అత్యధిక ‘హెచ్‌–1బీ’లు భారత్‌కే

Indians accounted for more than 74% of H-1B visas in last two years - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌–1బీ వీసాలు 2016, 2017 సంవత్సరాల్లో భారతీయులకే అత్యధి కంగా దక్కాయి. 2016లో 74.2%, 2017లో 75.6 శాతం హెచ్‌–1బీ వీసాలు భారతీయులకే లభించాయని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. అయితే కొత్తగా హెచ్‌–1బీ వీసాలు పొందిన భారతీయుల సంఖ్య తగ్గిందనీ, పాతవారికే వీసా పొడిగింపులు ఎక్కువగా ఉన్నాయంది.

‘కొత్తగా హెచ్‌–1బీ వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 2016తో పోలిస్తే 2017లో 4.1% తగ్గింది. అదే వీసా పొడిగింపు పొందిన వారి సంఖ్య మాత్రం 12.5 శాతం పెరిగింది’ అని యూఎస్‌సీఐఎస్‌ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను గత నెల 10నే యూఎస్‌ చట్టసభ్యులకు యూఎస్‌సీఐఎస్‌ సమర్పించగా, అందులోని వివరాలు తాజాగా బయటకొచ్చాయి. సాధారణంగా హెచ్‌–1బీ వీసాను తొలిసారి మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

తొలిసారి హెచ్‌–1బీ వీసా పొందిన భారతీయులు 2016లో 70,737 మంది ఉండగా 2017లో ఆ సంఖ్య 67,815కు తగ్గింది. అలాగే 2016లో 1,85,489 మంది భారతీయులకు హెచ్‌–1బీ వీసా పొడిగింపు లభించగా, 2017లో ఆ సంఖ్య 2,08,608కి పెరిగింది. మొత్తంగా 2016లో 2,56,226 మంది, 2017లో 2,76,423 మంది భారతీయులకు హెచ్‌–1బీ వీసాలు లభించాయి. ఆయా సంవత్సరాల్లో జారీ అయిన మొత్తం హెచ్‌–1బీ వీసాల్లో 74 శాతానికి పైగా భారతీయులకే వెళ్లాయనీ, ఆ తర్వాతి స్థానంలో చైనీయులు (2016లో 9.3%, 2017లో 9.4%) ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top