్తించడం పోలీసులకు కష్టమైంది. దాని ఫోటోలు వైరల్‌ కావడంతో యజమాని పోలీసులను సంప్రదించి కుక్కును తీసుకెళ్లారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో కుక్క బయటకు పారిపోయిందని, దారి తప్పిపోవడంతో.. అది మైళ్ల దూరంలో ఉన్న పోలీసులు స్టేషన్‌కు వెళ్లిందని యజమాని తెలిపారు. తప్పిపోయానంటూ రక్షణ కోసం తన పెంపుడు కుక్క పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఏదేమైనా కుక్క తెలివికి హాట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top