
గాజా: పాలస్తీనియన్ ఉగ్రసంస్థ ఇస్లామిక్ జీహాద్ అగ్ర నాయకుడు బాహా అబు అల్ అట్టాను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం జరిపిన ఈ మెరుపు దాడిలో అబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులు కూడా మృతిచెందారు. వీరితో పాటు పది మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడగా.. మరో 25 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇందుకు స్పందనగా ఇరాన్ సహాయంతో ఇస్లామిక్ జీహాద్ సైతం ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేసింది. ఈ క్రమంలో గాజాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మిడిల్ ఈస్ట్ రాయబారి పరిస్థితులను పర్యవేక్షించేందుకు కైరో(ఈజిప్టు రాజధాని)కు పయమైనట్లు సిరియా మీడియా కథనం వెలువరించింది.
కాగా ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరోక్షంగా స్పందించారు. అల్ అట్టాను అతిపెద్ద బాంబుగా అభివర్ణించిన ఆయన.. గాజా- ఇజ్రాయెల్ సరిహద్దులో రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించాడని పేర్కొన్నారు. తమకు ఎవరితోనై శత్రుత్వం పెంచుకునే ఉద్దేశం లేదని... అయితే స్వీయ రక్షణకై ఎంతదూరం వరకైనా వెళ్తామని చెప్పుకొచ్చారు. అయితే అల్ అట్టా హతం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు... ఇస్లామిక్ జీహాద్ గాజాలో తమ నాయకుడి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సందర్భంగా గాల్లోకి తుపాకులు పేల్చిన ఉగ్రవాదులు... ఆలస్యమైదే కావొచ్చు గానీ.. తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ‘ఇజ్రాయెల్ రెండుసార్లు దాడులు చేసింది. సిరియా, గాజాలో యుద్ధాన్ని ప్రకటించింది’ అని ఇస్లామిక్ జీహాద్ నాయకుడు అల్- బాటిష్ పేర్కొన్నాడు. అనంతరం బాంబులతో ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడ్డారు.
ఇక పాలస్తీనియన్ మరో ఉగ్ర సంస్థ ‘హమాస్’ సైతం అట్టా మృతిని తీవ్రంగా పరిగణించింది. ‘క్షమించేది లేదు. ఇజ్రాయెల్‌కు మేమేంటో చూపిస్తాం. యుద్ధం అనేది వస్తే దానికి పూర్తి బాధ్యత వాళ్లదే అని హెచ్చరికలు జారీ చేసింది. కాగా గాజాను పాలిస్తున్న హమాస్.. ఒకప్పుడు ఇస్లామిక్ జీహాదీని తీవ్రంగా వ్యతిరేకించేది. అయితే ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఈ రెండు సంస్థలు ఒక్కటైనప్పటికీ... వాటి మధ్య బంధం నేటికీ బలపడలేదు. ఇక స్వతంత్ర ప్రాంతంగా ఉన్న పాలస్తీనియన్ రాజ్యం గాజాపై ఆధిపత్యం కోసం అటు ఉగ్రసంస్థలు, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ ఎన్నో ఏళ్లుగా పరస్పరం దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. బాంబు దాడులు, సైనికుల కాల్పులు, నిరసనలతో ఎల్లప్పుడూ గాజా రణరంగాన్ని తలపిస్తుంది. మధ్యధరా సముద్ర తూర్పు తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఈజిప్టు వాయువ్య ప్రాంతంతో 11 కిలోమీటర్ల మేర.. ఇజ్రాయెల్‌తో 51 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది.