కలిసికట్టుగా ఉగ్ర పోరు

Joint fight on Terrorism says PM Narendra Modi In UNGA speech - Sakshi

ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదం ఏ ఒక్క దేశం సమస్యో కాదని.. ప్రపంచ దేశాలన్నింటికీ అది సవాలుగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి పునాదులుగా నిలిచిన సైద్ధాంతిక భూమికను సైతం ఉగ్రవాదం ధ్వంసం చేస్తోందని, మానవాళికి ఈ మహమ్మారి శాపంగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడం బాధాకరమన్నారు. ఐరాస సాధారణ సభ 74వ సమావేశాలను ఉద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. హిందీలో 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వాతావరణ మార్పులు, అభివృద్ధి దిశగా భారత్‌ తీసుకున్న చర్యలు, ముఖ్య పథకాలు, ఆధునిక సాంకేతికత ప్రభావం.. తదితరాలను ప్రస్తావించారు.

మహాత్ముడి 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచమంతా జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో.. ఐరాస నిర్వహిస్తున్న ఈ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ‘భారత్‌ ప్రపంచానికి యుద్ధాన్ని ఇవ్వలేదు.. బుద్ధిని ఇచ్చింది. శాంతి, అహింసల సందేశాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ‘ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మాకు మళ్లీ అధికారం అందించారు. వారిచ్చిన ఆ అద్భుతమైన తీర్పు కారణంగానే మరోసారి ఈ వేదికపైకి రాగలిగాను’ అని ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో తమ విజయాన్ని గుర్తుచేశారు. ఐరాస వేదికపై మోదీకి ఇది రెండవ ప్రసంగం. గతంలో 2014లో ఇక్కడ ఆయన ప్రసంగించారు. 1996లో ఐరాసలో ఉగ్రవాదంపై సమర్పించిన నివేదికపై దేశాలు ఏకాభిప్రాయానికి రాలేదు.

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు...
వాతావరణ మార్పు..
వాతావరణ మార్పు ప్రతికూల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి విపత్తుల సంఖ్య,  విధ్వంస స్థాయి పెరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే ప్రకృతి విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల కల్పన కోసం భారత్‌ ‘కొయలిషన్‌ ఫర్‌ డిజాస్టర్‌ రెజిలియంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ను ఏర్పాటు చేసింది. వాతావరణ మార్పు ప్రతికూలతలపై సాగుతున్న పోరులో భారత్‌ పాత్ర కీలకం. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ స్థాయిలోనే గ్రీన్‌హౌజ్‌ వాయువులను విడుదల చేస్తున్నప్పటికీ.. వాతావరణ కాలుష్యంపై భారత్‌ పోరాటం గణనీయం. మా శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యం 450 గిగావాట్లు. అంతర్జాతీయ స్థాయిలో సౌరవిద్యుదుత్పత్తి కోసం ఒక కూటమిని ఏర్పాటు చేశాం. 

ఆయుష్మాన్‌ భారత్‌.. 
భారత్‌లో తమ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు ప్రపంచదేశాలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవి దిక్సూచిగా నిలుస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన పరిశుభ్రత కార్యక్రమం ‘క్లీన్‌ ఇండియా మిషన్‌’ను 2014లో ప్రారంభించాం. ఇందులో భాగంగా గత ఐదేళ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చాం. సార్వత్రిక గుర్తింపుగా ఆధార్‌ను తీసుకువచ్చాం. దీన్ని వివిధ పథకాల్లో అమలు చేయడం ద్వారా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను ఆదా చేశాం. 50 కోట్లమందికి లబ్ధి చేకూర్చే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం  ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రారంభించాం. పేదలకు బ్యాంకింగ్‌  వ్యవస్థను దగ్గర చేసే దిశగా 37 కోట్ల జనధన్‌ ఖాతాలు తెరిపించాం. 2022 నాటికి పేదలకు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నాం.

సాంకేతికత.. 
ఆధునిక సాంకేతికత దైనందిన జీవితంలో, ఆర్థిక వ్యవస్థలో, భద్రత,  కనెక్టివిటీ, అంతర్జాతీయ సంబంధాల్లో మార్పులు తెచ్చింది. 21వ శతాబ్దంలో దేశాలు తమ సరిహద్దుల్లోపలే గిరిగీసుకుని కూర్చోలేవు. ప్రపంచం ముక్కలుగా చీలడం ఎవరికీ లాభం కాదు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయతావాదానికి, ఐరాసకుS దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మనదే. 1893లోనే స్వామి వివేకానంద చికాగోలో శాంతి, సంయమనాల భారత సందేశాన్ని అందించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top