అదొక ప్రమీలా రాజ్యం..మగవాళ్లకు చోటు లేదు | Kenyan village Umoja where men are BANNED | Sakshi
Sakshi News home page

అదొక ప్రమీలా రాజ్యం..మగవాళ్లకు చోటు లేదు

Aug 20 2015 6:16 AM | Updated on Sep 3 2017 7:48 AM

అదొక ప్రమీలా రాజ్యం..మగవాళ్లకు చోటు లేదు

అదొక ప్రమీలా రాజ్యం..మగవాళ్లకు చోటు లేదు

అదొక ప్రమీలా రాజ్యం. అక్కడంతా మహిళలు, పిల్లలే ఉన్నారు.

నైరోబీ: అదొక ప్రమీలా రాజ్యం. అక్కడంతా మహిళలు, పిల్లలే ఉన్నారు. వారంతా మగవాళ్ల చేతుల్లో ఏదో రకంగా మోస పోయినవారే. వారిలో మూకుమ్మడి రేపులకు గురైనవారు, బాల్య వివాహాలకు బలైనవారు, గృహ హింసను తట్టుకోలేక పారిపోయి వచ్చిన వారూ ఉన్నారు. వారంతా మగ ప్రపంచానికి దూరంగా...స్వేచ్ఛగా, తమ కాళ్ల మీద తాము నిలబడి ఆనందంగా బతుకుతున్నారు. వారే కెన్యా దేశంలోని యుమోజా గ్రామస్థులు. ఉత్తర కెన్యాలోని సాంబూర్ ప్రాంతంలో యుమోజా గ్రామం ఉంది. దీన్ని మొట్టమొదట 1990లో రెబెక్కా లొలోసోలి అనే మహిళా నాయకత్వంలో ఓ 15 మంది బాధిత మహిళలు ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వారిలో ఎక్కువ మంది బ్రిటన్ సైనికుల గ్యాంగ్ రేప్‌లకు గురై భర్తల నుంచి వేధింపులు ఎదుర్కొన్నవారే.


 ఆ గ్రామం ఏర్పడి ఇప్పటికి పాతిక సంవత్సరాలయింది. మగవారి తోడు, నీడ అవసరం లేకుండా ఇంతకాలం స్వతంత్రంగా బతికామన్న ఆనందంలో వారు 25వ గ్రామం వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గ్రామం ఏర్పాటైన సంవత్సరం మినహా వారికి తేదీలు, నెలలు గుర్తులేవు. అందుకనే వారు ఈ ఏడాదంతా తమకు వార్శికోత్సవ పండుగేనని చెబుతున్నారు. 15 మందితో మొదలైన యుమోజి గ్రామంలో ఇప్పుడు 47 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. పిల్లల్లో కొంతమంది బాల్య వివాహాలకు బలై వచ్చిన వారు కాగా, ఎక్కువ మంది ఈ 47 మంది మహిళల పిల్లలే. సెక్స్ కోసం వారు మగవాళ్లను రాత్రిపూట గ్రామంలోకి అనుమతిస్తారు. తెల్లవారక ముందే మగవాళ్లు వెళ్లిపోవాలి. గ్రామంలో ఉండడానికి వీల్లేదు. ‘మగవాళ్లను మేము సక్స్ కోసం ఇప్పటికీ ఇష్టపడతాం. అయితే వారిని మా గ్రామంలో ఉండనీయం. నాకు ఐదుగురు పిల్లలు. వారంతా వేర్వేరు తండ్రులకు పుట్టిన వాళ్లే’ అని ఓ 30 ఏళ్ల యువతి పగలబడి నవ్వుతూ అక్కడికెళ్లిన ఓ మీడియా ప్రతినిధికి చెప్పింది. అందుకే వారి పిల్లల్లో రకరకాల జాతుల లక్షణాలు కనిపిస్తున్నాయి. .


 రకరకాల మగవాళ్ల వేధింపులతో ఈ గ్రామానికి చేరుకున్న తమలో ఎవరికి మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదని, చేసుకునే ప్రసక్తే లేదని సియెరా కెనియా అనే నలభై ఏళ్ల పైబడిన ఓ తల్లి తెలిపింది. ఇక తమ పిల్లలను మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తున్నామని, పెళ్లి చేసుకుంటే మాత్రం వారు ఊరిడిచి వెళ్లి పోవాల్సిందేనని ఆమె చెప్పారు.


 గ్రామస్థులు ప్రధానంగా పూసలతో చేసిన గాజులు, నగలను, వెదురు చాపలను పర్యాటకులకు విక్రయించడం ద్వారా లభించే ఆదాయంతో జీవిస్తున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉండే ఓ నది పక్కన వారు ఓ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ విడిది చేసే పర్యాటకుల కోసం వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వంటచేసి పెడతారు. సమీపంలోని పర్వత ప్రాంతాల్లో విహరించాలనుకునే వాళ్లకు గైడ్‌గా వ్యవహరిస్తారు. గ్రామస్థులు స్థానిక ప్రభుత్వంపై పోరాటం జరిపి ఊరికి ఓ ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో యుమోజా గ్రామం పక్కనే ‘యునిటి’ పేరిట మరో కుగ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు.


 తాజాగా తమకు భూములపై హక్కులు కావాలని గ్రామం మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కెన్యాలో భూములపై హక్కులు మగవాళ్లకే ఉంటాయి. గ్రామం ఏర్పడి తొలినాళ్లలో దాన్ని నాశనం చేసేందుకు ఎన్నోసార్లు దాడులు చేసి విసిగిపోయిన మగవాళ్లు ఇప్పుడు భూమిపై హక్కుల డిమాండ్‌తో మళ్లీ మండిపడుతున్నారు.  ‘యుమోజ్‌విమెన్.నెట్’ పేరిట గ్రామస్థులకు వెబ్‌సైట్ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement